సాగుకు సిద్ధం

ABN , First Publish Date - 2023-06-26T00:55:55+05:30 IST

వరణుడి కరుణతో రైతన్న మోములో ఆనందం వెల్లివిరిసింది. వాన చినుకు కోసం ఎదురు చూసిన కర్షకుడికి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. దీంతో నాగలి చేతబట్టి పొలం పనులకు బయలుదేరారు. దుక్కులు దున్ని, విత్తనాలను వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సాగుకు సిద్ధం

వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు

దుక్కులు దున్ని.. విత్తనాలు నాటుతున్న కర్షకులు

ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు

నేటి నుంచి ‘రైతుబంధు’సాయం

మోత్కూరు, నల్లగొండ: వరణుడి కరుణతో రైతన్న మోములో ఆనందం వెల్లివిరిసింది. వాన చినుకు కోసం ఎదురు చూసిన కర్షకుడికి మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరటనిచ్చాయి. దీంతో నాగలి చేతబట్టి పొలం పనులకు బయలుదేరారు. దుక్కులు దున్ని, విత్తనాలను వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను వ్యవసాయ శాఖ ఇప్పటికే సిద్ధం చేయగా, నకిలీల పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఏదైనా అనుమానం ఉంటే వెంటనే అధికారులను స్పందించాలని సూచిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రోహి ణి కార్తెలో కురిసిన ఒకట్రెండు వర్షాలకు కొందరు రైతులు పత్తి విత్తనాలు విత్తగా, మరికొందరు ఆ తర్వాత పొసి (పొడి దుక్కి)లో విత్తనా లు విత్తారు. మృగశిర కార్తె మొత్తం వర్షాలు కురవకపోవడంతో రోహిణి కార్తెలో విత్తిన విత్తనాలు మొలకెత్తలేదు. ఈ నెల 22 నుంచి ఆరుద్ర కార్తె మొదలైంది. పత్తి, కంది, వేరుశనగ, పెసర, నువ్వులు తదితర మెట్ట పంటల విత్తనాలు విత్తడానికి ఇది బలమైన కార్తె. ఈ కార్తెలో వర్షాలు కురుస్తుండటంతో గతంలో విత్తనాలు విత్తినా మొలకెత్తని రైతులు, ఇప్పటివరకు విత్తనం వేయని రైతులు ఇప్పుడు పత్తి, కంది, వేరుశనగ, పెసర, నువ్వులు తదితర పంటల విత్తనాలు విత్తుతున్నారు. సాగు నీటి వసతి ఉన్నవారు రోహిణి కార్తెలో వరి నార్లు పోశారు. అప్పుడు నార్లు పోసిన వారు వరి నాట్లకోసం ఇప్పుడు దుక్కులు సిద్ధం చేస్తున్నారు. వరి నార్లు పోయడానికి రోహిణి కార్తె తర్వాత ఆరుద్రకార్తె బలమైనది కావడంతో అప్పుడు నార్లు పోయని రైతులు ఈ కార్తెలో నార్లు పోయడానికి నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు, కూలీలు మెట్ట పంటల సాగు, వరినార్లు పోయడం, దుక్కులు దున్న డం తదితర పనుల్లో నిమగ్నమయ్యారు. రోహిణి కార్తెలో మొలకెత్తిన పత్తి మొక్కలకు గుంటుకలు తోలుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఈ నెల 24వ తేదీ నాటికి 50వేల ఎకరా ల్లో పత్తి పంట సాగైనట్లు అధికారులు చెబుతున్నారు.

యాదాద్రి జిల్లాలో 4.46లక్షల ఎకరాల్లో పంటల సాగు

వ్యవసాయ శాఖ అధికారుల అంచనాల ప్రకారం జిల్లాలో రైతులు 4.46లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఇందు లో మూడు లక్షల ఎకరాలకు పైగా వరి,ఒక లక్ష ఎకరాలకు పైగా పత్తి, ఏడెనిమిది వేల ఎకరా ల్లో కంది, కొంత వేరుశనగ, పెసర, నువ్వులు, పొద్దుతిరుగుడు తదితర పంటలు కూడా సాగు చేస్తారు.

