Revanth's Meet to KCR : కేసీఆర్‌కు రేవంత్ పరామర్శ
ABN , First Publish Date - 2023-12-11T02:59:01+05:30 IST
తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు.
యశోద ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి
ఆస్పత్రి లోపలికి తోడ్కొని వెళ్లిన కేటీఆర్
కేసీఆర్ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలి
శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడాలి
ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలి
చికిత్సకు ప్రభుత్వం తరఫున పూర్తి
సహాయ సహకారాలు అందిస్తాం: రేవంత్
కేసీఆర్‌ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్/సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మాజీ సీఎం కేసీఆర్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మంత్రి సీతక్క, షబ్బీర్ అలీతో కలిసి రేవంత్.. సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఆయనకు మాజీ మంత్రి కేటీఆర్ ఎదురుగా వచ్చి తొమ్మిదో అంతస్తులో ఉన్న కేసీఆర్ వద్దకు తోడ్కొని వెళ్లారు. అక్కడ కేసీఆర్‌తో మాట్లాడిన రేవంత్.. ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగి తెలుసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ను, వైద్యులను ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన రేవంత్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతోందని, క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. ఆయన చికిత్సకు సంబంధించి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, వైద్యం కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించానని తెలిపారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని, ప్రజల పక్షాన మాట్లాడాలని ఆకాంక్షించారు. పాలనకు సంబంధించి ప్రభుత్వానికి ఆయన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నారు. కాగా, సీఎం రేవంత్ రాకకు ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి వచ్చారు. కేటీఆర్, హరీశ్‌తో మాట్లాడి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. తన నియోజకవర్గానికి చెందిన కార్యకర్తను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చానని, ఇదే సందర్భంలో కేసీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించానని చెప్పారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఆస్పత్రికి వచ్చి కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన వెంట వీహెచ్, కోదండరెడ్డి ఉన్నారు.