ఉచితంగా కట్టేది లేదు
ABN , Publish Date - Dec 17 , 2023 | 04:14 AM
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం సంచలన మలుపు తిరిగింది. కుంగిన భాగం పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిందేనని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది.
మా బాధ్యత 2022 జూన్‌తోనే ముగిసింది
ఒప్పందం చేసుకుంటే కుంగింది కడతాం
కాపర్ డ్యామ్ నిర్మాణానికే రూ.55.75 కోట్లు
ప్రభుత్వానికి తేల్చిచెప్పిన ఎల్ అండ్ టీ
కుంగిన రోజు నాటి ప్రభుత్వం చెప్పింది వేరే
పునర్నిర్మాణానికి రూ.600 కోట్లు?
నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష
సాగునీటి శాఖ అధికారుల అంచనా
హైదరాబాద్, భూపాలపల్లి, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం సంచలన మలుపు తిరిగింది. కుంగిన భాగం పునర్నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిందేనని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మెయింటెనెన్స్ ఒప్పందం ముగిసిన తర్వాత జరిగిన సంఘటన అని గుర్తు చేసింది. అయితే, పునర్ నిర్మాణ కార్యక్రమం చేపట్టడానికి తాము సిద్ధంగానే ఉన్నట్లు అందులో ప్రకటించింది. అందుకు, కొత్తగా తమతో అనుబంధ ఒప్పందం చేసుకోవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నిర్మాణం కోసం చుట్టూ మట్టి కట్ట వేయడానికే రూ.55.75 కోట్లు అవుతుందని, ఆ తర్వాత జరిగే ఒప్పందం ప్రకారం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే పునర్నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పింది. ఇందుకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లు ఖర్చు అవుతుందని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు సంఘటన జరిగినప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఒప్పందం చేసుకొనేటప్పుడు పరిగణనలోకి తీసుకొనే అంశాలను బట్టి ఎంత అవుతుందనేది తేలుతుంది. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసిన రెండు రోజులకు ఎల్ అండ్ టీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. నీటి పారుదల శాఖ అధికారులు ఈ లేఖను ఇన్ని రోజులు తొక్కిపట్టారు. నిజానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన కొద్ది రోజులకే అక్టోబరు 21న రాత్రి మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు సంఘటన జరిగింది. బ్యారేజీ నాణ్యతపై రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు, భయాందోళనలు వ్యక్తమయ్యాయి. 40 రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళుతున్న అధికార పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలోనే జరిగిన నష్టం స్వల్పమేనని, బ్యారేజీ ఎల్ అండ్ టీ మెయింటెనెన్స్‌లో ఉందని, వాళ్లే మొత్తం తమ ఖర్చుతో తిరిగి నిర్మించి ఇస్తారని రామగుండం ప్రాంత ఈఎన్‌సీ, మరో ఇద్దరు అధికారులు మర్నాడు(అక్టోబరు 22న) అధికారికంగా ప్రకటించారు. ఎల్ అండ్ టీ సంస్థ కూడా జాగ్రత్తగా స్పందించింది. తామే పునర్నిర్మిస్తామని చెప్పింది కానీ, అందులో ఎక్కడా ఖర్చులు ఎవరు భరించాలో చెప్పలేదు. ఆ తర్వాత ఈ రెండు ప్రకటనలను ఆధారంగా చేసుకొని, ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మేడిగడ్డ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి నష్టం లేదని, ఎల్ అండ్ టీ పునర్నిర్మాణ వ్యయం మొత్తాన్ని భరిస్తుందని చెబుతూ వచ్చారు. కానీ, ఎల్ అండ్ టీ ప్రకటనతో ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం అంటే అటు అధికారులు, ఇటు మంత్రులు అబద్ధం ఆడారని భావించే పరిస్థితి ఏర్పడింది.
ఒప్పందం ఏం చెబుతోంది?
