TS Election: అన్నాచెల్లెళ్లు గేర్ మార్చారు!
ABN , First Publish Date - 2023-11-06T02:56:21+05:30 IST
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సంపూర్ణంగా విజయం సాధించే అవకాశం ఉందని భావిస్తున్న తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తిస్థాయిలో దృష్టిసారించింది.
13 రోజులు ఇక్కడే?
రాహుల్, ప్రియాంకల్లో ఎవరో ఒకరు
16 నుంచి 28 వరకు తెలంగాణలోనే!
రాష్ట్రంలో గెలిచి తీరాలనే పట్టుదల
అగ్రనేతల సుడిగాలి పర్యటనలు
షెడ్యూలు ఖరారుపై అధిష్ఠానం కసరత్తు
10న కామారెడ్డి సభకు సిద్దరామయ్య
రేపట్నుంచి రేవంత్ రాష్ట్రవ్యాప్త ప్రచారం
హైదరాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో సంపూర్ణంగా విజయం సాధించే అవకాశం ఉందని భావిస్తున్న తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఇప్పటికే ఒక దఫా రాహుల్ గాంధీ పర్యటించి వెళ్లగా.. ఇప్పుడు మరోసారి ఏఐసీసీ అగ్ర నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత సుడిగాలి పర్యటనలతో తెలంగాణను చుట్టేయనున్నారు. ఈనెల 16వ తేదీ నుంచి 28 తేదీ వరకూ వారు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నిజానికి, ఇప్పుడు ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్‌ల్లో అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. వీటితోపాటు తెలంగాణలోనూ ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఆ పార్టీ వర్గాలు పూర్తి ఆశాభావంతో ఉన్నాయి. ఇక, రాజస్థాన్ విషయంలో సర్వేలు భిన్న ఫలితాలను వెలువరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే, తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. పార్టీ నేతల మధ్య ఐక్యత చాటేందుకు తలపెట్టిన బస్సు యాత్రను రాహుల్ గాంధీనే స్వయంగా నేతృత్వం వహించి ముందుకు నడిపారు. ఈనెల 7వ తేదీన ఛత్తీ్‌సగఢ్‌లో తొలి విడత, ఈనెల 17న మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. దాంతో, ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ప్రచారంపై రాహుల్, ప్రియాంక దృష్టి సారించారు. మధ్యప్రదేశ్‌లో ప్రచార గడువు ఈనెల 15తో ముగియనుంది. ఆ తర్వాత పూర్తిగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంపైనే రాహుల్, ప్రియాంక దృష్టి సారించాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 16 నుంచి రాష్ట్రంలో ప్రచార గడువు ముగిసే 28వ తేదీ వరకూ విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌పై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.
అయితే, ఈనెల 25వ తేదీన రాజస్థాన్‌లో పోలింగ్ జరగనుంది. అక్కడ ప్రచార గడువు 23వ తేదీతో ముగియనుంది. దాంతో, అక్కడి ప్రచారంపైనా రాహుల్, ప్రియాంక దృష్టి సారించాల్సి ఉంది. దాంతో, ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకూ ఎనిమిదిరోజులపాటు ఇద్దరిలో ఎవరో ఒకరు రాష్ట్రంలో పర్యటించేలా చూడాలని భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మల్లికార్జున ఖర్గే, చిదంబరం, జైరాం రమేశ్ తదితర నేతలను రంగంలోకి దించనున్నట్లు చెబుతున్నారు. రాజస్థాన్‌లో ప్రచారం ముగిసిన తర్వాత.. తెలంగాణలో అయితే రాహుల్.. లేకుంటే ప్రియాంక ప్రచారం ప్రతి రోజూ ఉండేలా అధిష్ఠానం ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే వారు బహిరంగ సభల్లో పాల్గొంటారా.. లేక రోడ్ షోలు నిర్వహిస్తారా అన్న విషయాన్ని ఏఐసీసీ ఖరారు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తన వంతు పాత్ర పోషించనున్నారు. ఈనెల 10న కామారెడ్డిలో జరగనున్న భారీ బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. వాస్తవానికి బీసీ గర్జన సభను నిర్వహించి.. దానికి సిద్దరామయ్యను ముఖ్య అతిథిగా పిలిచేందుకు అన్ని ఏర్పాట్లూ జరిగాయి. వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. చివరికి ఈనెల 10న ఆయన షెడ్యూల్ ఖరారైంది. ఈ సభలో బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించే ఆస్కారం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ఈనెల 9న మైనార్టీ డిక్లరేషన్‌ను గాంధీ భవన్‌లో పార్టీ ముఖ్య నాయకులు విడుదల చేయనున్నారు.
7 నుంచి రేవంత్ ప్రచారం
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం ఈనెల 7 నుంచి ప్రారంభం కానుంది. ఆరోజు ఉదయం 11.30 గంటలకు అలంపూర్ దేవాలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు గద్వాల చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మక్తల్ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. నవంబర్ 8న వరుసగా ఖానాపూర్, ఆదిలాబాద్, రాజేంద్రనగర్ సభల్లో పాల్గొని పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తారు. నవంబర్ 9న ముషీరాబాద్, సికింద్రాబాద్ సభల్లో పాల్కొంటారు. 10న కామారెడ్డి సభలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో కలిసి పాల్గొంటారు. అనంతరం జహీరాబాద్ సభలో పాల్గొంటారు. ఆరోజు సాయంత్రం గోల్కొండలో మైనార్టీలతో డిన్నర్ సమావేశంలో పాల్గొంటారు.