ఉద్యోగులపై పోలీస్‌ జులుం

ABN , First Publish Date - 2023-06-03T03:56:37+05:30 IST

కొత్త సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రావతరణ దినోత్సవం నాడు కూడా తీవ్ర అవమానాల పాలయ్యారు.

ఉద్యోగులపై పోలీస్‌ జులుం

సచివాలయం వద్ద దురుసు ప్రవర్తన..

స్కానర్లతో నఖ శిఖ పర్యంతం తనిఖీలు

సీఎస్‌కు ఫిర్యాదు..

రాష్ట్రావతరణ దినోత్సవం ముగిసిన తర్వాత సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, ఉపాధ్యక్షురాలు మంగమ్మ, ప్రధాన కార్యదర్శి యూసుఫ్‌ మియా, కోశాధికారి రాజేశ్‌ల ఆధ్వర్యంలో దాదాపు 50 మంది ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి పోలీసుల దురుసు ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. ఉద్యోగులను ఆహ్వానించి, అవమానపర్చడం ఏం బాగాలేదని తెలిపారు. పోలీసులు ఉద్యోగుల రాకపోకలకు ఆటంకాలు కలిగించడమేంటని ప్రశ్నించారు. మెటల్‌ డిటెక్టర్లతో అవమానకర రీతిలో చెక్‌ చేయడం అస్సలు బాగా లేదన్నారు. పోలీసుల తీరు నిందితులను తనిఖీ చేసినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. స్పందించిన సీఎస్‌.. శనివారం పోలీసు, సాధారణ పరిపాలన శాఖలు, ఉద్యోగ సంఘాలు, ఇతర అధికారులతో కో–ఆర్డినేషన్‌ సమావేశాన్ని నిర్వహిస్తానని చెప్పారు. ఉద్యోగులకు ఇబ్బందులు, ఆటంకాలు లేకుండా చూస్తానని భరోసా ఇచ్చారు.

సచివాలయంలోకి వాహనాలకు అనుమతి నిరాకరణ

సిబ్బంది పార్కింగ్‌ స్థలంలో పోలీసుల వాహనాలు

మహిళా ఉద్యోగుల కంట తడి

అవతరణ దినోత్సవాన అవమానాలు

పిలిచి అవమానించారంటూ ఆవేదన

సీఎస్‌కు ఉద్యోగుల సంఘం ఫిర్యాదు

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కొత్త సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్రావతరణ దినోత్సవం నాడు కూడా తీవ్ర అవమానాల పాలయ్యారు. తాము పని చేసే సచివాలయంలోకి ఆటంకాలు లేకుండా ప్రవేశించలేకపోయా రు. హెచ్‌వోడీల నుంచి వచ్చిన ఉద్యోగులకూ ఇక్కట్లు తప్పలేదు. పోలీసుల చేతిలో అడుగడుగునా అవమానానికి గురయ్యారు. గేటు వద్దనే నిలిపివేసి, నిందితులను చూసినట్లు చూడడం ఒక ఎత్తయితే.. వాహనాలను అనుమతించకుండా వారి పార్కింగ్‌ స్థలాన్ని పోలీసులు కబ్జా చేయడం మరో ఎత్తు! ఇక స్కానర్లు, మెటల్‌ డిటెక్టర్లతో నఖశిఖ పర్యంతం తనిఖీ చేయడం ఉద్యోగులను మరీ కుంగదీసింది. పోలీసుల తీరు, దురుసు ప్రవర్తనతో కొందరు మహిళా ఉద్యోగులు కంటతడిపెట్టారు. కొంతమందైతే పోలీసులకు చీవాట్లు పెట్టారు. అయినా.. ఉద్యోగుల వాహనాలను బయటే పెట్టి రావాలంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ప్రభుత్వం ఉత్సవాలకు పిలిచి మరీ అవమానించిందని ఉద్యోగులు వాపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా తెలంగాణ ఉద్యోగులకు ఇంతటి అవమానాలు ఎదురవలేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ ప్రయాణికులు వచ్చిపోయే శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కూడా ఇలాంటి నిబంధనలు, తనిఖీలు లేవని ఉద్యోగ సంఘం నేత ఒకరు వ్యాఖ్యానించారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి సీఎం కేసీఆర్‌ హాజరు కావడంతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రగతి భవన్‌ పరిసరాల్లోనే 12 అడుగుల కంచెను ఏర్పాటు చేయించుకున్న కేసీఆర్‌ సర్కా రు.. సచివాలయంలో ఉత్సవాల సందర్భంగా ఆ మా త్రం భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం సహజమే! కానీ, రోజూ సచివాలయంలో విధులు నిర్వహించే అధికారులు, ఉద్యోగులతో పాటు హెచ్‌వోడీల నుంచి వచ్చిన సిబ్బంది పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారు.

