మమ్మల్ని రిలీవ్ చేయండి
ABN , First Publish Date - 2023-12-11T03:37:54+05:30 IST
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పలు శాఖలకు చెందిన అధికారులు రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు తమను రిలీవ్ చేయమంటూ ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు.
ఆర్ అండ్ బీ సెక్రటరీకి ఈఎన్సీలు రవీందర్‌రావు, గణపతిరెడ్డి లేఖలు
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి పలు శాఖలకు చెందిన అధికారులు రాజీనామాలు చేస్తుండగా, మరికొందరు తమను రిలీవ్ చేయమంటూ ఉన్నతాధికారులకు లేఖలు రాస్తున్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు చెందిన రహదారుల ఇంజనీర్ ఇన్ చీఫ్ రవీందర్‌రావు, భవనాలు, నేషనల్ హైవే్‌సకు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి తమను పదవుల నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ ఆ శాఖ సెక్రటరీకి లేఖలు రాసినట్టు తెలిసింది. రెండ్రోజుల క్రితమే వారు రిలీవ్ చేయమని కోరుతూ లేఖలు ఇచ్చినట్టు సమాచారం. ఇదే సమయంలో శాఖకు కొత్త మంత్రి రావడంతో ఆ లేఖలపై ఉన్నతాధికారులు ఏ నిర్ణయాన్ని తీసుకోలేదు. కాగా, గత ప్రభుత్వం నిర్మించిన నూతన సచివాలయం, అమరుల స్తూపం, అంబేడ్కర్ విగ్రహం నిర్మాణాల విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పైగా నూతన సచివాలయ నిర్మాణ వ్యయం ఎంత అనే దానిపై అధికారులు ఇప్పటికీ స్పష్టతను ఇవ్వలేదు. దీంతో వాటిపై స్పష్టత వచ్చాకే ఈఎన్సీలు రిలీవ్ అయ్యే అవకాశాలుంటాయని తెలుస్తోంది.