కన్నుల పండువగా రథోత్సవం

ABN , First Publish Date - 2023-02-21T01:10:21+05:30 IST

మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత కల్యాణ పార్వతీపరమేశ్వరుల విగ్రహాలను అర్చకుల పారాయణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ తీసుకొచ్చి రథంలో అధిష్ఠింపజేశారు. అనంతరం రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌ పాల్గొన్నారు. పూజల అనంతరం రథాన్ని ఎమ్మెల్యేలు లాగగా భక్తులు అనుసరించారు.

కన్నుల పండువగా రథోత్సవం

స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు

కొనసాగుతున్న ఎద్దుల పందెలు

ప్రారంభమైన కబడ్డీ పోటీలు

పాల్గొన్న కోదాడ, హుజూర్‌నగర్‌ ఎమ్మెల్యేలు

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 20: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు సోమవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. తొలుత కల్యాణ పార్వతీపరమేశ్వరుల విగ్రహాలను అర్చకుల పారాయణాలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ తీసుకొచ్చి రథంలో అధిష్ఠింపజేశారు. అనంతరం రథం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్‌ పాల్గొన్నారు. పూజల అనంతరం రథాన్ని ఎమ్మెల్యేలు లాగగా భక్తులు అనుసరించారు. భక్తులు శంభో శంకర నినాదాలు చేస్తుండగా రథోత్సవం తిరువీధుల్లో వైభవంగా కొనసాగింది. ఇదిలా ఉండగా, శివపార్వతుల కల్యాణోత్సవాల అనంతరం ఈశ్వరుడికి ప్రీతికరమైన సోమవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్యూలైన్లు కిక్కిరిశాయి. స్వామివారిని భక్తులు దర్శించుకొని మొక్కు చెల్లించుకున్నారు.

కొనసాగుతున్న ఎడ్ల పందేలు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున ఎడ్ల పందేలు మూడో రోజు సోమవారం కూడా కొనసాగాయి. నాలుగు పళ్ల విభాగం పోటీల్లో 10జతల ఎద్దులు పాల్గొనగా, ప్రకాశం జిల్లా పుచ్చకాయల శేషాద్రి చౌదరికి చెందిన ఎద్దుల జత 4,750 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ బహుమతిని గెలుచుకున్నాయి. ఎద్దుల పందేలను తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు హాజరుకాగా, నిర్వాహకులు ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటుచేశారు. ఇదిలా ఉండగా, ప్రోకబడ్డీ క్రీడాకారులతో కూడిన ప్రత్యేక ఆహ్వానిత ఎనిమిది జట్ల కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ కల్యాణ మండపంలో అన్నదానం, ఓజో ఫౌండేషన్‌ అధినేత పిల్లుట్ల రఘు ఆధ్వర్యంలో, సాముల జైపాల్‌రెడ్డి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాయి.

పదవుల కోసం కాదు బాధ్యతగా పనిచేస్తా

మేళ్లచెర్వు, ఫిబ్రవరి 20: తాను పదవుల కోసం పాకులాడడం లేదని, బాధ్యతగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించిన రథోత్సవంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వారికి ఆలయ అర్చకులు విష్ణువర్ధనశర్మ, ధనుంజయశర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం మూడో రోజు ఎద్దుల పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చౌకబారు వ్యవహారాలు మానుకోకపోతే ప్రజలే తగిన బుద్ధిచెప్తారన్నారు. పొద్దుపోనప్పుడు హుజూర్‌నగర్‌ ప్రాంతానికి వచ్చి అధికారులు, ప్రజాప్రతినిధులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, చెప్పిన అబద్ధాన్ని పదేపదే చెప్పి గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆయన ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మే స్థితిలో లేరన్నారు. ఉత్తమ్‌ దంపతులకు హుజూర్‌నగర్‌, కోదాడలో 50వేల మెజార్టీ వస్తుందనే భ్రమలో ఉన్నారని, కానీ వారికి 50వేల ఓట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. వారిని ఓడిం చేందుకు వేరెవ్వరో అవసరం లేదని, వాళ్ల పార్టీ వారే ఓడిస్తారన్నారు. ఉత్తమ్‌ దంపతులు మేళ్లచెర్వు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే మూడే ళ్లలో తాను చేసిన అభివృద్ధి ఏంటో కన్పిస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ మాట్లాడుతూ, ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే ఎద్దుల పోటీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్నారు.

Updated Date - 2023-02-21T01:10:25+05:30 IST