అతిగా ప్రవర్తించిన పోలీసులు

పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల సాకుతో పోలీసులు అతిగా ప్రవర్తించడం, సచివాలయ ఉద్యోగులని కూడా చూడకుండా దురుసుగా మాట్లాడడం విమర్శలకు తావిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, అప్పటి ఉమ్మడి ప్రభుత్వాన్ని హడలెత్తించిన ఇదే సచివాలయ ఉద్యోగులు పోలీసులు అనుసరించిన తీరును జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ప్రభుత్వమే ఉద్యోగులను ఉత్సవాల్లో పాల్గొనాలంటూ ఆహ్వానించింది. హెచ్‌వోడీల సిబ్బందిని తరలించడానికి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది. ఉదయం 8.30–9 గంటల మధ్యలో సచివాలయానికి చేరుకోవాలని తెలిపింది. హెచ్‌వోడీల సిబ్బందిని పక్కన పెడితే.. సచివాలయ ఉద్యోగులైతే రోజూ వచ్చి పోయే వారే. పోలీసులు వారినైనా గుర్తించి కనీస మర్యాద ఇవ్వాల్సింది. కానీ, ఉద్యోగి అని చెప్పగానే పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కొందరు సిబ్బంది ఆర్టీసీ బస్సుల్లో రాగా.. మరికొందరు సొంత వాహనాల్లో వచ్చారు. సెక్షన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ సెక్రటరీ వంటి అధికారులు సొంత కార్లలో వచ్చారు. వారి కార్లను పోలీసులు లోనికి వెళ్లనివ్వలేదు. సచివాలయంలో తమ కోసం ప్రత్యేకంగా పార్కింగ్‌ స్థలం ఉందని చెప్పినా వినిపించుకోలేదు. లోపల పార్కింగ్‌ స్థలం ఖాళీ లేదని, వాహనాలను బయటే పెట్టుకోవాలని తేల్చిచెప్పారు. సచివాలయంలోని నార్త్‌ జోన్‌లో ఉద్యోగులకు పార్కింగ్‌ స్థలాన్ని కేటాయించారు. అయితే బందోబస్తు కోసం వచ్చిన సివిల్‌, స్పెషల్‌ పోలీసులు తమ వాహనాలన్నింటినీ ఆ స్థలంలో పెట్టారు. ఫలితంగా ఉద్యోగులు బయట ఎక్కడో వాహనాలను పార్కింగ్‌ చేసి, నడిచి రావాల్సి వచ్చింది. అలా వచ్చిన వారిలో కూడా ఒక్కో ఉద్యోగిని రెండు మూడు నిమిషాల పాటు తనిఖీలు చేశారు. ఉద్యోగులు ప్రవేశించే గేటు వద్ద పెద్ద స్కానర్‌ను ఏర్పాటు చేశారు. దాన్ని దాటుకుని వెళ్లిన తర్వాత మెటల్‌ హ్యాండ్‌ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. మహిళా ఉద్యోగుల బ్యాగులను కూడా తనిఖీ చేశారు. దీంతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి అవమానాలా అని వాపోయారు.

Updated Date - 2023-06-03T03:56:44+05:30 IST