అప్పుల ఊబిలో విద్యుత్ ఉత్పాదన రంగం
ABN , Publish Date - Dec 31 , 2023 | 03:36 AM
విద్యుత్ ఉత్పాదన రంగంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ లెక్కలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని, గడిచిన 10 ఏళ్ల కాలంలో విద్యుత్ ఉత్పాదన రంగం కోసం చేసిన అప్పులు భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ లెక్కలు ఆందోళనకరం
వాస్తవాలను చూపేందుకే క్షేత్ర స్థాయి పర్యటన
‘భద్రాద్రి’ భారాన్ని 30 ఏళ్లు మోయాల్సిందే: భట్టి
మణుగూరు, డిసెంబరు 30: విద్యుత్ ఉత్పాదన రంగంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ లెక్కలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయని, గడిచిన 10 ఏళ్ల కాలంలో విద్యుత్ ఉత్పాదన రంగం కోసం చేసిన అప్పులు భవిష్యత్ తరాలకు ప్రమాదకరంగా మారేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో భట్టి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు నాటికి విద్యుత్ రంగ బకాయిలు రూ.7,259 కోట్లు ఉండగా, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ.81,516 కోట్లకు పెరిగాయన్నారు. నిరంతరాయంగా విద్యుత్ అందించామని వారు చెప్పిన లెక్కలు చూస్తుంటే భవిష్యత్ తరాలను తాకట్టు పెట్టారన్న విషయం అర్థమవుతోందన్నారు. విద్యుత్ ఉత్పాదన రంగంలో సూపర్ క్రిటికల్ విధానాన్ని అనుసరించాలని స్పష్టమైన మార్గదర్శకాలున్నా.. భద్రాద్రి పవర్‌ప్లాంట్‌లో సబ్ క్రిటికల్ సాంకేతికను వినియోగించారని ధ్వజమెత్తారు. దీనివల్ల పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు 30 ఏళ్లపాటు ప్రజలు ఆర్థిక భారాన్ని మోయాల్సిన పరిస్థితి ఉందన్నారు. కాగా, ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.