Share News

Rythu Bandhu : నేటి నుంచే రైతుబంధు పంపిణీ

ABN , First Publish Date - 2023-12-12T03:12:04+05:30 IST

యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను తక్షణమేప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి

Rythu Bandhu : నేటి నుంచే రైతుబంధు పంపిణీ

నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

ఈసారికి పెట్టుబడి సాయంగా పాత మొత్తమే.. 2 లక్షల మాఫీ కార్యాచరణకు నిర్దేశం

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను తక్షణమేప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలగకుండా మంగళవారం నుంచిపెట్టుబడి సాయం పంపిణీ చేయాలని సూచించారు. వ్యవసాయ శాఖపై సచివాలయంలో సోమవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగానే రైతుబంధు పంపిణీపై ఆదేశాలిచ్చారు. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు రూ.2 లక్షల రుణమాఫీ పథకం అమలుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు నిర్దేశించారు. ఈ సమీక్ష సుమారు మూడుగంటల పాటు జరిగింది. వ్యవసాయ, అనుబంధ శాఖల పనితీరు, చేపడుతున్న పథకాలు, రైతు సంక్షేమం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను చర్చించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్‌ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. కాగా, రైతుబంధు కింద ఈ సీజన్‌కు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ఎకరాకు రూ.5 వేలు పంపిణీ చేయనున్నట్లు తెలిసింది.

Updated Date - 2023-12-12T03:12:05+05:30 IST