‘విజయభేరి’కి జనం విజయోస్తు!

ABN , First Publish Date - 2023-09-18T04:18:54+05:30 IST

బస్సుల్లో.. కార్లల్లో.. వ్యాన్లలో.. జీపుల్లో.. కాలినడకన.. దారులన్నీ తుక్కుగూడకే అన్నట్టుగా జనం..

‘విజయభేరి’కి జనం విజయోస్తు!

తుక్కుగూడ సభకు పోటెత్తిన ప్రజలు..

శ్రేణుల్లో ఎంతగానో పెరిగిన ధీమా

(ఆంధ్రజ్యోతి-రంగారెడ్డి జిల్లా ప్రతినిధి/హైదరాబాద్‌/సిటీ) : బస్సుల్లో.. కార్లల్లో.. వ్యాన్లలో.. జీపుల్లో.. కాలినడకన.. దారులన్నీ తుక్కుగూడకే అన్నట్టుగా జనం.. ప్రభంజనం! ఎటు చూసినా జనసంద్రం. ఇసకేస్తే రాలనంతగా ప్రజాసముద్రం. హైదరాబాద్‌ నగర శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్‌ ఆదివారం నిర్వహించిన ‘విజయభేరి’ సభకు పోటెత్తిన జనవాహిని అది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నిర్వహించిన ఈ భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు హాజరయ్యారు. దీంతో.. కాంగ్రెస్‌ నిర్వహించిన అతి పెద్ద బహిరంగ సభల్లో ఒకటిగా ఈ సభ చరిత్రలో నిలిచిపోనుందంటే అతిశయోక్తి కాదు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో సభాప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్‌ అంచనాలకు మించి విజయభేరి సభ విజయవంతమైంది. తుక్కుగూడ, ఔటర్‌ సర్వీసు రోడ్లన్నీ జన ప్రవాహంగా మారిపోయాయి. ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ రాష్ట్ర స్థాయి నాయకత్వం.. ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయడంతో పాటు, జన సమీకరణకు కమిటీలు వేసి రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని తరలించడంలో సఫలమైంది.

దాని ఫలితమే ఈ ‘విజయం’. భారీగీ జనం తరలిరావడంతో ఔటర్‌ రింగు రోడ్డు, తుక్కుగూడ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడ్డాయి. సభాప్రాంగణానికి సమీపంలో నాలుగు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్‌ స్థలాల్లో వేలాది వాహనాలతో సాయంత్రం ఆరుగంటలకే నిండిపోయాయి. దీంతో సభకు వచ్చే వారి వాహనాలను సుదూరంలోనే నిలిపివేయడంతో కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. తుక్కుగూడ నుంచి కడ్తాల్‌ వరకు 26 కిలోమీటర్ల మేర వాహనాలు కిక్కిరిసిపోయాయి. దీంతో ఈ రహదారి వెంటే సభకు వచ్చే సుమారు లక్ష మంది మార్గమధ్యంలోనే ఆగిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాగే సాగర్‌ రోడ్డు నుంచి వాహనాలు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోయాయి. అక్కడ నుంచి కొందరు కాలినడకనే రాత్రి ఏడుగంటల వరకూ సభాప్రాంగణానికి వస్తూనే ఉన్నారు. కానీ, అప్పటికే అది నిండిపోవడంతో వారంతా బయటే ఉండిపోవాల్సి వచ్చింది. ఇలా విజయభేరి సభ విజయవంతంకావడంతో కాంగ్రెస్‌ నేతలు, శ్రేణులు సంతోషంతో తబ్బిఉబ్బిబ్బవుతున్నాయి. కాంగ్రెస్‌ నేతల్లో ధీమా పెరిగింది. ఎన్నికల ముందు జరిగే రాజకీయ సభలకు జనం ఇంతగా పోటెత్తడం.. పార్టీ అధికారంలోకి రానుందనడానికి సంకేతమని కాంగ్రెస్‌ నేత ఒకరు తెలిపారు.

ఆకట్టుకున్న ఎన్నికల హామీలు

సభలో కాంగ్రెస్‌ ప్రకటించిన హామీలు.. సభకు హాజరైన వారిని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆరు గ్యారెంటీ స్కీములకుగాను.. మూడింటిని సోనియాగాంధీ ప్రకటించగా మిగిలిన మూడు స్కీమ్‌లనూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అయితే, సోనియాగాంధీ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే మాట్లాడి వెళ్లిపోవడంతో సభకు హాజరైన వారు కొంత నిరుత్సాహపడ్డారు. తరువాత రాహుల్‌గాంధీ సుధీర్ఘంగా మాట్లాడి ఆకట్టుకున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం మీద నేరుగా ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్‌ ప్రసంగం చేస్తున్నంతసేపు జనం ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.

సైడ్‌ లైట్స్‌..

రెండు నెలల క్రితం కాంగ్రెస్‌ ఖమ్మంలో నిర్వహించిన బహిరంగసభలో గద్దర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాహుల్‌ గాంధీని ఆలింగనం చేసుకుని తన అభిమానాన్ని చాటారు. ఆయన కన్నుమూసిన నేపథ్యంలో.. సభావేదికపై ఏర్పాటుచేసిన భారీ స్ర్కీన్‌పై.. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞత తెలుపుతూ.. గద్దర్‌ ఆలపించిన.. ప్రత్యేక గీతాల వీడియోలు ప్రదర్శించారు.

సభలో రాహుల్‌ ఎక్కువసేపు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంతసేపూ సభికుల నుంచి విశేష స్పందన లభించింది.

ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రసంగానికీవిశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలను ప్రస్తావిస్తూ ఆమె చేసిన ప్రసంగాన్ని జనం ఆసక్తిగా విన్నారు.

సభ సక్సెస్‌ కావడంతో సోనియాగాంధీ ప్రశంసలు

విజయభేరి సభకు లక్షలాదిగా జనం పోటెత్తి విజయవంతం కావడంతో.. సోనియా, రాహుల్‌ గాంధీ రాష్ట్ర పార్టీ నేతలను అభినందించారు. ‘‘వెల్‌ డన్‌.. అచ్ఛాకియా’’ అంటూ మెచ్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు బయలుదేరిన సోనియాగాంధీ.. రోడ్డు మార్గంలో దాదాపు 40 కిలోమీటర్లు ప్రయాణించి సభాప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ప్రయాణంలో ప్రజల నుంచి వచ్చిన విశేష మద్దతు చూసి ఆమె ఆనందించారు. సభావేదికపై చేరుకున్నాక.. భారీగా తరలివచ్చిన అశేష జనవాహినిని చూసి సంతోషం వ్యక్తం చేశారు. భారీ జనసందోహాన్ని చూసి కాంగ్రెస్‌ జాతీయ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సభలో పాల్గొన్న హిమాచల్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌ ముఖ్యమంత్రులు సుఖ్వీందర్‌ సింగ్‌ సుఖు, అశోక్‌ గహ్లోత్‌ సంతోషం వ్యక్తం చేశారు. రేవంత్‌ రెడ్డితోపాటు.. ఏర్పాట్లు చేసిన పార్టీ నేతలను అభినందించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే.శివకుమార్‌ సైతం సభా వేదికపైకి వచ్చిన వెంటనే.. అటూఇటూ తిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు.

Updated Date - 2023-09-18T04:18:54+05:30 IST