కొత్తగా లహరి స్లీపర్‌ బస్సులు

ABN , First Publish Date - 2023-01-05T02:03:57+05:30 IST

ఎ్‌సఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి స్లీపర్‌, స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్‌కు దీటుగా అత్యాధునిక హంగులు..

కొత్తగా లహరి స్లీపర్‌ బస్సులు

హైదర్‌నగర్‌/రాంగనర్‌/హైదరాబాద్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సఆర్టీసీ చరిత్రలోనే తొలిసారి స్లీపర్‌, స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్‌కు దీటుగా అత్యాధునిక హంగులు, అత్యున్నత సాంకేతికతతో రూపొందించిన బస్సులకు ‘లహరి’ అని నామకరణం చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు బస్టాండ్‌లో 10 నూతన నాన్‌ ఏసీ స్లీపర్‌, స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సులను బుధవారం ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవర్ధన్‌ మాట్లాడుతూ. సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహంతో టీఎ్‌సఆర్టీసీ దినదిన ప్రవర్థమానంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక హంగులు, ప్రైవేట్‌ రంగానికి దీటుగా ఆర్టీసీ ఆధ్వర్యంలో తొలిసారి అందుబాటులోకి తెచ్చిన ఈ సర్వీసులను ప్రయాణికులు ఆదరించాలని కోరారు. జనవరి నెలాఖరుకు మరో 16 ఏసీ స్లీపర్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. బెంగళూరు, హుబ్లీ, విజయవాడ, వైజాగ్‌ తదితర నగరాలకు ఈ సర్వీసులను నడిపిస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణ చర్యల్లో భాగంగా 550 ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తేనున్నామని, విడతల వారీగా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెడతామని చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్‌ బస్సులను నడపాలన్న కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మాట్లాడుతూ 2022లో ప్రజలందరూ టీఎ్‌సఆర్టీసీని ఆదరించారని, ఈ ఏడాది కూడా అదే తీరుగా ఆదరించి ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించాలని విజ్ఞప్తి చేశారు. స్లీపర్‌ బస్సు సర్వీసుల్లో ప్రయాణిస్తే అమ్మఒడిలో ఉన్నంత సురక్షితంగా ప్రయాణం ఉంటుందని అన్నారు.

బస్సు ప్రత్యేకతలివే...

స్లీపర్‌ బస్సుల్లో 15 లోయర్‌ బెర్తులు, 15 అప్పర్‌ బెర్తులు. ప్రతి బెర్తు వద్ద మొబైల్‌ చార్జింగ్‌ సౌకర్యం ఉంటుంది.

స్లీపర్‌ కమ్‌ సీటర్‌ బస్సుల్లో 15 అప్పర్‌ బెర్తులు, 33 పుష్‌బ్యాక్‌ సీట్లు ఉంటాయి.

ప్రతి బస్సులో వైపై సదుపాయం కల్పించారు. ప్రయాణికులకు వాటర్‌ బాటిల్‌ ఉచితంగా అందిస్తారు.

బస్సు ముందు వెనుక ఎల్‌ఈడీ బోర్డులో ఇంగ్లిష్‌, తెలుగు భాషలో గమ్య స్థానాల వివరాలు కనిపిస్తాయి.

ప్రయాణికుల భద్రత కోసం ప్రతి బస్సులో 3 సీసీ కెమెరాలతోపాటు అగ్నిమాపక పరికరాలను అమర్చారు.

పెండింగ్‌ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం

ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనంతో పాటు మరో డీఏను మంజూరు చేయనున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్‌లో బుధవారం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమ మండలి రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన సజ్జనార్‌ మాట్లాడుతూ పెండింగ్‌ సమస్యలన్నింటినీ ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరిస్తుందన్నారు. గత ఏడాది ఉద్యోగులు, అధికారుల సమష్టి కృషితో సత్ఫలితాలు వచ్చాయన్నారు. అనంతరం ఉద్యోగుల సంక్షేమ మండలిలో ఉత్తమ సభ్యులను సజ్జనార్‌ సన్మానించారు. రీజియన్‌కు ఇద్దరు చొప్పున 22మందిని శాలువాలతో సన్మానించి ప్రశంసాపత్రాలు అందించారు. కాగా, ఆర్టీసీలో అర్హులైన డ్రైవర్లు, కండక్టర్లకు పదోన్నతులు కల్పించాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ నాగేశ్వరరావు కోరారు.

Updated Date - 2023-01-05T02:03:58+05:30 IST