బ్యారేజీని ఎల్ అండ్ టీ నిర్మించింది. నిర్మాణ పరమైన లోపాలు తలెత్తితే రెండేళ్లపాటు ఆ సంస్థే భరించాలని ఒప్పందంలో ఉంది. బ్యారేజీ కుంగిన మర్నాడు అటు అధికారులు, ఇటు ఎల్ అండ్ టీ సంస్థ చేసిన ప్రకటనలు ప్రభుత్వంపై ఎలాంటి భారం పడకుండా పనవుతుందనే అభిప్రాయాన్ని కలిగించాయి. ఖర్చు ఎల్ అండ్ టీయే భరిస్తుందని అధికారులు స్పష్టంగా ప్రకటన చేసినా ఎల్ అండ్ టీ ఖండించలేదు. దాంతో అలాంటి అభిప్రాయానికి తావిచ్చింది. నిజానికి ఎల్ అండ్ టీ ప్రకటనలో ఖర్చు భరిస్తానని, తనదే బాధ్యత అని ప్రకటించలేదు. ఇప్పుడు కుంగిపోయిన భాగం పునర్నిర్మాణంలో భాగంగా కాఫర్‌డ్యామ్ నిర్మాణం కోసం ప్రయత్నాలు జరుగుతుండగా... అనూహ్యంగా ఎల్ అండ్ టీ ప్రకటన వెలుగులోకి వచ్చింది. 2020 జూన్ 29తో బ్యారేజీ నిర్మాణ పనులు మొత్తం పూర్తయ్యాయని, ఆ రోజు నుంచి 2022 జూన్ 29 వరకు లయబిలిటీతో కూడిన రెండేళ్ల మెయింటెనెన్స్ చేశామని అందులో పేర్కొన్నారు. పనులు పూర్తయ్యాక పెంచిన అంచనాలతో సహా మొత్తం డబ్బులు చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం 2021 మార్చి 15న మొత్తం పనులు పూర్తయ్యాయని సర్టిఫికెట్ ఎల్ అండ్ టీ చేతిలో పెట్టింది. ప్రాజెక్టు ఎస్‌ఈ సంతకంతో సర్టిఫికెట్ వారి దగ్గర ఉంది. ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచి రెండేళ్లు వేసుకున్నా 2023 మార్చి 15తో ప్రాజెక్టులో లోపాలకు ఎల్ అండ్ టీ సంస్థ బాధ్యత తీరిపోతోంది. బ్యారేజీ కుంగిపోయిన సంఘటన 2023 అక్టోబరు 21న జరిగింది. కాబట్టి తనకు బాధ్యత లేదని ఎల్ అండ్ టీ చెబుతోంది. కాఫర్‌డ్యామ్ నిర్మాణానికి రూ.55.75 కోట్లు అవుతుందని, మిగతా ఖర్చుకు సంబంధించి కూడా ఒప్పందం చేసుకోవాలని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వంతీవ్రంగా పరిగణిస్తోంది. ఆదివారం సీఎం రేవంత్ దీనిపై సమీక్ష చేసే అవకాశాలున్నాయి.
రెండేళ్ల కిందటే
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలో లోపాలు రెండేళ్ల కిందటే వెలుగు చూశాయని, ప్రధానంగా ఇద్దరు కీలక అధికారులు వీటిని తొక్కి పట్టారని ప్రచారం జరుగుతోంది. మా బాధ్యత కాదంటూ ఎల్ అండ్ టీ ఈ నెల 2నే లేఖ రాసినా ఆ ఇద్దరు అధికారులే లేఖ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారని సాగునీటి శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 3న వెలువడగా, తర్వాత రెండు రోజులకు కింది అధికారులకు పంపారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సీఎంకు, సంబంధిత శాఖ మంత్రికి తక్షణమే నివేదిస్తారు. డిసెంబరు 2న లేఖ వచ్చినపుడు అది జరిగిందా? అనేది తేలాలి. కొత్త ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండుసార్లు, శాఖామంత్రి రెండుసార్లు సాగునీటి శాఖ సమీక్ష చేశారు. అధికారులు ఈ అంశం చెప్పకుండా మంత్రి కళ్లకు గంతలు కట్టారని అంటున్నారు.
పునరుద్ధరణ డౌటే!
