కొవిడ్‌తో ఎవరూ చనిపోలేదు
ABN , Publish Date - Dec 28 , 2023 | 03:26 AM
రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదని, ఉస్మానియాలో మరణించిన ఇద్దరూ కూడా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
ఉస్మానియాలో రెండు మరణాలు వేరే ఆరోగ్య సమస్యలతోనే..
జేఎన్.1 అంత ప్రమాదకరం కాదు
లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలి
ప్రత్యేక వార్డులు నెలకొల్పాం.. అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం
ఆందోళన వద్దు: మంత్రి రాజనర్సింహ
రాష్ట్రంలో కొత్తగా ఆరు కేసులు నమోదు
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ/ బర్కత్‌పుర/ గూడూరు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదని, ఉస్మానియాలో మరణించిన ఇద్దరూ కూడా దీర్ఘకాలిక వ్యాధులైన గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై మంత్రి బుధవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్.1 అంత ప్రమాదకరం కాదని, గతంలో వచ్చిన వేరియంట్లలో ఇదొకటని, దీనితో మరణాల శాతం తక్కువగా ఉందని చెప్పారు. కొవిడ్ లక్షణాలైన జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వారు కొవిడ్ బారిన పడే అవకాశాలున్నాయన్నారు. రద్దీ ప్రదేశాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని కోరారు. ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని, వదంతులను నమ్మవద్దని, కరోనా కట్టడికి సర్కారు చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కొవిడ్ పరీక్షలకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయని, బెడ్ల కొరత లేదని వెల్లడించారు. కొవిడ్ రోగుల కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో డీఎంఈ డాక్టర్ త్రివేణి, టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఫీవర్ ఆస్పత్రిలో 4 కరోనా కేసులు
హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో బుధవారం నాలుగు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మందికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా వారిలో 12 ఏళ్ల బాలుడికి పాజిటివ్ వచ్చింది. మరో 39 మందికి రాపిడ్ టెస్టులు నిర్వహించగా వారిలో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. ఈ నలుగురూ చికిత్స పొంది, వైద్యుల సూచనల మేరకు ఇంటికి వెళ్లారు. జ్వరం, దగ్గు, జలుబుతో చికిత్స కోసం ఫీవర్ హాస్పిటల్‌కు వస్తున్న పేషెంట్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిలోఫర్ ఆస్పత్రిలో మరో చిన్నారికి కొవిడ్ నిర్ధారణయ్యింది. 17 మందికి నిర్వహించిన నిర్ధారణ పరీక్షల్లో 9 నెలల పాపకు వైరస్ సోకినట్లు తేలింది. చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స అనంతరం డిశ్చార్జి చేసినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కొవిడ్ సోకిన ముగ్గురు పిల్లలు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు, మహబూబాబాద్ జిల్లాలో బుధవారం ఓ కేసు నమోదైంది. గూడూరు మండలం మర్రిమిట్ట గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికకు కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. బాలికను హోం ఐసోలేషన్‌లో ఉంచారు.
ఉస్మానియా ఆస్పత్రి అప్రమత్తం
కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రి అప్రమత్తమైంది. సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ బుధవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న కొవిడ్‌ను ఎదుర్కోవడానికి సిబ్బంది అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు. జనరల్ మెడిసిన్ విభాగం నుంచి నోడల్ అధికారిని నామినేట్ చేస్తామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఉస్మానియా ఆస్పత్రిలోఅన్ని సదుపాయాలు ఉన్నాయని, కేసులు పెరిగితే సౌకర్యాలు మరింత విస్తరిస్తామని చెప్పారు.