Share News

ఓటరు జాబితా సవరణకు ప్రణాళిక !

ABN , First Publish Date - 2023-12-10T22:44:21+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంటు ఎన్నికలకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 2024 (ఎస్‌ఎ్‌సఆర్‌)కు ఎన్నికల సంఘం సిద్ధ్దమైంది.

ఓటరు జాబితా సవరణకు ప్రణాళిక !

ఈనెల 20నుంచి ప్రక్రియ ప్రారంభం

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి తుది జాబితా ఖరారు

ఈ జాబితాతోనే సర్పంచ్‌, పార్లమెంటు ఎన్నికలకు !

శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు

తాండూరు, డిసెంబరు 10: అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంటు ఎన్నికలకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ 2024 (ఎస్‌ఎ్‌సఆర్‌)కు ఎన్నికల సంఘం సిద్ధ్దమైంది. ఇందుకు సంబంధించి ప్రణాళికను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈసారి పకడ్బందీగా సవరణను చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. వచ్చే యేడాది అంతా స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఈనెల 20వ తేదీ నుంచి ఎస్‌ఎ్‌సఆర్‌ ప్రణాళికను బూత్‌ల వారీగా బీఎల్‌వోల ద్వారా చేపట్టనున్నారు. 2024 జనవరి 5వరకు పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఓటరు జాబితాకు, ఓటరు కార్డులకు మధ్య వ్యత్యాసం, గుర్తింపు కార్డుల్లో నాణ్యత తక్కువ ఉండే ఫొటోలు, ఇతర ఫొటోల తొలగింపుతో పాటు పోలింగ్‌ కేంద్రాల పరిధి, హద్దుల నిర్ధారణ వంటి ప్రక్రియను చేపట్టనున్నారు. బీఎల్‌వోలు ఇంటింటికీ తిరుగుతూ 18 ఏళ్లు నిండిని వారిని ఓటరుగా నమోదు చేయించనున్నారు. ఈప్రక్రియ అంతా ముగిశాక 2024 జనవరి 6న ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. 22వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 2024 ఫిబ్రవరి 2వరకు అభ్యంతరాలపై వివరణలు ఇచ్చి 8వ తేదీన ఓటరు తుది జాబితాను విడుదల చేయనున్నారు. 2024జనవరి1 నాటికి 18 ఏళ్ళు నిండిన యువతీ, యువకులందరికీ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లోగానీ నమోదు చేసుకోవాలి. కాగా తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాలలో మహిళా ఓటర్లు అధికంగా ఉండగా పరిగిలో పురుషులు అధికంగా ఉన్నారు.

Updated Date - 2023-12-10T22:44:23+05:30 IST