Procrastination: వాయిదానే ఫాయిదా!

ABN , First Publish Date - 2023-06-30T03:29:06+05:30 IST

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ ఏడాది కూడా జరిగే అవకాశాల్లేవా? రెండేళ్లుగా వాయిదా పడుతున్న ఎన్నికలు....

Procrastination: వాయిదానే ఫాయిదా!

అధికార బీఆర్‌ఎస్‌లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బుగులు

● అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్వహణకు అయిష్టత!

● త్వరలో నోటిఫికేషన్‌ అనగా కోర్టుకు సింగరేణి యాజమాన్యం

● అక్టోబరులో నిర్వహిస్తామని విజ్ఞప్తి

● అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మళ్లీ వాయిదా కోరే అవకాశం?

భూపాలపల్లి, హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ ఏడాది కూడా జరిగే అవకాశాల్లేవా? రెండేళ్లుగా వాయిదా పడుతున్న ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్స్‌ తర్వాతే నిర్వహించే అవకాశాలున్నాయా? సింగరేణి ఎన్నికలంటే బీఆర్‌ఎస్‌ భయపడుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లోపు నిర్వహిస్తే.. ఒకవేళ ఓడిపోతే, ఆ ప్రభావం మొత్తంగా అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని జంకుతోందా? గుర్తింపు సంఘం ఎన్నికల వాయిదా పడటమే తమ పార్టీకి ఫాయిదా అని ఎప్పటికప్పుడు సింగరేణి యాజమాన్యంతో కలిసి ఆ దిశగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా? గుర్తింపు సంఘం ఎన్నికల పరంగా కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలు, రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని విశ్లేషిస్తే ఈ ప్రశ్నలకు ‘ఔను’ అనే సమాధానమే వస్తోంది.

సింగరేణి ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చేది కేంద్ర కార్మికశాఖే అయినా నిర్వహణలో రాష్ట్ర రెవెన్యూ, పోలీసు యంత్రాంగం పాత్రే కీలకం! ఫలితంగా 2021లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ఏవేవో కారణాలు చెప్పుకొంటూ వాయిదా వేస్తున్న ప్రభుత్వం, ఈ ఏడాదీ అదే కథ నడిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి! ఆగస్టులోపు ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని మధ్యంత ఉత్తర్వుల్లో హైకోర్టు స్పష్టం చేసినా.. ఎప్పటిలాగే ఏవో కారణాలు చెప్పి నిర్వహించలేమని అశక్తత వ్యక్తం చేసింది. దీంతో అక్టోబరులో ఎన్నికలు నిర్వహించాలని కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. మరి.. అక్టోబరులోనైనా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగేనా? అంటే డౌటే!! అప్పటికి అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తుంది. అప్పటికి ఎమ్మెల్యే ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలైతే మాత్రం సింగరేణి ఎన్నికల నిర్వహణ కొత్త ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత అన్నట్టే లెక్క!

ఎందుకు భయం?

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలంటే అధికార బీఆర్‌ఎస్‌ ఎందుకంత భయపడుతోంది? అంటే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. వాటిల్లో చాలామటుకు అమలు చేయకపోవడమే! ఆ హామీలేమిటి? అంటే ఆరేళ్లు వెనక్కి.. 2017లోకి వెళ్లాలి! ఆఏడాది అక్టోబరు 5న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. బీఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) తరఫున ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత విస్తృతంగా ప్రచారం చేశారు. స్వయంగా కేసీఆర్‌ సింగరేణి కార్మికులను ప్రగతిభవన్‌కు పిలిచి విందు ఇచ్చారు. టీబీజీకేఎస్‌ను గెలిపిస్తే కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతానంటూ హామీల వర్షం కురిపించారు. ఆ ఎన్నికల్లో కార్మికులు, టీబీజీకేఎస్‌కే పట్టం కట్టారు. అయితే సీఎం ఇచ్చిన హామీల్లో ఇప్పటిదాకా చాలా వరకు నెరవేరలేదని కార్మికులు గుర్రుగా ఉన్నారు. ప్రధానంగా సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలిస్తామని సీఎం మాటిచ్చారని, అయితే వాటిని కారుణ్య నియామకాల ద్వారా భర్తీ చేస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే కార్మికుల్లో ఇంటిపేర్ల మార్పిడి! ఆ పేర్ల పరంగా సంస్థలో ఒక పేరు, ఆధార్‌ కార్డులో మరో పేరు ఉండటంతో కార్మికులు వివిధ ప్రయోజనాలకు దూరమవుతున్నారనే ఉద్దేశంతో అలాంటి కార్మికులకు పేర్ల మార్పిడి పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిస్తామని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఇదీ నెరవేరలేదు.

