Share News

బడిబయట పిల్లల సర్వేకు సన్నద్ధం

ABN , First Publish Date - 2023-12-10T22:42:49+05:30 IST

బడిబయట పిల్లల సర్వేకు మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 10వ తేదీ నుంచి నెల రోజుల పాటు పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు.

బడిబయట పిల్లల సర్వేకు సన్నద్ధం

నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన

మేడ్చల్‌ డిసెంబరు10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : బడిబయట పిల్లల సర్వేకు మేడ్చల్‌ జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. ఈనెల 10వ తేదీ నుంచి నెల రోజుల పాటు పిల్లలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. విద్యాశాఖలో పనిచేస్తున్న సీఆర్‌పీలు, ఐఈఆర్‌పీలు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు, ప్రత్యేక అధికారులు ఇందులో భాగస్వాములై బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించనున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా 6 నుంచి 14 ఏళ్లలోపు బడిబాట పట్టని వారిని, 14 ఏళ్లు పైబడిన వారిని గుర్తించనున్నారు. 30 రోజుల పాటు బడికి వెళ్లకుండ డ్రాప్‌ అవుట్‌లు ఉన్న వారిని వెతికి బడిబాట పట్టించడం, పాఠశాలల్లో చేర్పించడం చేయనున్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి పనులు చేసుకునే కుటుంబాల పిల్లలు, ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి పనులు చేసే కుటుంబాల పిల్లలను ఇందులో పరిశీలన చేయనున్నారు.

ఇటుక బట్టీల్లో ఎక్కువ మంది

వలస కార్మికుల్లో ఎక్కువగా బడిబయట ఉన్న పిల్లలు, బాలకార్మికులు కనిపిస్తారు. వలస కార్మిక కుటుంబాలు ఇక్కడికి పనులకు వచ్చినప్పుడు వెంట తమ పిల్లలను తీసుకొచ్చి పనులు పూర్తయ్యాక తిరిగి తీసుకెళ్తుంటారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాకు ఒడిశా, మహారాష్ట్రాల నుంచి ఎక్కువగా ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు కార్మికులు వస్తున్నారు. గత సంవత్సరం ఇటుక బట్టీల వద్ద దాదాపు 500మంది పిల్లలను గుర్తించారు. ఇటుక బట్టీల వద్ద వర్క్‌సైట్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇటుక బట్టీల యజమానులే అక్కడ ఉన్న పిల్లలను వారి మాతృభాషలోనే బోధనకు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా జిల్లాకు చెందిన వారు ఇతర ప్రాంతాలకు సీజనల్‌గా పనులకు వలస పోతుంటారు. అలాంటి వలస కుటుంబాల వారి పిల్లల గురించి ఆరా తీస్తారు.

క్షేత్రస్థాయిలో సర్వే చేస్తాం: విజయలక్ష్మీ, డీఈవో

బడిబయట ఉన్న పిల్లలను గుర్తించేందుకు ఈనెల 10 నుంచి నెల రోజుల పాటు సర్వే నిర్వహించనున్నాం. బడీడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం, డ్రాప్‌ అవుట్‌లను గుర్తించడం, బడిబాట పట్టని వారిని గుర్తించి బడుల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటాం. సర్వే, ఇతర విద్యావిషయాల కార్యాచరణ, సన్నద్ధతపై సమావేశం నిర్వహించాం.

Updated Date - 2023-12-10T22:42:50+05:30 IST