రైళ్లు, స్టేషన్లలో భద్రతా చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2023-07-18T05:06:58+05:30 IST
రైళ్లలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వేలో భద్రతకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
డివిజనల్ రైల్వే మేనేజర్ల సమావేశంలో జీఎం అరుణ్‌కుమార్
హైదరాబాద్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రైళ్లలో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రైల్వేలో భద్రతకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై వివిధ శాఖల ప్రధానాధిపతులతో కలిసి సమీక్షా సమావేశాన్ని సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో నిర్వహించారు. ఇందులో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు, నాందేడ్ డివిజన్లకు చెందిన డివిజనల్ రైల్వే మేనేజర్లు (డీఆర్‌ఎంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రైళ్లు, స్టేషన్లలో భద్రతా అవసరాలను పాటించాలని చెప్పారు. తగిన సంఖ్యలో అగ్నిమాపక పరికరాలతో సహా భద్రతా పరికరాలను నిత్యం అందుబాటులో ఉంచాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందికి భద్రతకు సంబంధించిన అన్ని అంశాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. ఎలక్ర్టికల్, మెకానికల్, సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్, ఆపరేటింగ్, ఇంజనీరింగ్ వంటి వివిధ విభాగాలను కలుపుకొని ఈ నెలలో చేపడుతున్న భద్రతా డ్రైవ్‌ను సమీక్షించారు. వర్షాకాలం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన అధికారులు, సిబ్బందికి సూచించారు. లోకో పైలట్లు, అసిస్టెంట్ లోకో పైలట్‌లతో సహా రన్నింగ్ సిబ్బంది పనివేళలను పరిశీలించారు. సాధ్యమైన చోట సహాయాన్ని అందించేందుకు ఎక్కువ గంటలు నిబంధనల మేరకు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.