Nandipet Sarpanch: రాజులా బతికా.. బిచ్చగాడినయ్యా
ABN , First Publish Date - 2023-01-31T03:20:24+05:30 IST
‘ఒకప్పుడు రాజులా బతికా.. నా భార్య సర్పంచ్, నేను వార్డు సభ్యుడిని అయ్యాక గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశా.. కానీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో రూ.4కోట్ల వరకు అప్పుల పాలై ...
నిజామాబాద్ జిల్లా నందిపేట సర్పంచ్ భర్త ఆవేదన
కలెక్టరేట్‌లో పెట్రోల్ పోసుకొని సర్పంచ్, ఆమె భర్త ఆత్మహత్యాయత్నం
అప్పులు తెచ్చి చేసిన పనులకు బిల్లులు రావడం లేదని ఆందోళన
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అడ్డుకుంటున్నారని ఆగ్రహం
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకోలు
నిజామాబాద్ అర్బన్, జనవరి 30: ‘ఒకప్పుడు రాజులా బతికా.. నా భార్య సర్పంచ్, నేను వార్డు సభ్యుడిని అయ్యాక గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశా.. కానీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో రూ.4కోట్ల వరకు అప్పుల పాలై ఇప్పుడు బిచ్చగాడినయ్యా’ అంటూ నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నందిపేట సర్పంచ్ వాణితో కలిసి ఆమె భర్త తిరుపతి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. నందిపేట గ్రామ సర్పంచ్‌గా సాంబారు వాణి, ఆమె భర్త తిరుపతి గ్రామ ఐదో వార్డు సభ్యుడిగా కొనసాగుతున్నారు. వారిద్దరూ కలెక్టర్‌ను కలిసేందుకు సోమవారం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ.. తన భార్య వాణి సర్పంచ్ అయ్యాక నందిపేటలో తాము రూ.2కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని, కానీ ఇంతవరకు తమకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వడ్డీలతో కలిసి రూ.4కోట్ల మేర అప్పుల పాలయ్యామన్నారు. తాము చేసిన పనులకు సంబంధించి ఇప్పటికే పంచాయతీ తీర్మానం పూర్తయిందని, ఎంబీ రికార్డులు కూడా ఇచ్చామని చెప్పారు. కానీ ఉప సర్పంచ్ రవి రీ వెరిఫికేషన్ పేరుతో బిల్లుల మంజూరుకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వాపోయారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెర వెనుక ఉండి బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో తాము బీజేపీలో ఉండగా, పార్టీ మారితే అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి.. బీఆర్‌ఎ్‌సలో చేరాక తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా తిరుపతి దంపతులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో.. పోలీసులు వారిని లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తిరుపతి, వాణి తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. పక్కనే ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు వారి వద్ద నుంచి అగ్గిపెట్టెను లాక్కున్నారు. సమాచారం అందుకున్న డీపీవో జయసుధ వెంటనే సర్పంచ్ దంపతులతో మాట్లాడి సముదాయించారు. అనంతరం పోలీసులు వాణి, తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. బిల్లుల పెండింగ్ విషయమై డీపీవో జయసుధను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. నందిపేటలో చేపట్టిన పనులకు సంబంధించి ఇప్పటివరకు రూ.30 లక్షల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాటిని కూడా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు.