Share News

ఒక్కటైన లక్ష్మి, సరస్వతి

ABN , First Publish Date - 2023-11-05T03:59:29+05:30 IST

పీసీసీ కార్యదర్శి మర్సుకోల సరస్వతి కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు. శనివారం ఆమె తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

ఒక్కటైన లక్ష్మి, సరస్వతి

కాంగ్రెస్‌కు షాక్‌ ఇచ్చిన మర్సుకోల సరస్వతి

చక్రం తిప్పిన సిటింగ్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిక

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవ లక్ష్మికి కొత్త బలం

ఇద్దరూ మాజీ మంత్రి కొట్నాక భీంరావు కుమార్తెలు

ఆసిఫాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పీసీసీ కార్యదర్శి మర్సుకోల సరస్వతి కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చారు. శనివారం ఆమె తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. నిన్నటి దాకా ఆసిఫాబాద్‌ కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం విశ్వప్రయత్నం చేసిన సరస్వతికి.. ఆ పార్టీ అధిష్ఠానం రిక్తహస్తం చూపటంతో ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఆమె బీఆర్‌ఎస్‌లో చేరడంతో.. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మికి కొత్త బలం చేకూరినట్లయింది. దివంగత మాజీమంత్రి కొట్నాక భీంరావు కుమార్తెలైన కోవ లక్ష్మి, మర్సుకోల సరస్వతి.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ తరఫున పోటీ పడతారని భావించినా, ఇప్పుడు ఇద్దరూ ఒక్కటి కావడంతో నియోజకవర్గంలో రాజకీయ సామాజిక పునరేకీకరణ జరిగిందని విశ్లేషకులు అంటున్నారు. గత ఎన్నికల్లోనూ సరస్వతి టిక్కెట్‌ ఆశించినప్పటికీ అప్పట్లో అమెను ఏ పార్టీ పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి.. కాంగ్రెస్‌ నుంచి ఆమెకు టికెట్‌ తప్పక వస్తుందని అంతా అనుకున్నప్పటికీ, అధిష్ఠానం అనూహ్యంగా ఆజ్మీర శ్యాం నాయక్‌కు టికెట్‌ ఇవ్వడంతో సరస్వతి షాక్‌ తిన్నారు. ఈ క్రమంలో.. ఆమెను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నించింది. దానివల్ల ఓట్లు చీలిపోయే ప్రమాదాన్ని గుర్తించిన ఆదివాసీ సంఘాల పెద్దలు రంగంలోకి దిగి నచ్చజెప్పటంతో ఆమె బీజేపీలో చేరే ప్రయత్నాన్ని విరమించుకొని తటస్థంగా ఉన్నారు. ఈ క్రమంలో.. ఎమ్మెల్యే ఆత్రం సక్కు అక్కాచెల్లెళ్ల మధ్య సయోధ్య కుదిర్చి సరస్వతిని బీఆర్‌ఎస్‌లో చేరేలా ఒప్పించారు. ఆమెతో పాటు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచయ్య కూడా చేరటంతో నియోజకవర్గంలో ఆదివాసీలంతా బీఆర్‌ఎస్‌ వెనక నిలిచినట్లయింది.

Updated Date - 2023-11-05T03:59:30+05:30 IST