బీసీ కుల గణన, మంత్రిత్వ శాఖపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలి
ABN , First Publish Date - 2023-11-06T04:25:17+05:30 IST
హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ బీసీల కుల గణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, మహిళా బిల్లులో బీసీ కోటాలపై ప్రకటన చేయాలని బీసీల రాజకీయ మేధో మథన సదస్సు డిమాండ్ చేసింది.
లేదంటే 9న భవిష్యత్ కార్యాచరణ.. బీసీల ‘మేధోమథనం’లో తీర్మానం
ఖైరతాబాద్, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌కు రానున్న ప్రధాని మోదీ బీసీల కుల గణన, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ, మహిళా బిల్లులో బీసీ కోటాలపై ప్రకటన చేయాలని బీసీల రాజకీయ మేధో మథన సదస్సు డిమాండ్ చేసింది. లక్డీకాపూల్‌లోని అశోకా హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల రాజకీయ మేధో మథన సమావేశం ఆదివారం జరిగింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల అధ్యక్షులు, మేధావులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ కేవలం 23 మంది బీసీలకు టికెట్లు ఇవ్వగా.. కాంగ్రెస్ పార్టీ 20 మందికి టికెట్లు ఇచ్చిందని, అందులో 6 పాత నగరానికి చెందిన స్థానాలను ఇచ్చి మోసగించిందని ఆరోపించారు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని, అయితే నగరంలో బీసీ గర్జన సభకు వస్తున్న ప్రధాని మోదీ బీసీల డిమాండ్లపై ప్రకటన చేస్తే వారికి బీసీల మద్దతుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లేదంటే ఈ నెల 9న భవిష్యత్ కార్యాచరణ చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సైతం బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశంలో పలు రాష్ట్రాల్లో బీసీలు ముఖ్యమంత్రులు అవుతున్నా, కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే కాలేకపోయారని విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ ఛైర్మన్ కె.గణేష్ చారి తదితరులు పాల్గొన్నారు.