Share News

లోక్‌సభ ఎన్నికలకు కొత్త ఓటరు జాబితా

ABN , Publish Date - Dec 29 , 2023 | 03:19 AM

ఓటరు జాబితాలో మీ పేరు లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వెయ్యలేకపోయారా? త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటున్నారా

లోక్‌సభ ఎన్నికలకు కొత్త ఓటరు జాబితా

జనవరి 22 వరకు ఓటరు నమోదు, అభ్యంతరాల స్వీకరణ

హైదరాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితాలో మీ పేరు లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వెయ్యలేకపోయారా? త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని అనుకుంటున్నారా? అయితే, వెంటనే ఓటరు జాబితాలో మీ పేరు నమోదు చేసుకోండి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం - 2024 జరుగుతోంది. 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు, ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు లేని వారి నుంచి ఈ కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. కొత్త ఓటరు నమోదుకు, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలకు సంబంధించి జనవరి 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఓటరు జాబితాకు సంబంధించి వచ్చిన దరఖాస్తులు, అభ్యంతరాలను ఫిబ్రవరి 2 లోగా పరిష్కరిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో ఫిబ్రవరి 8న ఓటర్ల తుది జాబితాను ప్రకటించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అంతకంటే ముందు పోలింగ్‌ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ, సెక్షన్ల ఏర్పాటు, ఓటర్ల జాబితా/ఫొటో ఓటరు గుర్తింపు కార్డుల్లో లోపాల దిద్దుబాటు, ఓటర్ల జాబితాలో సరైన ఫొటోలు ముద్రణ తదితర చర్యలను జనవరి 5 వరకు అధికారులు పూర్తి చేయనున్నారు. ప్రస్తుత ఓటర్ల జాబితా ఆధారంగా బీఎల్‌వోలు సర్వే చేపట్టనున్నారు.

Updated Date - Dec 29 , 2023 | 03:19 AM