Share News

ఇక పంచాయతీ సమరం

ABN , First Publish Date - 2023-12-11T00:18:31+05:30 IST

ఉమ్మ డి వరంగల్‌ జిల్లాలో త్వరలో సర్పంచ్‌ ఎన్నికల నగరా మోగనున్నది. వచ్చే సంవత్సరం జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇక పంచాయతీ సమరం

ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభం

ఎన్నికల సంఘానికి వివరాలు అందజేత

ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్‌

జనవరిలో ఎన్నికలు.. మూడు విడతలుగా పోలింగ్‌

ఉమ్మడి జిల్లాలో 1,688 గ్రామపంచాయతీలు

హనుమకొండ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఉమ్మ డి వరంగల్‌ జిల్లాలో త్వరలో సర్పంచ్‌ ఎన్నికల నగరా మోగనున్నది. వచ్చే సంవత్సరం జనవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్‌ చివరి వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సర్పంచ్‌ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

2019లో..

2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరిగాయి. అన్ని పంచాయతీల్లో ఫిబ్రవరి 1నాటికి సర్పంచ్‌తో సహా కార్యవర్గాలు కొలువు తీరాయి. వీరి పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనున్నది. నిబంధనల ప్రకారం ఈలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది. నిజానికి పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందుగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాల్సి ఉంటుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇప్పటికే ఈప్రక్రియ ఆలస్యమైనట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు పూర్తికావడం.. కొత్త శాసనసభ కొలువుదీరిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పంచాయతీ ఎన్నికలకు కసరత్తు మొదలు పెట్టారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, పోలింగ్‌ అధికారుల నియామకం, ఎన్నికల విధుల్లో పాల్గొననున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలను ప్రారంభించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.ఆశోక్‌కుమార్‌ ఈ మేరకు ఈనెల 4వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు.

రిజర్వేషన్లు

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు మారతాయా? లేక పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా? అనే సందిగ్ధత నెలకొన్నది. నిజానికి పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లన్లే యథాతథంగా కొనసాగాలి. కానీ కొత్త ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే రిజర్వేషన్లు మారవచ్చు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు గ్రామ కార్యదర్శులు ఇప్పటికే సర్పంచ్‌, వార్డు మెంబర్లకు సంబంధించిన రిజర్వేషన్లపై వివరాలు పంపించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేష్లను పదేళ్లకు వర్తించేలా రాష్ట్రప్రభుత్వం 2019లో చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కిందటిసారి రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. ఒక వేళ రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కొలువు దీరిన ప్రభుత్వం రిజర్వేషన్లను మార్చాలని నిర్ణయం తీసుకుంటే అధికారులు నిర్ణీత సమయంలో కొత్త రిజర్వేషన్లకు సంబంధించిన వివరాలు అందిస్తే తప్ప రిజర్వేషన్లు మారే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మూడు విడతలుగా..

పంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహించనున్నారు. ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో ఒక విడతలో ఎన్నికలు ఉండనున్నాయి. 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. 200 మంది ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌, ఒక పోలింగ్‌ ఆఫీసర్‌, 201 నుంచి 400 ఓటర్లు ఉండే పోలింగ్‌ కేంద్రాల్లో ఒక ప్రిసైడింగ్‌ ఆధికారులు, ఇద్దరు పోలింగ్‌ అధికారులు, 4001 నుంచి 650 మంది ఓటర్లల ఉండే కేంద్రంలో ఒక ప్రిసైడింగ్‌ అధికారి, ముగ్గురు పోలింగ్‌ ఆఫీసర్లు విధులు నిర్వహించనున్నారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా సుమారు ఏడు వేల మంది సిబ్బంది అవసరం ఉండవచ్చునని అంచనా. ఉమ్మడి జిల్లాలోని సర్పంచులు, ఉపసర్పంచుల వివరాలను ఇది వరకే పంపించారు. తాజాగా ఎన్నికల నిర్వహణకు సిబ్బంది వివరాలు పంపించాలని ఆదేశాలు వచ్చాయి. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది వివరాలు అందుబాటులో ఉండడటంతో వాటిని టి–పోల్‌ వెబ్‌ సైట్‌లో నమోదు చేసే పనిలో ఉన్నారు. త్వరలో వారికి పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నారు.

గుర్తులపై కాకుండా..

ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులపై పోటీ ఉండదు. ప్రధాన పార్టీల మద్దతుదారులు పోటీ చేస్తారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఇది వరకు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వారే అధిక సంఖ్యలో సర్పంచులుగా ఉన్నారు. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడంతో పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారనున్నది. ఈ ఎన్నికల తర్వాత పార్లమెంట్‌ ఎన్నికలు జరుగనున్నాయి.

ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీలు

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 1,688 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2018లో ఉమ్మడి జిల్లాలో 1,060 పంచాయతీలు మాత్రమే ఉండేవి. కేసీఆర్‌ ప్రభుత్వం 500 జనాభాకన్నా మించి ఉన్న తండాలను కూడా పంచాయతీలుగా మార్చడంతో వాటి సంఖ్య 1,688కి పెరిగింది. ప్రస్తుతం హనుమకొండ జిల్లాలో 208, వరంగల్‌ జిల్లాలో 323, జనగామ జిల్లాలో 281, మహబూబాబాద్‌ జిల్లాలో 461, ములుగు జిల్లాలో 174, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 241 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మొత్తం 1,688 పంచాయతీల్లో 83 మేజర్‌ గ్రామ పంచాయతీలు. హనుమకొండ, వరంగల్‌ జిల్లాల పనర్విభజన ఫలితంగా వాటి పరిధిలో అంతకు ముందున్న గ్రామ పంచాయతీల సంఖ్యలో మార్పులు జరిగాయి. హనుమకొండ జిల్లాలో పెరగ్గా వరంగల్‌ జిల్లాలో తగ్గాయి.

Updated Date - 2023-12-11T00:18:33+05:30 IST