ఇక 200 గజాల ఇంటి స్థలంతో పాటు రూ.10 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని హామీ ఇచ్చి.. అమలు చేయలేదని కార్మికులు కన్నెర్రజేస్తున్నారు. సింగరేణిలో ఓపెన్‌ కాస్టులు లేకుండా చేస్తామని, కొత్తగా 50 భూగర్భ గనులను ఏర్పాటు చేసి, లక్ష మందికి పైగా కార్మికులకు కొత్తగా ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని, డిస్మిస్‌ అయిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఇచ్చిన హామీలనూ అటకెక్కించారని అసంతృప్తిగా ఉన్నారు. ఇక 2014 ముందు రూ.4,500 కోట్ల లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థకు సుమారు రూ.10,500 కోట్లకు పైగా అప్పులు ఉన్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. జెన్‌కో నుంచి ప్రభుత్వం రాయితీగా ఇచ్చిన రూ.16 వేల కోట్లు, బొగ్గు, కరెంట్‌ అమ్మకాలతో సింగరేణికి రూ.17,400 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బకాయిలను ఇప్పించకపోగా, అభివృద్ధి పనుల పేరుతో కోల్‌బెల్ట్‌లోని 12 మంది ఎమ్మెల్యేలకు తలా రూ.2కోట్ల చొప్పున ఏటా రూ.24కోట్లు ఇస్తోందని కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వైపే!

2017 అక్టోబరు 5న కోల్‌బెల్ట్‌లోని 11 ఏరియాల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. భూపాలపల్లి, మందమర్రి మినహా తొమ్మిది చోట్లా టీబీజీకేఎస్‌ గెలిచింది. ఆ ఎన్నికల్లో సింగరేణిలో 11 ఏరియాల నుంచి మొత్తం 52,534 ఓట్లు ఉండగా, 49,877 ఓట్లు పోలయ్యాయి. వీటిలో టీబీజీకేఎస్‌కు 23,848 ఓట్లు రాగా, కాంగ్రెస్‌, టీడీపీల మద్దతుతో పొత్తుతో పోటీ చేసిన సీపీఐ అనుబంధ ఏఐటీయూసీకి 19,631ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 4,217ఓట్ల మెజారిటీతో సింగరేణిలో గులాబీ జెండా ఎగరటం బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మరుసటి ఏడాది.. అంటే 2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు బీఆర్‌ఎస్‌కు గట్టి షాకిచ్చారు. కోల్‌బెల్ట్‌ ఏరియాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్‌ఎస్‌ను గెలిపించారు. మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్‌ విజయం సాధించగా, రామగుండం, వైరా అసెంబ్లీ స్థానాల్లో ఇంటిపెండెంట్లు, సత్తుపల్లిలో టీడీపీ గెలుపొందింది. సింగరేణి ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటాలని కాంగ్రెస్‌, బీజేపీలు ఉవ్విళ్లూరుతున్నాయి. ప్రత్యేకించి కాంగ్రెస్‌.. సింగరేణిలో జెండా పాతాలనే పట్టుదలతో ఉంది.

Updated Date - 2023-06-30T04:26:46+05:30 IST