Kishan Reddy : కేసీఆర్‌తో లాలూచీ లేదు
ABN , First Publish Date - 2023-11-06T02:53:01+05:30 IST
‘‘ఎవరూ ఎవరికి ఫేవర్ కాదు.. కేసీఆర్‌తో నేను ఎందుకు ఫేవర్‌గా ఉంటా? ఫేవర్ అనే స్పెల్లింగే నాకు తెలియదు. కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదు.
అంతా అబద్ధం.. ఒట్టి ప్రచారమే
కాళేశ్వరంతో రాష్ట్రాన్ని ముంచారు
2 చోట్లా ఆయన ఓటమి ఖాయం
కాంగ్రెస్ గెలిస్తే పొయ్యిలో పడ్డట్లే
‘మీట్ ది ప్రెస్’లో కిషన్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ఎవరూ ఎవరికి ఫేవర్ కాదు.. కేసీఆర్‌తో నేను ఎందుకు ఫేవర్‌గా ఉంటా? ఫేవర్ అనే స్పెల్లింగే నాకు తెలియదు. కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదు. ఇదంతా అబద్ధం. ఒట్టి ప్రచారం. నేను నా పార్టీకి, పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉంటాను’’ అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కేసీఆర్ 80వేల పుస్తకాలు చదివారని, ఆయనో సూపర్ ఇంజనీర్ అని ఎద్దేవా చేస్తూ కాళేశ్వరం పేరుతో తెలంగాణను నిలువునా ముంచారని ఆరోపించారు. అసెంబ్లీలో కాళేశ్వరం గురించి.. గొప్పగా చెప్పారని, దేశంలోనే గొప్ప ప్రాజెక్టు అని డిస్కవరీ చానల్‌లో ప్రచారం చేయించుకున్నారని, వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయని చెప్పారు. శనివారం తాను కాళేశ్వరం సందర్శించానని, మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు ఏర్పడి, కుంగిపోయిందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై తెలంగాణ నీటిపారుదల రంగ నిపుణులు గతంలో పలు సమావేశాలు పెట్టి ఎన్నో అనుమానాలు వ్యక్తం చేశారని, చివరికి వాళ్లు చెబుతోందే నిజం అని తేలుతోందన్నారు. మేడిగడ్డ కుంగినట్లు తెలియగానే, కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు తాను లేఖ రాశానని, కమిటీ ఏర్పాటుచేశారని, ఆ నివేదిక వచ్చిందని, దీని ఆధారంగా చర్యలుంటాయని వెల్లడించారు. రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఒకవేళ సీబీఐ దర్యాప్తుపై కేసీఆర్ సంతకం పెడితే, ఆ వెంటనే సీబీఐ బృందాన్ని కేంద్రం సిద్ధం చేస్తుందని పేర్కొన్నారు. కవితను అరెస్టు చేయకపోతే రెండు పార్టీలు ఒక్కటేనని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌ను అరెస్టు చేయలేదని.. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా జీవితం ప్రారంభించారని, ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రొడక్ట్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే అని చెప్పేందుకు చాలా ఉదాహరణలున్నాయని అన్నారు.
ఎవరూ ఉద్యమించకుండా గొంతు నొక్కేస్తున్నారు
తెలంగాణను తాను తెచ్చాను కాబట్టి ప్రజలందరూ తనకు బానిసలుగా ఉండాలన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చినప్పుడు బీఆర్‌ఎ్‌సకు ఉన్నవి రెండు సీట్లేనని, అప్పట్లో 165 సీట్లున్న బీజేపీ ప్రత్యేక రాష్ట్రం కోసం సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకొస్తే తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానని, తలైనా నరుక్కుంటా గానీ ఇచ్చినమాట తప్పనని అంటూ కేసీఆర్ ఎన్నో మాయమాటలు చెప్పారని విమర్శించారు. ఉద్యమాలతో అధికారంలోకొచ్చి మరెవరూ ఉద్యమాలు చేయకుండా, తమ మాటను చెప్పే అవకాశం లేకుండా గొంతు నొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఒక కుటుంబం చేతిలో ప్రజాస్వామ్యం బందీ అయ్యిందని ఆరోపించారు. 2014లో హైదరాబాద్ లో కేసీఆర్ సీఎంగా ఢిల్లీలో మోదీ పీఎంగా ఒకేసారి ప్రమాణ స్వీకారం చేశారని, ప్రధానమంత్రి సెలవు తీసుకోకుండా పనిచేస్తుంటే కేసీఆర్ మాత్రం ఫాంహౌజ్ కే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని విమర్శించారు. వాస్తును కారణంగా చూపి కేసీఆర్ ఎన్నడూ పాత సెక్రటేరియట్‌కు రాలేదని, ఇప్పుడేమో కొత్త సెక్రటేరియట్‌కూ రావడం లేదని విమర్శించారు భద్రాద్రిలో శ్రీరామనవమి రోజు శ్రీ సీతారామచంద్ర కల్యాణానికి సీఎం తలంబ్రాలు, పట్టుబట్టలు తీసుకెళ్లే సంప్రదాయం ఉందని, వైఎస్సార్ క్రిస్టియన్ అయినా భక్తిగా.. పట్టుబట్టలు