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ ప్రశ్నార్థకంగా మారింది. బ్యారేజీని రూ.3348 కోట్లతో నిర్మించారు. రెండేళ్లకే సమస్యలు వచ్చాయి. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా డి జైన్లకు తగ్గట్లుగా నిర్మాణం జరగలేదని, అన్నారం, సుందిళ్ల కూడా సురక్షితం కాదని, వీటన్నింటిలో నీటి నిల్వలు తగ్గించుకోవాలని చెప్పింది. సమస్య ఒక్క బ్లాకుకే పరిమితం కాలేదని చెప్పింది. దాంతో బ్యారేజీని నిరర్థక ఖాతాలో వదిలేయాలా? మళ్లీ వందల కోట్లు పోసి, పునరుద్ధరించాలా? అనేది కొత్త ప్రభుత్వం నిర్ణయించనుంది. తాజాగా రేవంత్ సర్కారు వైఎస్ హయాం నాటి ప్రాణహిత ప్రాజెక్టును తెర మీదికి తెచ్చింది. ఈ నేపథ్యంలో మేడిగడ్డ పునరుద్ధరణకు రూ.600 కోట్లకు పైగా ఖర్చు పెడితే వచ్చే ప్రయోజనంపైనా చర్చ మొదలైంది.
మేడిగడ్డ బ్యారేజీ ఎల్ అండ్ టీ నిర్వహణలోనే ఉంది. దీని పునరుద్ధరణ బాధ్యత ఆ సంస్థే తీసుకుంటుంది. పూర్తి ఖర్చును అదే భరిస్తుంది. నష్టంపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత ఆ సంస్థతోనే పునరుద్ధరణ చేయిస్తాం. మేడిగడ్డను త్వరలోనే యథాతథ స్థితికి తీసుకొస్తాం.
- (అక్టోబరు 22) రామగుండం ఈఎన్‌సీ
వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ కరుణాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ప్రకటన.
మేడిగడ్డ బ్యారేజీని ప్రభుత్వం అందించిన డిజైన్ల ప్రకారమే కట్టాం. 86 పియర్లతో 1.632 కిలోమీటర్ల పొడవుతో నిర్మించాం. వరుసగా ఐదు వరదలను తట్టుకొని నిలబడింది. 7 బ్లాకు కుంగిన ప్రదేశాన్ని మా సాంకేతిక బృందం పరిశీలిస్తోంది. బ్యారేజీ పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకుంటాం
- (అక్టోబరు 22) ఎల్‌అండ్ టీ జనరల్ మేనేజర్
ఎస్.సురే్‌షకుమార్ ప్రకటన
మేడిగడ్డ బ్యారేజీ గత ఏడాది 28 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకొని నిలబడింది. ఈసారి ఏదో లోపం జరిగింది. లోపం ఏదైనా ఒక్క పైసా భారం ప్రజలపై పడకుండా సంబంధిత నిర్మాణ సంస్థే బ్యారేజీని పునరుద్ధరిస్తుంది. గతంలో అన్నారం పంపుహౌజ్ మునిగి నపుడు ప్రతిపక్షాలు ఇలాగే హడావిడి చేశాయి. అప్పుడు కూడా రాష్ట్రంపై రూపాయి భారం పడకుండా నిర్మాణ సంస్థే పునరుద్ధరించింది.
- (అక్టోబరు 28) అప్పటి మంత్రి కేటీఆర్,
విలేకరులతో చిట్‌చాట్.
లోపాలకు బాధ్యత కాలం ముగిసింది. బ్యారేజీ మరమ్మతుల ఖర్చు ప్రభుత్వమే భరించాలి. 2020 జూన్ 29కే నిర్మాణం పూర్తయింది. మేం బాధ్యత వహించిన రెండేళ్ల కాలంలో (2022 జూన్ 29 వరకు) ఎలాంటి సమస్య రాలేదు. కుంగినభాగం పునరుద్ధరణ ఖర్చు మేం భరించం. కాఫర్ డ్యామ్ ఖర్చు రూ.55.75 కోట్లు కూడా ప్రభుత్వమే ఇవ్వాలి.
- (డిసెంబరు 2) రామగుండం
ఈఎన్‌సీ వెంకటేశ్వర్లుకు ఎల్ అండ్ టీ లేఖ