అభాగ్యులకు అండగా ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2023-06-04T23:06:09+05:30 IST

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూన్‌ 3: పట్టణాలు స్వచ్ఛతగా ఉండడంతో పాటు వ్యర్థాలను తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ‘మేరీ లైఫ్‌, మేరా క్లీన్‌ సిటీ‘ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మున్సిపాలిల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌) కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిదులు సమకూరుస్తోంది.

అభాగ్యులకు అండగా ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్‌

-మున్సిపాలిటీలో పాత వస్తువుల సేకరణకు శ్రీకారం

-అవసరమున్న వారికి పంపిణీ

-వృథా వస్తువులతో ఆదాయం

-ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్లతో అనేక ఉపయోగాలు

కాగజ్‌నగర్‌ టౌన్‌, జూన్‌ 3: పట్టణాలు స్వచ్ఛతగా ఉండడంతో పాటు వ్యర్థాలను తగ్గించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ‘మేరీ లైఫ్‌, మేరా క్లీన్‌ సిటీ‘ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మున్సిపాలిల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ (రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌) కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిదులు సమకూరుస్తోంది. ఇళ్లల్లో ఉండే పాత వస్తువులు, పుస్తకాలు, ఇతర సామగ్రిని సేకరించడం, అవసరమైన వ్యక్తులకు వాటిని అందించి పునర్వినియోగానికి ప్రోత్సహించడం చేస్తారు. ఇంకా మిగిలిన వస్తువులను రీసైక్లింగ్‌కు విక్రయించడం ద్వారా ఆదాయం సమకూర్చకోవడం ఈ కేంద్రాల లక్ష్యంగా ఏర్పాటు చేశారు.

జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీలో అమలు..

జిల్లాలోని ఏకైక మున్సిపాలిటీలో ఈ కేంద్రాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, అధికారులు ప్రారంభించారు. ఆయా కాలనీల్లోని వృథాగా ఉంచే దుస్తులు, ఇతర వస్తువులు సేకరించాలని నిర్ణయించారు. ఉపయోగించకుండా ఉండే వస్తువులు, ఇతర సామగ్రిని వాడుకునేందుకు ఈ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తేనున్నారు. యాచకులు, పేదప్రజలు వీటిని పునర్వినియోగించుకుని వారి అవసరాలను తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ పథకం ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీలో అధికారులు, సిబ్బంది వార్డుల వారీగా పట్టణ ప్రజలను అవగాహన పరుస్తూ పాతవస్తువులు సేకరించి ఈ కేంద్రానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా వార్డుల్లో తిరిగేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. మహిళాసంఘాల సిబ్బంది సహకారంతో ఆర్‌ఆర్‌ఆర్‌ను సక్సెస్‌ చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలతో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. వృథాగా పడేసి వస్తువుల ద్వారా పెరిగే చెత్తను తగ్గించేందుకు ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్‌లు ఉపయోగకరంగా ఉంటాయని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు.

చక్కని లక్ష్యంతో ప్రారంభం..

చక్కని లక్ష్యంతో ప్రారంభించిన ఈ కేంద్రాలకు ప్రజలు స్పందించి భాగస్వామ్యులు కావాలని అధికారులు కోరుతున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక విభాగం ద్వారా అందరినీ సమాయత్తం చేస్తున్నారు. తద్వారా ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్లలో అందరినీ భాగస్వాములను చేసి విజయవంతానికి కృషి చేయాలని అధికారులు ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాలు పేద ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేస్తుంటాయి. అదే విధానం ద్వారా వ్యర్థ పదార్థాలను తగ్గించడంతోపాటు ఇతరులకు సేవ చేసేందుకు వీలు కలుగుతుంది. మరో పక్క వ్యర్థాలు తగ్గి స్వచ్ఛత చేకూరనుంది. ఈ పనికి ప్రతీ ఒక్కరు కదిలి వచ్చినట్లయితే తద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన లక్ష్యాలను చేరుకునే అవకాశాలున్నాయి.

ఏయే వస్తువులు ఇవ్వవచ్చు..

ఇళ్లల్లో వృథాగా పడి ఉన్న పాత పేపర్లు, పుస్తకాలు, నోట్‌ బుక్స్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, బొమ్మలు, క్రీడాసామగ్రి, చెప్పులు, బూట్లు, ఇతర వస్తువులేవైనా ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలకు అప్పగించవచ్చు. ఇందుకోసం స్థానిక లారీ చౌరస్తా సమీపంలో ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య తెలిపారు. ప్రత్యేక కార్యచరణ ద్వారా ప్రతీవార్డు, కాలనీల్లోని ఆయా సెంటర్ల వద్ద నుంచి ప్రజల వద్ద నుంచి వస్తువులు సేకరిస్తారు. ఆయా కాలనీల్లో ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవకాశాలున్నాయి. జిల్లాలో తొలిసారి కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఈ కేంద్రం ప్రారంభించారు. పట్టణ ప్రగతి, స్వచ్ఛసర్వేక్షన్‌, క్లీన్‌ సిటీలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రజలు సహకరించాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు. ప్రజలు భాగస్వాములై వీటిని విజయవంతం చేస్తే పర్మినెంటు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌లో భాగంగా ఈ కార్యక్రమం మున్సిపాలిటీలో అమలు చేస్తున్నామని ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ ప్రణీల్‌కుమార్‌ తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్‌తో ఆపన్న హస్తం..

-మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ సెంటర్‌ పట్టణంలోని అభాగ్యులకు ఆపన్న హస్తంగా ఉండనుంది. ఈ పథకం ద్వారా సేకరించిన వస్తువులతో మేలు కలుగుతుంది. వస్తువులను సేకరించి రీయూజ్‌, రీసైక్లింగ్‌, రెడ్యూస్‌ పద్ధతిలో ఉపయోగంలోకి తేవడం ద్వారా అనేక విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. మున్సిపాలిటీలో వ్యర్థాలను తగ్గించి పాత వస్తువులను వాడకంలోకి తెచ్చేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. దీనిని సద్వినియోగం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి.

Updated Date - 2023-06-04T23:06:09+05:30 IST