పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి

ABN , First Publish Date - 2023-07-15T05:05:11+05:30 IST

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ-పీసీసీ) కో-ఛైర్మన్‌గా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు.

పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి

ప్రచార కమిటీని విస్తరించిన ఏఐసీసీ

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీ-పీసీసీ) కో-ఛైర్మన్‌గా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. చైర్మన్‌గా మధుయాష్కి గౌడ్‌ను గతంలోనే నియమించగా తాజాగా కో-ఛైర్మన్‌, కన్వీనర్‌తోపాటు 37 మందితో ఎగ్జిక్యూటివ్‌ కమిటీని నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శుక్రవారం ప్రకటన జారీచేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురై, ఇటీవల రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరిన పొంగులేటికి ప్రచార కమిటీ కో-ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించటం గమనార్హం. కన్వీనర్‌గా కూడా గతంలో నియమించిన అజ్మతుల్లా హుస్సేనినే కొనసాగించారు. కాగా కార్యనిర్వాహక కమిటీలో టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ్‌ కుమార్‌, కత్తి కార్తీక గౌడ్‌ కూడా ఉన్నారు. ప్రచార కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత, శాసనమండలి పక్షనేత, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కమిటీ ఆఫీస్‌ బేరర్లు, డీసీసీ అధ్యక్షులు ఉంటారని కేసీ వేణుగోపాల్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎన్నికల కోసం ఏఐసీసీ అబ్జర్వర్ల నియామకం

రానున్న ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోనూ కర్ణాటక తరహా వ్యూహాలను అమలుచేస్తున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ అబ్జర్వర్లను నియమించింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు తదితర స్థాయిల్లో ఉన్న వారిని అబ్జర్వర్లుగా నియమించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఆమోదించారు. ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరును, ఏఐసీసీ సూచించిన కార్యక్రమాలు సరిగా అమలవుతున్నాయా లేదా అనే అంశాలను ఈ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు.

Updated Date - 2023-07-15T05:05:11+05:30 IST