పాలమూరు-రంగారెడ్డి గుదిబండ!
ABN , First Publish Date - 2023-01-29T02:40:27+05:30 IST
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా తయారైందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) డిమాండ్ చేసింది.
ఎన్‌జీటీ, కోర్టుల్లో కేసులతో పీకల్లోతు కష్టాలు
తెచ్చిన అప్పులెన్ని? కట్టాల్సిన వడ్డీ ఎంత?
అవినీతిపై ఎందుకు విచారణ జరపలేదు?
ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: ఎఫ్‌జీజీ
సీఎస్ శాంతికుమారికి లేఖ
హైదరాబాద్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా తయారైందని, దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని10 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీటిని అందించే ఉద్దేశంతో చేపట్టిన ప్రాజెక్టు వ్యయం రూ.35,200 కోట్ల నుంచి ప్రస్తుతం రూ.57 వేల కోట్లకు చేరిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని, ప్రస్తుతం దీనికి రకరకాల అడ్డంకులు ఎదురవుతున్నాయని వివరించారు. పొరుగు రాష్ట్రం నుంచి అభ్యంతరాలు, పర్యావరణ అనుమతులు లేవంటూ ఎన్‌జీటీలో కేసులు, పరిహారం కోసం హైకోర్టులో భూనిర్వాసితుల కేసులు, మోటారు పంపుల కొనుగోలులో అవకతవకలంటూ సుప్రీం కోర్టులో కేసులు... ఇలా ప్రాజెక్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందన్నారు. పదవీ విరమణ పొందిన ఇంజనీర్ల చేతుల మీదుగా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని, వారికి జవాబుదారీతనం లేకపోవడంతో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా పనులు చేపట్టారంటూ ఎన్‌జీటీ రూ.920 కోట్ల జరిమానా విధించిందన్నారు. ఇంత పెద్ద ప్రాజెక్టును పర్యావరణ అనుమతులు లేకుండా ఎందుకు మొదలుపెట్టారని, మోటారు పంపుల కొనుగోలులో అవినీతిపై విచారణ ఎందుకు జరపలేదని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు ఏ బ్యాంకుల నుంచి అప్పు తీసుకున్నారు, సాలీనా చెల్లించాల్సిన వడ్డీ ఎంత, ప్రాజెక్టుకు అవసరమైన 4,560 మెగావాట్ల విద్యుత్తును ఎక్కడి నుంచి తెస్తారు వంటి సమగ్ర వివరాలతో ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.