Share News

నేడు గాంధీభవన్‌లో పీఏసీ కీలక భేటీ

ABN , Publish Date - Dec 18 , 2023 | 03:20 AM

టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్‌లో సమావేశం కానుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

నేడు గాంధీభవన్‌లో పీఏసీ కీలక భేటీ

ఎమ్మెల్సీ ఖాళీలు, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చ?

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సోమవారం గాంధీభవన్‌లో సమావేశం కానుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది. రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మాణిక్‌ రావు ఠాక్రే అధ్యక్షతన జరగనున్న భేటీలో పీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, పీసీసీ మాజీ అధ్యక్షులు, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. రాష్ట్రంలో కాంగ్రె్‌సకు పట్టం గట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతో పాటు ఆరు గ్యారెంటీల అమలుపై భేటీలో చర్చించే అవకాశముంటుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా భేటీలో కార్యాచరణ రూపొందించనున్నట్టు సమాచారం. అలాగే శాసనమండలిలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసే అంశంతో పాటు ఆయా ఖాళీల్లో నామినేట్‌ చేసేందుకు పార్టీ సీనియర్ల పేర్లను పరిశీలించనున్నట్టు తెలిసింది. మండలిలో ప్రస్తుతం ఆరు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేల నుంచి ఎన్నికైన కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డితో పాటు స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే మరో ఇద్దరిని గవర్నర్‌ నామినేట్‌ చేయాల్సి ఉంది. ఇటు వివిధ ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్‌లు, డైరెక్టర్ల నామినేటెడ్‌ పోస్టుల భర్తీ అంశాన్ని సైతం భేటీలో చర్చకు వచ్చే అవకాశమున్నట్టు తెలిసింది.

బలవంతుడు.. బలహీనుడవుతాడు!: జగ్గారెడ్డి

‘బలవంతుడు ఎప్పటికీ బలవంతుడిలాగే ఉండడు.. ఏదో ఒకరోజు బలహీనుడు కాక తప్పదు’ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే బలహీనుడు కూడా ఒకరోజు బలవంతుడు అవుతాడని.. వ్యాపారం, రాజకీయం ఇంకా ఏ రంగలోనైనా ఇంతేనన్నారు. ఒక నాయకుడి ఓటమి.. గతంలోని లోపాలను సమీక్షించుకొని భవిష్యత్తులో విజయాలు సాధించడానికేనని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు రాష్ట్రంలోని ప్రజలతో పాటు తాను ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ సంగారెడ్డి ప్రజలకు సంపూర్ణంగా అందుతాయన్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పూర్తి సమయాన్ని పార్టీ పనులకే కేటాయించనున్నట్లు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ నేతల తీరు అప్రజాస్వామికం: మల్లు రవి

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రవర్తన ప్రజాస్వామ్య విలువలను దిగజార్చే విధంగా ఉందని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. తొలిరోజునే ఎదురుదాడికి దిగడం.. ఏడాదిలో ప్రభుత్వం పడిపోతుందని బీఆర్‌ఎస్‌ నాయకులు పిల్లి శాపాలు పెట్టడం చూస్తుంటే అధికారం కోల్పోయామనే బాధలో ఉన్నట్టు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే విప్లవాత్మక మార్పులు తెచ్చిందని.. అది చూసి బీఆర్‌ఎస్‌ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.

Updated Date - Dec 18 , 2023 | 03:20 AM