Share News

Kumaram Bheem Asifabad: చన్నీటి స్నానం.. విద్యార్థుల దైన్యం

ABN , First Publish Date - 2023-12-09T22:51:33+05:30 IST

అసలే చలికాలం. వేకువజామున మంచు కురుస్తూ గజగజ వణికి స్తోంది. మరోవైపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఇంతటి చలిలోనూ విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తూ అవస్థలు పడుతున్నారు.

Kumaram Bheem Asifabad: చన్నీటి స్నానం.. విద్యార్థుల దైన్యం
నిరుపయోగంగా ఉన్న సోలార్‌ వాటర్‌ హీటర్లు

- చలి తీవ్రతకు విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

- ఈసారైనా మరమ్మతులు చేసేనా?

అసలే చలికాలం. వేకువజామున మంచు కురుస్తూ గజగజ వణికి స్తోంది. మరోవైపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఇంతటి చలిలోనూ విద్యార్థులు చన్నీటి స్నానం చేస్తూ అవస్థలు పడుతున్నారు.

బెజ్జూరు, డిసెంబరు 9: పొద్దున్నే బడికి సిద్ధమయ్యేందుకు స్నానం చేద్దామంటే చలి గుబులు పట్టిస్తోంది. ఎందుకంటే ఆ పిల్లలకు చన్నీళ్లే తప్ప వేడినీటి జాడ లేదు. రాత్రి వేళలో కంటినిండా నిద్రిద్దామంటే చల్లగాలులు వణికిస్తున్నాయి. మోకాళ్లను పొత్తిళ్ల దగ్గరకు తీసుకొచ్చి పడుకున్నా చలి కలవరపెడుతూనేఉంది. బరువైన రగ్గులు కప్పుకొందామంటే కరువు. ఇది కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దుస్థితి. చలి కారణంగా విద్యార్థులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. జిల్లాలో మొత్తం 46 ప్రభుత్వ ఆశ్రమ గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 14 బాలికల ఆశ్రమ పాఠశాలలు, 32 బాలుర పాఠశాలలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని అన్ని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యార్థం కోసం 2013లో సోలార్‌ వాటర్‌ హీటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గిరిజన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు వేడి నీళ్లతో ప్నానం చేయడానికి ఆయా పాఠశాలల్లోని భవనాల పైన సౌర యంత్రాలను బిగించింది. ఒక వేడి నీటి యంత్రాన్ని నిర్మించారు. ఒకటి రెండేళ్లు మినహ ఇవి పని చేసిన దాఖలాలు లేవు.

మరమ్మతులు కరువు..

ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన సోలార్‌ వాటర్‌ హీట ర్లు చిన్న చిన్న కారణాలతో పని చేయడం లేదు. హీటర్ల నిర్వహణ సక్రమంగా లేక నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో చిన్నపాటి కారణాలతో చెడిపోయిన వాటికి కూడా అధికారులు మరమ్మత్తులు చేయడం లేదు. మరి కొన్ని పాఠశాలల్లో కోతులు వాటర్‌ హీటర్లకున్న పరికరాలు తొలగించాయి. లక్షల రూపాయలతో ఏర్పాటు చేసినా మూనాళ్ల ముచ్చటగా మారడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. కనీసం చలి కాలంలోనైనా మరమ్మతులు చేపట్టరా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో విద్యార్థులు ప్రతి ఏటా చన్నీటితో స్నానాలు చేస్తూ అనారోగ్యబారిన పడుతున్నారు. ముఖ్యంగా పలు మండలాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ పరికరాలను కోతులు భవనాలపై ఉన్న పరికరాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. ఇదంతా అధికారులకు తెలిసినా మరమ్మతులు చేపట్టడం లేదు. కనీసం పరికరాలు ఏర్పాటు చేసిన చోట రక్షణ చర్యలు తీసుకోకపోవడంతోనే చెడిపోతున్నట్లు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

నిధులు వృథా..

జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరికరాలకు ఒక్కో హీటర్‌కు ప్రభుత్వం రూ.2.25లక్షలు వెచ్చించింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేశారు. వీటిని ఒక ప్రైవేటు వ్యక్తికి అప్పగించడంతో పనులు పూర్తి చేయించారు. ఏడాది పాటు వాటి నిర్వహణ బాధ్యతను అప్పగించారు. అనంతరం గడువు ముగిసిన అనంతరం పరికరాలు పూర్తిగా చెడిపోవడంతో ఆ తర్వాత వాటి మరమతులు పట్టించుకోలేదు. దీంతో లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసినా నిర్వహణను పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయాయి. వీటి మరమ్మత్తుల కోసం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వాతావరణంలో వచ్చిన మార్పులు, తుఫాన్‌ కారణం గా చల్లటి గాలులు విపరీతంగా పెరిగి చలి పంజా విసురుతోంది. దీంతో విద్యార్థులు మంచి నీటి ట్యాంకుల వద్ద, చేతి పంపుల వద్ద గజ గజ వణుకుతూ చన్నీటితో స్నానాలు చేస్తున్నారు. అధికారులు స్పందించి సౌర పరికరాలను బాగు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

చన్నీటితో ఇబ్బందులు పడుతున్నాం..

- ఆలం భాస్కర్‌, విధ్యార్థి, సోమిని ఆశ్రమ పాఠశాల

పాఠశాలల్లో చదువుతున్న తమకు చన్నీటి స్నానాలు చేయడం వల్ల ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నో ఏళ్లుగా సోలార్‌ హీటర్లను బాగు చేయాలని చెబుతున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.

చలి కాలంలో ఏటా ఇదే పరిస్థితి..

- మడె సందీప్‌, విద్యార్థి, సోమిని ఆశ్రమ పాఠశాల

ప్రతి ఏటా చలి కాలంలో ఇదే పరిస్థితి ఉంటుంది. సౌర పరికరాలను కోతులు పూర్తిగా ధ్వంసం చేయడంతో అవి పని చేయడం లేదు. దీంతో తాము చలికి చన్నీటి స్నానాలు చేస్తూ తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నాం. అధికారులు తమ గోడును పట్టించుకోవడం లేదు. ప్రతి ఏటా చలి కాలంలో ఇదే పరిస్థితి.

Updated Date - 2023-12-09T22:51:34+05:30 IST