CM KCR: త్వరితగతిన పోడు భూములకు పట్టాలు!

ABN , First Publish Date - 2023-02-24T01:56:26+05:30 IST

అర్హులైన గిరిజనులకు త్వరితగతిన పోడు భూముల హక్కు పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు.

CM KCR: త్వరితగతిన పోడు భూములకు  పట్టాలు!

మంత్రి సత్యవతి, అధికారులతో సీఎం కేసీఆర్‌ కీలక భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ప్రభావంపై చర్చ

గిరిజనేతరులపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అర్హులైన గిరిజనులకు త్వరితగతిన పోడు భూముల హక్కు పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఒక్కసారి పట్టాల పంపిణీ చేశాక ఎలాంటి వ్యతిరేకత రాకుండా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పోడు భూముల హక్కు పట్టాల పంపిణీ అంశంపై గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, గిరిజన శాఖ ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. గురువారం సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. రాష్ట్రంలో 11.50 లక్షల ఎకరాల పోడు భూమికి హక్కు పట్టాలిస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. పోడు భూములకు హక్కు పట్టాల కోసం 4.14 లక్షల మంది నుంచి 12.14 లక్షల ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో పట్టాల పంపిణీకి సంబంధించిన పనులు క్షేత్రస్థాయిలో ఏ మేరకు జరిగాయని అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. కేంద్ర నిబంధనల ప్రకారం కేవలం గిరిజనులకే పట్టాలు అందే అవకాశం ఉండడంతో గిరిజనేతరుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై సమీక్షించారు. అయితే, అర్హులైన గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు సమాచారం. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉండడంతో అది కేవలం ఎన్నిక జరిగే ప్రాంతాలకే వర్తిస్తుందా లేదా అన్ని ప్రాంతాల్లోనూ అమల్లో ఉంటుందా అనేది తెలుసుకుని త్వరితగతిన పట్టాల పంపిణీ చేపట్టాలన్నారు. గిరిజనేతరులకు కూడా హక్కు పట్టాలు పంపిణీ చేయాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో గిరిజనేతరుల అంశంపై కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు సమాచారం.

Updated Date - 2023-02-24T08:49:59+05:30 IST