రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం

ABN , First Publish Date - 2023-06-26T02:51:23+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది....

రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు బంగాళాఖాతంలో అల్పపీడనం

బంగాళాఖాతంలో అల్పపీడనం..

అక్కడక్కడ భారీ వానలు కురిసే చాన్స్‌

రాష్ట్రంలో ఈనెల 51ు లోటు వర్షపాతం..

హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వచ్చే మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆదివారం అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతం మొత్తం విస్తరించిన తర్వాత ఈ సీజన్‌లో ఏర్పడిన తొలి అల్పపీడనం ఇదే.. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలో పూర్తిగా, గుజరాత్‌, రాజస్థాన్‌, హరియాణాలో అనేక ప్రాంతాలకు విస్తరించాయి. కాగా, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మోగ్దంపల్లిలో 6.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌ పరిధిలోని షేక్‌పేట్‌లో 5.6, ఆదిలాబాద్‌ జిల్లా నర్నూర్‌లో 3.8, ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌లో 3.6, సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 3.5 మి.మీ, భూపాలపల్లి జిల్లా పెద్దంపేట్‌లో 3.2, మహబూబ్‌నగర్‌ జిల్లా కోకుంట్లలో 2.9 సెం.మీ. రికార్డయింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, కరీంనగర్‌, హనుమకొండ, వరంగల్‌, మహబూబాబాద్‌, సూర్యాపేట, జనగామ, గద్వాల జిల్లాల్లో సగటున 15.6 నుం చి 64.6 మిల్లీమీటర్లు నమోదైనట్లు వాతావరణ కేంద్రం వివరించింది.

ఈ నెలలో లోటు వర్షపాతం..

ఈ నెల 1 నుంచి ఆదివారం వరకు రాష్ట్ర సగటు సాధారణ వర్షపాతం 103.2 మిల్లీమీటర్లుగా ఉండాలి. కానీ ఇప్పటివరకు కేవలం 50.6 మిల్లీమీటర్ల వర్షమే కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఈ నెలలో వర్షపాతం 51 శాతం లోటు నమోదైందని వెల్లడించింది. సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైనట్లు వివరించింది.

Updated Date - 2023-06-26T02:51:23+05:30 IST