Share News

రమేశ్‌రెడ్డి, గడల ఔట్‌

ABN , Publish Date - Dec 21 , 2023 | 04:56 AM

వైద్య ఆరోగ్య శాఖపై రేవంత్‌ సర్కారు ప్రత్యేక దృష్టిసారించింది. వరుసగా విభాగాఽధిపతులను మారుస్తూ వస్తోంది. బుధవారం డీఎంఈ, డీహెచ్‌లను తొలగిస్తున్నట్లు వేర్వేరుగా జీవోలు జారీ చేసింది.

రమేశ్‌రెడ్డి, గడల ఔట్‌

డీఎంఈ, డీహెచ్‌లను మార్చిన సర్కార్‌

వైద్య విద్య సంచాలకులుగా డాక్టర్‌ త్రివేణి

ప్రజారోగ్య సంచాలకులుగా డాక్టర్‌ రవీంద్ర నాయక్‌

కొత్త డీఎంఈ, డీహెచ్‌ బాధ్యతల స్వీకరణ

డీఎంఈ నియామకంపై సీనియర్ల ఆక్షేపణ

హైదరాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖపై రేవంత్‌ సర్కారు ప్రత్యేక దృష్టిసారించింది. వరుసగా విభాగాఽధిపతులను మారుస్తూ వస్తోంది. బుధవారం డీఎంఈ, డీహెచ్‌లను తొలగిస్తున్నట్లు వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. వైద్య విద్య సంచాలకులు(డీఎంఈ)గా గత ఆరున్నరేళ్లుగా ఉన్న డాక్టర్‌ రమేశ్‌ రెడ్డిని, ప్రజారోగ్య సంచాలకులు(డీహెచ్‌)గా కొనసాగుతున్న డాక్టర్‌ గడల శ్రీనివాసరావులను తొలగించింది. రమేశ్‌ రెడ్డి స్థానంలో ఉస్మానియా ఆస్పత్రిలో పాథాలజీ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ బి. త్రివేణిని ఇన్‌చార్జి డీఎంఈగా నియమించింది. అకడమిక్‌ డీఎంఈగా జగిత్యాల వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.శివరాంప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే డాక్టర్‌ రవీంద్రనాయక్‌ను ఇన్‌చార్జి డీహెచ్‌గా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాలో లెప్రసీ విభాగంలో పనిచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వ్యులు జారీ చేసే వరకు ఆయా బాధ్యతల్లో వారు కొనసాగుతారని పేర్కొంది. ఇక జీవో రాగానే డాక్టర్‌ రమేశ్‌ రెడ్డి నుంచి డీఎంఈగా డాక్టర్‌ త్రివేణికి, డాక్టర్‌ గడల శ్రీనివాసరావు నుంచి డాక్టర్‌ రవీంద్ర నాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. కాగా డీఎంఈ, డీహెచ్‌లను మార్చబోతున్నట్లు రెండు రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈనెల 21న ఇన్‌చార్జి డీఎంఈ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి కొనసాగింపుపై కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో ఒకరోజు ముందే సర్కారు ఆయన్ను తొలగించింది. ప్రస్తుతం సీనియారిటీ జాబితాలో ఉన్నవారిని ఇన్‌చార్జిగా నియమించింది. కోర్టుకు కూడా ఇదే విషయాన్ని తెలియజేయనుంది. త్వరలో డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) వేసి, ఆ మేరకు పూర్తిస్థాయి ఇన్‌చార్జిని నియమించే అవకాశం ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

సీనియారిటీని పరిగణించరా?

ప్రభుత్వానికి పంపిన అడిషనల్‌ డీఎంఈ సీనియారిటీ జాబితాపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కనీసం ఒక కాలేజీ ప్రిన్సిపాల్‌గా, ఒక ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా పనిచేయని వారిని సీనియారిటీలో ఎలా ముందుకు తీసుకువస్తారని అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్కారు అవేమీ పట్టించుకోకుండా ఇన్‌చార్జి డీఎంఈని నియమించిందని కొందరు సీనియర్లు ఆక్షేపించారు. మరోవైపు.. సీనియారిటీ జాబితాలో మొదటి స్థానంలో ఉండటంతో డాక్టర్‌ రవీంద్రనాయక్‌ను సర్కారు ఇన్‌చార్జి డీహెచ్‌గా నియమించింది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా డీహెచ్‌ పోస్టును గత ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఉన్న పోస్టు కాస్త ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిపోయింది. దాంతో 2014 నుంచి నేటి వరకు ఇన్‌చార్జిలతోనే నెట్టుకొచ్చారు. ఇప్పుడు కూడా డాక్టర్‌ గడల స్థానంలో ఇన్‌చార్జినే నియమించారు. అదే సమయంలో గడలకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు.

ప్రభుత్వానికి గడల కృతజ్ఞతలు

డీహెచ్‌గా ఐదేళ్లకుపైగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వానికి డాక్టర్‌ గడల ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ ప్రజారోగ్య రంగాన్ని మరింత పటిష్టం చేయడానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Dec 21 , 2023 | 04:56 AM