Telangana Election: ఇక వారం రోజులే!
ABN , First Publish Date - 2023-10-03T04:02:29+05:30 IST
మరొక్క వారం రోజులే! అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈనెల ఆరో తేదీ తర్వాత ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే..
6 తర్వాత ఎప్పుడైనా షెడ్యూల్ విడుదల
అందుకే జోరు పెంచిన ప్రభుత్వ పెద్దలు
సీఎం అల్పాహార పథకం ప్రారంభం ముందుకు..
6న రావిర్యాల పాఠశాలలో ప్రారంభం!
నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల బృందం టూర్
హైదరాబాద్, మహేశ్వరం, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): మరొక్క వారం రోజులే! అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఈనెల ఆరో తేదీ తర్వాత ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఆరో తేదీ నుంచి పదో తేదీలోపు విడుదలకు చాన్స్! అందుకే, రాష్ట్ర ప్రభుత్వం జోరు పెంచింది. కొత్త పథకాల ప్రారంభం.. ప్రభుత్వ విధాన ప్రకటనలను ఆలోపే పూర్తి చేయాలని భావిస్తోంది. ఎప్పటి నుంచో పెండింగులో ఉన్న వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే, కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలను పీఆర్సీ పరిధిలోకి తీసుకొచ్చిన సర్కారు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం తీపి కబురు చెప్పింది. వారికి పీఆర్సీని నియమించింది. అలాగే, ఐదు శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని కూడా ప్రకటించింది. రాబోయే రెండు మూడు రోజుల్లోనే మిగిలిన అసంతృప్త వర్గాలపైనా వరాల జల్లులు కురిపిస్తూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభాన్ని కూడా కాస్త ముందుకు జరపాలని భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అల్పాహారాన్ని (బ్రేక్‌ఫాస్ట్) అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’గా పేరు పెట్టారు. దీనిని దసరా నుంచి అంటే ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తామని ఇంతకుముందు ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఎన్నికల షెడ్యూల్ ముంచుకొస్తుండడంతో అనుకున్న సమయానికి కంటే ముందుగానే ఈ పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తోంది. ఈనెల 6న రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మునిసిపాలిటీ పరిధిలోని రావిర్యాల ప్రభుత్వ స్కూల్‌లో ఈ పథకాన్ని ప్రారంభించడానికి విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజు షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. ఒకసారి షెడ్యూల్ వస్తే.. ఒక కొత్త పథకాలను ప్రారంభించడానికి అవకాశం ఉండదు. దాంతో, ఈ పథకం ప్రారంభాన్ని ముందుకు జరపాలని భావిస్తున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు సోమవారం ఈ పాఠశాలను సందర్శించారు. ఈ పాఠశాల ప్రాంగణం ఇరుకు అవుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గం శివరాంపల్లి లేదా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్‌లో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో అధికారులు ఉన్నట్లు సమాచారం.
కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం రాక నేడు
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నేతృత్వంలోని ఎలక్షన్ కమిషన్ బృందం మంగళవారం రాష్ట్ర పర్యటనకు రానుంది. ఈ బృందం మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో మధ్యాహ్నం 2.30 నుంచి 4.30 గంటల వరకు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, సీఏపీఎఫ్ నోడల్ అధికారులతో సమావేశమవుతుంది. బుధవారం ఉదయం 9.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశమవుతుంది. గురువారం ఉదయం 9.15 నుంచి 10.05 గంటల మధ్య టెక్ మహీంద్రా ఆడిటోరియంలో సిస్టమేటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ ఎగ్జిబిషన్‌లో ఈసీ బృందం పాల్గొననుంది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఓ హోటల్‌లో సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల సంసిద్ధతపై చర్చించనుంది. పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ఈ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికను సమర్పించనుంది. దాని ఆధారంగా షెడ్యూల్‌ను జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీ్‌సగఢ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈ షెడ్యూల్ జారీ చేయనుంది. షెడ్యూల్ వచ్చిన తర్వాత నామినేషన్ల దాఖలు, పోలింగ్, కౌంటింగ్ వంటి ప్రక్రియలను పూర్తి చేయడానికి 2 నెలల గడువు అవసరం. షెడ్యూలును జారీ చేయడం పదో తేదీ దాటితే ఎన్నికల నిర్వహణకు సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతాయని అంచనా వేస్తున్నారు.