ప్లాట్లను కబ్జా చేస్తున్నారు
ABN , First Publish Date - 2023-09-20T04:29:00+05:30 IST
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయని విఘ్నేశ్వర కాలనీ అసోసియేషన్, పిల్లి నర్సింగరావు (పీఎన్‌ఆర్) సొసైటీలకు చెందిన పలువురు ఆరోపించారు.

మైనంపల్లి ఆగడాలు మితిమీరుతున్నాయ్
పోలీసులూ మమ్మల్నే బెదిరిస్తున్నారు
ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి
విఘ్నేశ్వర కాలనీ అసోసియేషన్,
పీఎన్‌ఆర్ సొసైటీ ప్రతినిధుల డిమాండ్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన అనుచరుల ఆగడాలు మితిమీరుతున్నాయని విఘ్నేశ్వర కాలనీ అసోసియేషన్, పిల్లి నర్సింగరావు (పీఎన్‌ఆర్) సొసైటీలకు చెందిన పలువురు ఆరోపించారు. తమ ప్లాట్లను ఆక్రమించి.. వాటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. 27 ఏళ్లుగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులతో ప్లాట్ల విషయంపై పోరాటం చేస్తున్నామన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆ సొసైటీలకు చెందిన జయరాజ్, లావణ్య, సుకన్య, శ్రీరామ్, హేమంత్ తదితరులు మాట్లాడారు. పైసా పైసా కూడబెట్టుకొని కొనుగోలు చేసిన ఆస్తులను తమకు కాకుండా చేస్తున్నారని వాపోయారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జొన్నబండలోని సర్వే నంబరు 22, 23లో 12 ఎకరాల 21 గుంటల భూమిలో అభివృద్ధి చేసిన లే అవుట్‌లో 1980లో 142 మంది ప్లాట్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు.
డైమెన్షన్లు మార్చి అక్రమంగా కొత్త లే అవుట్ రూపొందించారని, దాని ఆధారంగా ప్లాట్లకు సంబంధించి మైనంపల్లి అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని ఆరోపించారు. ప్లాట్ల వద్దకు వెళితే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. పోలీసులూ వారికే అండగా ఉంటున్నారని, ప్లాట్ల వద్దకు వెళ్తున్న తమను అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. ప్లాట్ల వద్ద ధర్నా చేసేందుకు వెళితే పోలీసులతో అడ్డుకున్నారని, మైనంపల్లి అనుచరులు తమపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. మౌలాలిలోని పీఎన్‌ఆర్ కాలనీలో ఏడేళ్ల క్రితం తాము ప్లాట్లు కొనుగోలు చేశామని, వాటినీ మైనంపల్లి అనుచరులు కబ్జా చేశారని ఆరోపించారు. 2015లో మల్కాజిగిరిలో సర్వే నంబరు 418, 419, 420, 421లోని 19 ఎకరాల్లో లే అవుట్ చేశారని, దాదాపు 170 మంది ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పటికే 70 మంది ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నారని చెప్పారు. ఇక్కడి ప్లాట్లకు నకిలీ పత్రాలు సృష్టించి.. గూండాలను పెట్టి తమను అడ్డుకుంటున్నారని వాపోయారు.
ఆగడాలు పెరిగిపోయాయ్: సాయి
ప్లాట్ల కబ్జా మైనంపల్లి అండతోనే జరుగుతోందని, సామాన్యులకు అన్యాయం చేస్తున్నారని బీజేవైఎం నేత సాయి ఆరోపించారు. ప్లాట్ల కబ్జా, అక్రమ నిర్మాణాల విషయాన్ని జీహెచ్‌ఎంసీ, ఇతర ప్రభుత్వ విభాగాల దృష్టికి తీసుకెళ్తామని..స్పందించకపోతే తామే ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని తెలిపారు.