కవితను జైలుకు పంపేందుకూ సిద్ధం!
ABN , First Publish Date - 2023-09-18T04:29:28+05:30 IST
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని.. కలిసి నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

సానుభూతి కోసం కేసీఆర్ నాటకాలు
అరెస్టుపై ప్రధాని మోదీతో ఒప్పందం
కేసీఆర్ అనుచరుడే కిషన్‌రెడ్డి: రేవంత్
హైదరాబాద్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని.. కలిసి నాటకాలు ఆడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో పక్కాగా డ్రామాలు చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ తన కుమార్తె కవితను జైలుకు పంపేందుకూ సిద్ధమయ్యారని చెప్పారు. ఈ స్కామ్ పేరుతో కవితను తిహాడ్ జైల్లో పెట్టించి, వచ్చే ఎన్నికల్లో సానుభూతి పవనాలతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ప్రధాని మోదీతో ఒప్పందం చేసుకున్నారని, ఆయన కూడా సహకరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్.. కిషన్‌రెడ్డి వేర్వేరు కాదన్నారు. కేసీఆర్ అనుచరుడే కిషన్‌రెడ్డి అని పేర్కొన్నారు. తాజ్ కృష్ణా హోటల్లో సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితో కలిసి రేవంత్ విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేసే మోదీ, అమిత్ షాలు ఆయన అవినీతిపై ఇంతవరకు విచారణ ఎందుకు జరిపించలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్న కేసీఆర్.. అది సరిపోలేదని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కూ పాల్పడ్డారన్నారు. అందులో పెట్టుబడి పెట్టిన బీఆర్‌ఎస్ పార్టీ, వాటాలు పొందుతున్న బీజేపీలు.. తమ తప్పిదాలను కప్పి పుచ్చేందుకే కాంగ్రె్‌సపై విమర్శలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఈడీ పెట్టిన కేసులో మాత్రమే కవిత ఇరుక్కున్నారని, బీఆర్‌ఎస్ సర్కారుపై ఒక్క కేసు కూడా పెట్టలేదని గుర్తుచేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 100 కోట్లకే ఆప్ మంత్రులను జైలుకు పంపితే.. రూ.లక్ష కోట్లు తిన్న కేసీఆర్‌ను ఉరి వేయాలని అన్నారు. బీజేపీకి బీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు బయటి నుంచి మద్దతు ఇస్తున్నాయని రేవంత్ ఆరోపించారు. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆరెస్, మజ్లిస్ మూకుమ్మడిగా కాంగ్రె్‌సపై దాడికి దిగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశాలు, తుక్కుగూడలో బహిరంగ సభ పెట్టుకున్న రోజునే ఈ మూడు పార్టీలు పోటా పోటీ దినోత్సవాలు నిర్వహించడమే దీనికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటూ 2004లో ఇచ్చిన హామీని సోనియా నిలబెట్టుకున్నారని, తుక్కుగూడ సభలో ఇచ్చిన హామీలనూ నిలబెట్టుకుంటారని స్పష్టం చేశారు. కొందరు పోలీసులు బీఆర్‌ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆర్భాటం కోసమే కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును ప్రారంభించారని, ప్రాజెక్టు వ్యయం కంటే ప్రకటనల ఖర్చే ఎక్కువని విమర్శించారు. భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్ పరస్పరం సహకరించుకుంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజలంతా కాంగ్రెస్ పక్షాన నిలబడి రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని కోరారు.