RAITHU BANDHU: రైతు బంధుకు నిధుల కటకట
ABN , First Publish Date - 2023-02-24T02:22:23+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతు బంధు పథకానికి నిధుల కటకట ఏర్పడింది. రెండు నెలల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి కావాల్సిన యాసంగి నగదు బదిలీ ఇంకా నత్తనడకన సాగుతోంది.
పైసలు అందని వారు ఇంకా 1.15 లక్షల మందికిపైనే
నిరుడు జనవరి 21కే ముగిసిన నగదు బదిలీ
ఈసారి ఫిబ్రవరి ముగుస్తున్నా పూర్తవని చెల్లింపులు
10 ఎకరాల వరకు ఇచ్చేశామని అధికారుల వెల్లడి
11 నుంచి 15 ఎకరాల కేటగిరీలో కొందరికే చెల్లింపులు
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న రైతు బంధు పథకానికి నిధుల కటకట ఏర్పడింది. రెండు నెలల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా పూర్తి కావాల్సిన యాసంగి నగదు బదిలీ ఇంకా నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవటం, ఆర్థిక శాఖ నుంచి ట్రెజరీకి నిధులు సమకూరకపోవటంతో పథకం ముందుకు సాగటంలేదు. నిరుడు జనవరి 21 నాటికే రైతుబంధు నిధుల జమ పూర్తికాగా.. ఈసారి ఫిబ్రవరి 23 దాటినా కొలిక్కిరాలేదు. ఈ సీజన్‌లో ఇప్పటికీ లక్ష మందికి పైచిలుకు రైతులకు రైతుబంధు అందకపోవటం శోచనీయం. 2022-23 యాసంగికి సంబంధించిన రైతుబంధు నగదు బదిలీ 2022 డిసెంబరు 28 నుంచి ప్రారంభమైంది. 15 రోజుల్లో నగదు బదిలీ పూర్తిచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు.
అయితే, జనవరి మొదటి వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేయలేకపోయింది. బిల్లులు తయారుచేయకుండా, ఆర్థిక శాఖ నుంచి నిధులు సమకూర్చకపోవటంతో కుంటుపడుతూ వస్తోంది. ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలో 10 ఎకరాల వరకు ఉన్న రైతులకు నగదు బదిలీ పూర్తిచేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పదెకరాలలోపు ఉన్న వారికి ఇంకా నిధులు జమకాలేదని కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రకారం.. సంక్రాంతి నాటికి ప్రతి రైతు ఖాతాలో రైతుబంధు మొత్తం జమకావాలి. అయితే ఇప్పటికీ ఇంకా లక్షా పదిహేను వేల మందికి రైతు బంధు అందలేదు.
ఇంత జాప్యం ఎప్పుడూ లేదు..
పదెకరాల వరకు చెల్లింపులు పూర్తిచేసిన తర్వాత.. ఇదే పద్ధతిలో 11 ఎకరాలకు వరకు, 12 ఎకరాల వరకు, 13 ఎకరాలకు... ఇలా కేటగిరీల వారీగా బిల్లులు రూపొందించి వ్యవసాయ శాఖ నుంచి ట్రెజరీకి పంపించారు. కానీ ఆ బిల్లులకు సరిపడా నిధులను ఆర్థికశాఖ సర్దుబాటు చేయలేదు. దీంతో అరకొర చెల్లింపులు చేశారు. తక్కువ మొత్తంలో ఉన్న బిల్లులకు చెల్లింపులు పూర్తిచేశారు. ఎక్కువ మొత్తం ఉన్న బిల్లులు ట్రెజరీలో నిలిపివేశారు. యాసంగిలో రైతు బంధు చెల్లించటానికి ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదు. 2018-19 యాసంగి సీజన్ వచ్చేసరికి తెలంగాణ శాసనసభ ముందస్తు ఎన్నికలు వచ్చాయి. దీంతో నవంబరులోనే రైతుబంధు ఇచ్చేశారు.
2019-20లో డిసెంబరు, జనవరి నెలల్లో చెల్లింపులు చేశారు. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చింది. అప్పుడు నవంబరులోనే రైతు బంధు పూర్తిచేశారు. ఫిబ్రవరి నెలాఖరు వస్తున్నా రైతుబంధు ఇప్పటికీ రాని వారు సుమారు 1.15 లక్షల మంది ఉంటారని సమాచారం. 10 నుంచి 11 ఎకరాల కేటగిరీలో సుమారు 24 వేల మంది.. 11 ఎకరాల నుంచి 15 ఎకరాల కేటగిరీలో సుమారు 40 వేల మంది.. 20 ఎకరాల కేటగిరీలో సుమారు 18 వేల మంది.. 20 నుంచి 30 ఎకరాల కేటగిరీలో సుమారు 30 వేల మంది.. 30 నుంచి 54 ఎకరాల కేటగిరీలో 5వేల మంది రైతులు ఉన్నారు.