తీసుకెళ్లారని, కానీ కేసీఆర్.. తన మనమడిని ప్రత్యేక హెలికాప్టర్ లో పంపించారని ఇదేమైనా రాచరిక పాలననా? అని ప్రశ్నించారు. దేశంలో రాజకీయ పార్టీలను తన నాయకత్వాన్ని అంగీకరిస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీల ఎన్నికల ఖర్చు తాను భరిస్తానని కేసీఆర్.. ఢిల్లీలో ఓ సీనియర్ నాయకుడికి చెప్పారని, ఈ రాష్ట్రం ఎటుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను కేసీఆర్ ధ్వంసం చేశారని, పూర్తి అధికార దుర్వినియోగం చేస్తున్న రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘నేను ఢిల్లీకి పోవాలి.. నా కొడుకు సీఎం కావాలి’ ఇదొక్కటే సీఎం ఆలోచనగా ఉందన్నారు. బీఆర్‌ఎస్ పోయి కాంగ్రెస్ వస్తే ప్రజల పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల నామినేషన్లు విత్ డ్రా అయ్యాక మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు అందుబాటులో ఉండే సీఎంను తీసుకొస్తామని చెప్పారు. పంచాయతీ నుంచి అసెంబ్లీ వరకు అవినీతి రహిత వ్యవస్థను నిర్మిస్తామని.. విద్యా, వైద్య, రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని, ప్రజాసంపద పెంచే ప్రయత్నం చేస్తామని, పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలకోసం జాబ్ క్యాలెండర్ తెస్తామని, ప్రగతి భవన్ ను ‘ప్రజా ప్రగతి భవన్’గా మారుస్తామని పేర్కొన్నారు.
పదేళ్లుగా టీచర్ పోస్టులు భర్తీ కాలేదని, గ్రూప్ 1 పరీక్ష ద్వారా 30 లక్షల మంది నిరుద్యోగులకు నిరాశే మిగిల్చారని, టీఎస్ పీఎస్సీ పేరుతో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలన పట్ల నిరుద్యోగులు విసిగిపోయారని, అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతి.. ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే కొద్దిసేపట్లోనే వేలమంది విద్యార్థులు గుమిగూడారని, ఇది వారిలోని ఆగ్రహావేశాలకు నిదర్శనమన్నాన్నారు. కేజీ టు పీజీ విద్య, దళితులకు మూడెకరాల భూమి.. ఇలా ఏ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. రైతుల రుణమాఫీ చేయని కారణంగా వడ్డీ మీద వడ్డీ పెరిగి రైతులకు మరిన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో బీఆర్‌ఎస్ సర్కారు దారుణంగా విఫలమైందన్నారు. హుజూరాబాద్‌లో 40 వేల కుటుంబాలకు దళితబంధు ఇచ్చినా.. వారంతా బీజేపీకి మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. హుజూరాబాద్‌లో మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగానూ బీఆర్‌ఎస్ కుట్రను ప్రజలు తిప్పికొడతారని పేర్కొన్నారు. కేసీఆర్ గజ్వేల్‌లో, కామారెడ్డిలో రెండుచోట్లా ఓడిపోతారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయంటూ ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ అమలు చేయలేని హామీలను ఇస్తోందని ఆరోపించారు.
బీసీలకోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు.. బీసీలను అవహేళన చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చింది, బీసీని ప్రధాని చేసింది బీజేపీయేనని చెప్పారు. బీసీల కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే తాము 80 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాం అని, మిగిలి స్థానాల్లో అభ్యర్థుల జాబితాకు ఒకట్రెండు రోజుల్లో తుదిరూపునిస్తామని చెప్పారు. జనసేన ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అని, పొత్తు ధర్మంగా వారిని కలుపుకొని ముందుకెళ్తామని చెప్పారు. మహిళలకు సీట్లిచ్చామని, పార్టీ పోస్టుల్లోనూ 33 శాతం మహిళలకు పదవులు ఇస్తున్న పార్టీ బీజేపీ ఒక్కటేనని, మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చామని, రానున్న రోజుల్లో మరింత న్యాయం చేస్తామని చెప్పారు. జర్నలిస్టుల.. సంక్షేమానికి తమ పార్టీ చిత్తశుద్ధితో ఉందని, ఈ విషయంలో జర్నలిస్టుల సంఘాలను కలిసి.. వారి ఇన్ పుట్స్ తీసుకున్నాం అని చెప్పారు. అంబర్‌పేటలో పోటీ చేయాలని తాను అనుకున్నానని, ఎన్నికల ప్రచారానికి పూర్తి బాధ్యత తీసుకోవాలని పార్టీ ఆదేశించిందని, అందుకే పోటీ చేయడం లేదని కిషన్ రెడ్డి చెప్పారు.