ఫ్లెక్సీలపై పెనాల్టీలు
ABN , First Publish Date - 2023-09-20T04:25:47+05:30 IST
రాజకీయ పార్టీలు తమ ఆర్భాటం కోసం అనధికారికంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలపై జీహెచ్‌ఎంసీ కన్నెర్ర చేసింది.

సీడబ్ల్యూసీ కటౌట్లపై కాంగ్రె్‌సకు..
సెప్టెంబరు 17 నాటి ప్రచారంపై బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంకు జీహెచ్‌ఎంసీ చలాన్లు
జైలుకైనా వెళ్తాం.. జరిమానా కట్టం : వీహెచ్
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలు తమ ఆర్భాటం కోసం అనధికారికంగా ఏర్పాటు చేసిన కటౌట్లు, ఫ్లెక్సీలపై జీహెచ్‌ఎంసీ కన్నెర్ర చేసింది. అధికార బీఆర్‌ఎ్‌సతోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకు జరిమానా విధిస్తూ జీహెచ్‌ఎంసీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ మేనేజ్‌మెంట్(ఈవీడీఎం) విభాగం చలాన్లు జారీ చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఆయా ఫ్లెక్సీల్లోని ఫొటోల ఆధారంగా వాటిని ఏర్పాటు చేసిన నేతలకు, ఫొటోలు లేని పక్షంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పేరిట ఈవీడీఎం జరిమానాలు విధించింది. ఇక, సెప్టెంబరు 17న సమైక్యతా దినోత్సవం అంటూ బీఆర్‌ఎస్, విమోచన దినం, అమిత్ షా రాక పేరిట బీజేపీ, తిరంగ ర్యాలీ పేరిట ఎంఐఎం నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. వీటిపై కూడా జరిమానా విధిస్తూ ఆయా పార్టీలకు ఈవీడీఎం నోటీసులు పంపింది. చలాన్లు జారీ చేస్తున్న ఈవీడీఎం జరిమానా వసూళ్ల అంశాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఈ చలాన్లను ఆయా పార్టీలు కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాగా, జైలుకైనా వెళ్తాం కానీ జీహెచ్‌ఎంసీ విధించిన జరిమానాను చెల్లించమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హన్మంతరావు ధ్వజమెత్తారు. సీడబ్ల్యూసీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేతలకు జీహెచ్‌ఎంసీ నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా నోటీసులు, చలాన్లను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విజయభేరి సభ కోసం బ్యానర్లు కట్టుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకు రూ. 2 లక్షల 95 వేలు జరిమానా వేశారని మండిపడ్డారు. మంత్రుల పుట్టినరోజులకు, బీఆర్‌ఎస్ సభలకు పెద్ద పెద్ద కటౌట్లు కడితే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వారం రోజుల్లోగా చలాన్లు రద్దు చేయకుంటే జీహెచ్‌ఎంసీ ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు. అలాగే, చలాన్ల వసూలుకు ఎవరైనా వస్తే తిరగబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.