నల్లగొండ జిల్లాలో 6.45లక్షల ఎకరాల్లో..

నల్లగొండ జిల్లాలో ఎరువు లు, విత్తనాలను వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉంచింది. పత్తి విత్తనాలు 14.5 లక్షల ప్యాకెట్లకుపైగా అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం 13.2లక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉండగా ఈ సారి 1.3లక్షల ప్యాకెట్ల విత్తనాలు అదనం గా అందుబాటులో ఉంచారు. వరి విత్తనాల విషయానికొస్తే గతంలో 86,450 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉండ గా, ఈసారి 82,415క్వింటాళ్లు ఉంచారు. కందులు 200 క్విం టాళ్లు, వేరుశెనగ విత్తనాలు 450 క్వింటాళ్లను అందుబాటు లో ఉంచారు. యూరియా ప్రస్తుతం 27,440 మెట్రిక్‌ టన్నులు ఉండగా,డీఏపీ4,544 మె ట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 27,183 మెట్రిక్‌ టన్నులు, ఎన్‌వోపీ 1,570మెట్రిక్‌ టన్నులను అందుబాటులో ఉం చారు. ఈ సారి పత్తి 6,45,773 ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేయగా, వరి 5,04,200 ఎకరాలు, కందులు 3,273 ఎకరాలు ఇతర పంటలు వె య్యి ఎకరాల్లో సాగవుతాయని అంచనా ఉంది. మొత్తం 11,54,286ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా ఉంది.

అందనున్న ‘రైతుబంధు’ సాయం

వానా కాలం సాగు సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి ఎకరాకు రూ.5వేల చొప్పున రైతుబంధు సాయం అందించనుంది. ఈ నెల 18 వరకు పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన వారికి కూడా రైతుబంధు సాయం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్తవారు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 26 చివరి తేదీ. యాదాద్రి భువనగిరి జిల్లాలో గతంలో 2,54,010 మంది రైతులు రైతుబంధు సాయం పొందగా కొత్తగా 12,666 మంది రైతులు రైతుబంధు సా యం పొందనున్నారని అధికారులు చెబుతున్నారు. జిల్లా రైతులకు రైతు బంధు సాయం కింద రూ.304 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 5,29,531 మంది రైతులకు రూ.622 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ సమయంలో ప్రభుత్వం అందించే రైతు బంధు సాయం పంటల సాగు పెట్టుబడికి ఎంతో ఉపయోగపడుతుందని రైతులంటున్నారు.

ఆశా జనకంగా వర్షాలు : సుచరిత, జేడీఏ, నల్లగొండ

వర్షాలు ఆలస్యంగా మొదలైనప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయి. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 50వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు సాగయ్యాయి. వెయ్యి ఎకరాల్లో నారు పోసినట్లు సమాచారం. ఇక పెట్టుబడి సాయం ఈ నెల 26వ తేదీ నుంచి మొదలవుతుంది. ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాం.

విత్తన కొనుగోళ్లలో రైతులు

మర్రిగూడ: మూడు రోజులుగా మర్రిగూడలో వర్షాలు కురుస్తుండడంతో రైతులు సాగుకు సిద్ధం చేసుకున్నారు. దుకాణాల వద్ద పత్తి విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. వర్షాలు కురుస్తాయన్న నమ్మకంతో రైతులు ముందస్తుగా దుక్కులు దున్నుకుని సిద్ధంగా ఉన్నారు. మండలంలో 36వేల ఎకరాలు సాగుకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం రోహిణి కార్తెలోనే వర్షాలు కురుస్తాయని 10వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేశారు. వర్షాలు కురవకపోవడంతో వేసిన పత్తి గింజలు ఎండకు ఎండి మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతుల మోములో ఆనందం కన్పిస్తోంది. మండలంలోని భీమనపల్లిలో రైతులు దుక్కులు దున్నుకుంటున్నారు. మండలంలో గత సంవత్సరం 32వేల ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి రైతులు 36వేల ఎకరాల్లో సాగు చేసుకున్నారని ఏవో స్పందన తెలిపారు.

Updated Date - 2023-06-26T00:55:55+05:30 IST