Share News

కాళేశ్వరం లోపాలపై నజర్‌

ABN , Publish Date - Dec 26 , 2023 | 01:43 AM

కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను బట్టబయలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 29న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మేడిగడ్డను సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని లో

కాళేశ్వరం లోపాలపై నజర్‌

29న మేడిగడ్డకు మంత్రులు ఉత్తమ్‌, దుద్దిళ్ల

పీపీటీ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్న బృందం

గత ప్రభుత్వ తప్పిదాలను వివరించే చాన్స్‌

భూపాలపల్లి/హైదరాబాద్‌, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలను బట్టబయలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ నెల 29న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మేడిగడ్డను సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇందుకోసం వారం రోజులుగా మాజీ ఇంజనీర్లు, ఇతర నిపుణులు కలిసి ఓ ప్రజెంటేషన్‌ను రూపొందించారు. అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం కట్టడం వల్ల జరిగిన నష్టం, ప్రాణహిత కట్టి ఉంటే ఏ మేరకు మేలు జరిగేదన్న అంశాలను మంత్రులు వివరించనున్నారు. రూ.లక్ష కోట్లకుపైగా వెచ్చించి కడుతోన్న కాళేశ్వరంతో కొత్తగా ఎంత ఆయకట్టుకు నీళ్లిచ్చారు? కాళేశ్వరం కింద ఒక్కో ఎకరాకు నీళ్లు ఇవ్వడానికి అయ్యే వ్యయం ఎంత? వంటి అంశాలను ప్రస్తావించనున్నారు. ప్రాజెక్టు హెడ్‌వర్క్‌లు పూర్తి చేసిన తర్వాత ఏ మేరకు నీటిని ఎత్తిపోశారు? ఏ మేరకు సముద్రంలో వదిలేశారు? వంటి వివరాలను బయటపెట్టనున్నారు. కాళేశ్వరం నిర్మాణం, డిజైన్‌, నిర్వహణలో లోపాలతోపాటు గత ప్రభుత్వ తప్పిదాలను వెల్లడించనున్నారు. గత అక్టోబరు 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, ఆ మరుసటి రోజే అన్నారం బ్యారేజీ సీపేజీలో బుంగలు ఏర్పడిన విషయం తెలిసిందే. వీటిని పరిశీలించిన జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎ్‌సఏ).. ఈ బ్యారేజీలు ఏ మాత్రం సురక్షితం కావని, డి జైన్‌ చేసిన విధంగా నిర్మాణం జరగలేదని, నిర్వహణ లోపాలున్నాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడిగడ్డపై మంత్రుల బృందం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సైతం మంత్రుల బృందం సందర్శించి, లోపాలపై సమీక్షించనుంది. సమావేశంలో నిర్మాణ సంస్థలకు చెందిన ప్రతినిధులతోపాటు సబ్‌కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అధికారులు పాల్గొనేలా చూడాలని ఈఎన్‌సీ(జనరల్‌)ని మంత్రి ఉత్తమ్‌ ఆదేశించారు. మీడియా సమక్షంలోనే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 01:43 AM