Chandrababu : బాబు అక్రమ అరెస్టుపై నిరసనల వెల్లువ
ABN , First Publish Date - 2023-10-03T04:10:07+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులునిరసన ర్యాలీలు, దీక్షలు చేశారు.
తెలంగాణవ్యాప్తంగా దీక్షలు
ర్యాలీలు, కొవ్వొత్తుల ప్రదర్శన
ఎన్టీఆర్‌భవన్‌లో దీక్ష
హాజరైన ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, నేతలు
బాబు త్వరలో తెల్లకాగితంలా
బయటకు వస్తారు: అరికెపూడి
సైకోల సంఘానికి అధ్యక్షుడు జగన్
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేతల ధ్వజం
అక్కసుతోనే బాబు అరెస్టు అని ఆగ్రహం
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సోమవారం, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, అభిమానులునిరసన ర్యాలీలు, దీక్షలు చేశారు. ఏపీలోని రాజమండ్రి జైల్లో చంద్రబాబు చేపట్టిన దీక్షకు సంఘీభావం ప్రకటించారు. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు నిరసన దీక్షలు, ర్యాలీలు చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్టీఆర్‌భవన్‌లో ‘సత్యమేవ జయతే’ నిరాహార దీక్ష చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు, మాజీ ఎంపీలు మురళీమోహన్, వనబాక లక్ష్మితో పాటు పలువురు సీనియర్ నాయకులు నల్ల కండువాలతో ఈ నిరసన దీక్షలో పాల్గొన్నారు. ‘ఆకాశం పై ఉమ్మి వేస్తే అది మనపైనే పడుతుంది. ఎదుటివారికి ఒక వేలు చూపిస్తే మిగిలిన నాలుగు వేళ్లు మనల్ని చూపిస్తాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకుంటే మంచిది. చంద్రబాబు, నారా లోకేశ్ ప్రజల్లోకి వెళ్లి పాదయాత్ర, సభలు నిర్వహిస్తుంటే లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రావడాన్ని తట్టుకోలేని సైకో జగన్.. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారు. ఈ కష్టాలు తాత్కాలికమే. రాబోయే రోజులలో వైసీపీ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు’ అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న తల్లిని, సొంత చెల్లెలిని దూరం పెట్టిన దుర్మార్గుడు, రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్‌రెడ్డి అని మండిపడ్డారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా సోమవారం రాజమండ్రి జైల్లో చంద్రబాబు, రాజమండ్రిలో నారా భువనేశ్వరి, ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ దీక్షలకు సంఘీభావంగా టీడీపీ తెలంగాణ శాఖ అధ్వర్యంలో ఎన్టీఆర్ భవన్‌లో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి ఈ దీక్షను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ.. చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేసి, అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారని అన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ అవినీతి సంఘానికి అధ్యక్షుడు, సైకోల సంఘానికి శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అని విరుచుకపడ్డారు. చంద్రబాబు ప్రతి రోజు, ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేశారని అన్నారు. ఽ14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు జీవనోపాధికి పాలు అమ్ముకుంటున్నారే కానీ పరిపాలనను ఎన్నడూ అమ్ముకోలేదని అన్నారు. పైన ఉన్న మోదీ.. ఏపీలో ఉన్న కేడీ గురించి ఆలోచించాలని డిమాండ్ చేశారు. ఎన్‌టీఆర్ కుమార్తె గారపాటి లోకేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబుకు సంఘీభావంగా చేస్తున్న ప్రార్థనలు వృధాకావని, చంద్రబాబు అజేయుడిగా బయటకు వస్తారన్నారు. సినీనటుడు బాలకృష్ణ భార్య వసుంధర మాట్లాడుతూ.. న్యాయం గెలిచి తీరుతుందన్నారు. సమర్థవంతమైన పాలనతో తెలుగు ప్రజల గౌరవం పెంచిన నాయకుడు చంద్రబాబు అని పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై కేసీఆర్ స్పందించాలన్నారు. టీడీపీ తెలంగాణ ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని, దివంగత సినీ నటుడు తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, కుమార్తె నిష్క, తదితరులు దీక్షలోపాల్గొని చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు.
ఆధారాలు లేని తప్పుడు కేసులో..
చంద్రబాబు నాయుడిపై ఎలాంటి ఆధారాలు లేని, తప్పుడు కేసు పెట్టారని, ఆయన త్వరలో తెల్ల కాగితంలా బయటకు వస్తారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీలో జరిగిన భారీ కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్యే అరికెపూడి పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో కలిపి ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేసిన చంద్రబాబు, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పాటు పడ్డారని.. ఉత్తమ వ్యక్తులను రాష్ట్రపతులుగా నియమించడంలో కీలకపాత్ర పోషించారని కొనియాడారు. కాగా బౌద్ధనగర్‌లో జరిగిన సత్యమేవ జయతే దీక్షలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన పాల్గొన్నారు. అధికారాన్ని నిలబట్టుకునేందుకు ఏపీ సీఎం జగన్, చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి, అరెస్టు చేయించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు.