లారీల మధ్య నలిగిన ప్రాణాలు

ABN , First Publish Date - 2023-06-02T02:40:26+05:30 IST

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరిన ఓ కుటుంబాన్ని లారీల రూపంలో మృత్యువు కబళించింది.

లారీల మధ్య నలిగిన ప్రాణాలు

కుమారుడు సహా దంపతుల మృతి

మరో కుమారునికి తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లాలో ఘోర ప్రమాదం

శ్రీకాళహస్తి దగ్గర ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు

మహబూబాద్‌ జిల్లా వాసులు నలుగురి మృతి

కొణిజర్ల, జూన్‌ 1: ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరిన ఓ కుటుంబాన్ని లారీల రూపంలో మృత్యువు కబళించింది. రెండు లారీ మధ్య కారు నలిగిపోవడంతో కుమారుడు సహా దంపతులు మృత్యువాత పడ్డారు. ఆ దంపతుల పెద్దకొడుకు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పలమడకకు చెందిన పారుపల్లి రాజేష్‌(36) హైదరాబాద్‌లోని ఓ ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. రాజే్‌షకు భార్య సుజాత(34), కొడుకులు దివిజిత్‌ శ్రీరామ్‌. ఆశ్రిత్‌ శ్రీరామ్‌(9), ఉన్నారు. దివిజిత్‌ ఏడో తరగతి, అశ్రిత్‌ నాలుగో తరగతి చదువుతున్నారు. పిల్లలకు వేసవి సెలవులు ముగుస్తుండటం, తనకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో భార్యాపిల్లలతో కలిసి రాజేష్‌ బుధవారం అర్ధరాత్రి దాటాక సొంత కారులో స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే, గురువారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో వీరు ప్రమాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మరమ్మతులకు గురైన ఓ ట్యాంకర్‌ కొణిజర్ల పోలీసుస్టేషన్‌కు సమీపంలో రోడ్డుపై నిలిపి ఉంది. అయితే, ఎదురుగా వస్తున్న వాహనాలకు దారిచ్చే క్రమంలో వైరా వైపు వెళుతున్న ఓ లారీ ఆ ట్యాంకర్‌ వెనుక ఒక్కసారిగా ఆగింది.

9accident1.jpg

ఇది గమనించిన రాజేష్‌ తన కారును ఆ లారీ వెనకే ఆపగా.. వేగంగా దూసుకొచ్చిన మరో లారీ ఆ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రెండు లారీల మధ్య నలిగి కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఎయిర్‌ బ్యాగులు తెరుచుకున్నా ఫలితం లేకపోయింది. డ్రైవింగ్‌ సీట్‌లో ఉన్న రాజేష్‌.. వెనక సీట్లలో ఉన్న సుజాత, అశ్రిత్‌ అక్కడికక్కడే మరణించారు. రాజేష్‌ పక్క సీటులో ఉన్న దివిజిత్‌ మాత్రం కారులో ఇరుక్కుపోయాడు. ప్రమాద తీవ్రతకు తల్లి, తండ్రి, సోదరుని మృతదేహాలు తన మీద పడ్డా దివిజిత్‌ గుర్తించ లేకపోయాడు. ‘నా మీద రాళ్లు పడ్డాయి.. అంకుల్‌ సేవ్‌మీ’ అంటూ ప్రమాదాన్ని గుర్తించి అక్కడికి చేరుకున్న స్థానికులను చూసి ఆర్తనాదాలు పెట్టాడు. దివిజిత్‌ను బయటకు తీసిన స్థానికులు 108లో ఆస్పత్రికి తరలించారు. దివిజిత్‌ చెప్పిన వివరాల ఆధారంగా రాజేశ్‌, సుజాతల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

Updated Date - 2023-06-02T03:51:05+05:30 IST