PM MODI : నేడు నిజామాబాద్‌కు మోదీ
ABN , First Publish Date - 2023-10-03T03:00:04+05:30 IST
ఒక రోజు వ్యవధిలోనే ప్రధాని మోదీ రాష్ట్రంలో మరోమారు పర్యటించనున్నారు.
వేల కోట్ల ప్రాజెక్టులకు వర్చువల్‌గా శ్రీకారం
రామగుండం ఎన్టీపీసీ 800 మెగావాట్ల
ప్లాంట్, మనోహరాబాద్-సిద్దిపేట రైల్వే లైన్,
విద్యుదీకరించిన 2 లైన్లు జాతికి అంకితం
అనంతరం సభలో ప్రసంగించనున్న ప్రధాని
గిరిరాజ్ కళాశాల మైదానంలో భారీ ఏర్పాట్లు
రాష్ట్రానికి 6న నడ్డా.. 10న అమిత్‌షా రాక
బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధం!
పసుపు రైతుల కోసం ఏమైనా చేస్తాం: మోదీ
వేల కోట్ల ప్రాజెక్టులకు వర్చువల్‌గా శ్రీకారం
న్యూఢిల్లీ, హైదరాబాద్, నిజామాబాద్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఒక రోజు వ్యవధిలోనే ప్రధాని మోదీ రాష్ట్రంలో మరోమారు పర్యటించనున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో బీజేపీ ప్రజాగర్జన సభకు హాజరైన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్ వస్తున్నారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి తెలంగాణలో దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం తెలిపింది. తొలుత రామగుండం ఎన్‌టీపీసీలో తొలిదశలో నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను, మనోహరాబాద్-సిద్దిపేట నూతన రైల్వే లైను, విద్యుద్దీకరించిన ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూలు లైన్లను జాతికి అంకితం చేస్తారు. అనంతరం ఇదే మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ సభ కోసం బీజేపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. దీనికి తొలుత ‘ఇందూరు జనగర్జన’ అని పేరు పెట్టారు. అయితే ప్రధాని మహబూబ్‌నగర్ సభలో నిజామాబాద్‌కు జాతీయ పసుపు బోర్డును ప్రకటించడంతో ‘ధన్యవాద్ సభ’గా పేరు మార్చారు. మహబూబ్‌నగర్ సభసక్సెస్ కావడంతో బీజేపీ దూకుడు పెంచబోతోంది. రాష్ట్రంలో మరిన్ని సభలు నిర్వహించాలని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కరీంనగర్, నిర్మల్‌లో కూడా మోదీ సభలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ నెల 10న కేంద్ర హోంమంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 6న రాష్ట్రానికి రానున్నారు. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా సిద్ధమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి ఈ జాబితాను సోమవారం జాతీయ నాయకత్వానికి నివేదించారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తర్వాత అక్టోబరు రెండో వారంలో తొలి జాబితాను ప్రకటిస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు.
పసుపు రైతుల కోసం ఏమైనా చేస్తాం: మోదీ
పసుపు రైతులకు ఉజ్వల భవిష్యత్తు అందించేందుకు తాము ఎంతవరకైనా వెళ్తామని, ఏమైనా చేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రధాని పసుపు బోర్డు ప్రకటించినందుకు నిజామాబాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. అర్వింద్ పోస్టును రీపోస్ట్ చేసిన ప్రధాని.. రైతుల శ్రేయస్సు, సౌభాగ్యాలే ఎల్లప్పుడూ తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
ప్రధాని సభకుఆ ముగ్గురు ఎందుకు రాలేదు?
కిషన్‌రెడ్డిని ఆరా తీసిన అమిత్ షా
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. మోదీ నిజామాబాద్ పర్యటన ఏర్పాట్లు తదితర అంశాలపై అరగంటకు పైగా వారు చర్చించారు. అనంతరం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రధాని సభకు ముగ్గురు నేతల గైర్హాజరవడంపై అమిత్ షా ఆరా తీసినట్లు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ ప్రధాని సభకు ఎందుకు హాజరు కాలేదు? అని అమిత్ షా.. కిషన్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. కొంతమంది అసమ్మతి నేతలు పార్టీ వీడుతున్నారనే ప్రచారం జరుగుతున్న వేళ ఈ ముగ్గురు నాయకులు మోదీ సభకు డుమ్మా కొట్టడం రాష్ట్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.