Harihari Krishna trial: చట్టం తెలుసు.. యావజ్జీవం పడదు!
ABN , First Publish Date - 2023-03-05T03:36:22+05:30 IST
‘చట్టం గురించి నాకు బాగా తెలుసు. మీరు నన్ను పట్టుకోలేదు. నాకు నేనుగా వచ్చి లొంగిపోయాను. అందుకే కోర్టు నాకు యావజ్జీవ శిక్ష వేయదు. మీరు వారం పాటు విచారించిన తర్వాత తిరిగి నన్ను జైలుకు పంపాల్సిందే.
నాకు నేనుగా లొంగిపోయా.. బెయిల్‌పై వచ్చేస్తా..
వారం పాటు విచారించి జైలుకు పంపాల్సిందే
నవీన్‌ను నేనే చంపా.. ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు
నిందితుడు హరిహర మాటలివి
ఆనవాళ్లు లేకుండా ఉండేందుకే అవయవాలు కోసినట్లు వెల్లడి
కస్టడీలో రెండో రోజు విచారణ.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ పూర్తి
హైదరాబాద్ సిటీ/దిల్‌సుఖ్‌నగర్/అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ‘చట్టం గురించి నాకు బాగా తెలుసు. మీరు నన్ను పట్టుకోలేదు. నాకు నేనుగా వచ్చి లొంగిపోయాను. అందుకే కోర్టు నాకు యావజ్జీవ శిక్ష వేయదు. మీరు వారం పాటు విచారించిన తర్వాత తిరిగి నన్ను జైలుకు పంపాల్సిందే. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చేస్తా. నవీన్‌ను నేనే చంపాను. ఆధారాల్లేకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశా. చివరకు ఒప్పుకోవాల్సొచ్చి మీ ముందుకొచ్చా. ఇతరులనెవ్వరినీ ఇబ్బంది పెట్టొద్దు. ఈ హత్యకు పూర్తి బాధ్యత వహిస్తున్నాను’.. పోలీసుల కస్టడీలో ఉన్న నవీన్ హత్య కేసు నిందితుడు హరిహరి కృష్ణ విచారణలో భాగంగా చెప్పిన మాటలివి! ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా అతడు చెబుతున్న మాటలు విని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. ఎల్బీనగర్ ఎస్‌వోటీ కార్యాలయంలో హరిహరను ఉంచి విచారణ చేస్తున్న పోలీసులు, కస్టడీలో రెండో రోజైన శనివారం కూడా అతడిని ప్రశ్నించారు. శనివారం తెల్లవారుజామునే నిందితుడిని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఘటనాస్థలికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేశారు. హరిహర ఎలాంటి బెరుకు లేకుండా కూల్‌గా ఉండటం.. సమయానికి భోజనం పెట్టండంటూ అడుగుతుండటంతో నిందితుడి తీరును అంచనా వేయలేకపోతున్నామని పోలీసులు చెబుతున్నారు. సైకాలజి్‌స్టను పిలిపించి హరిహరను పరీక్షించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కాగా హత్య తానొక్కణ్నే చేశానని హరిహర పదే పదే చెబుతున్నప్పటికీ ఇతరుల ప్రమేయం ఉండే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో హరిహర చెప్పిన విషయాలను క్రాస్ చెక్ చేయడంతో పాటు, సాంకేతిక ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా యువతి పాత్రపై పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.
సీన్ రీకన్‌స్ట్రక్షన్ సాగిందిలా..
సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో భాగంగా అంబర్‌పేటలోని వైన్‌షా్‌పనకు, అక్కడి నుంచి అబ్దుల్లాపూర్ మెట్‌లోని హత్యాస్థలికి హరిహరను పోలీసులు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి నేరుగా బ్రహ్మణపల్లి రాజీవ్‌స్వగృహ ఫేజ్-1లోని హసన్ ఇంటికి వెళ్లారు. హసన్‌ను, హరిహరను కొద్దిసేపు ప్రశ్నించారు. హరిహర చెప్పిన వివరాల మేరకు హసన్ ఇంట్లో నిందితుడు స్నానం చేసిన గదిని పరిశీలించారు. అక్కడి నుంచి హస్తినాపురం సాగర్ కాంప్లెక్స్ వద్ద రక్తపు మరకలు ఉన్న దుస్తులను పడేసిన స్థలాన్ని పరిశీలించారు. తెల్లవారుజాము నుంచి సుమారు 2 గంటల పాటు ఈ ప్రాంతంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసిన అనంతరం హరిహరను మూసారాంబాగ్‌లోని సోదరి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సోదరి కుటుంబసభ్యులను ప్రశ్నించారు. అనంతరం హరిహరను తిరిగి ఎస్‌వోటీ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో హరిహర వెల్లడించిన విషయాలను, ఘటనాస్థలిలోని పరిస్థితులతో పోలీసులు సరిపోల్చుకుంటున్నారు. కాగా, హత్య అనంతరం హరిహర, హైదరాబాద్ నుంచి వరంగల్‌లోని తండ్రి వద్దకు అక్కడి నుంచి వైజాగ్, నల్లగొండ తదితర ప్రాంతాలకు వెళ్లినట్లు ఇప్పటికే హరిహర వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో కస్టడీలో మిగిలిన ఐదు రోజుల్లో హరిహను ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. హత్యోదంతం తెలియగానే నిందితుడి తండ్రి పోలీసులకు ఎందుకు సమాచారమివ్వలేదు? లొంగిపోవడానికి ముందు ఆధారాలను మాయం చేసేందుకు ఏమైనా ప్లాన్ చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
యువతి పాత్ర లేదు: సీపీ
నవీన్ హత్య కేసులో యువతి పాత్ర లేదని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. నవీన్ హత్య సాధారణంగా లేదని... అసలు మనిషి చేసిన హత్యగా లేదని చెప్పారు. అబ్దుల్లాపుర్‌మెట్ వరకు నవీన్‌ను హరిహర ఒక్కడే తీసుకొచ్చాడా? అతనొక్కడే ఈ హత్య చేశాడా? ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
విక్రమ్ సినిమా స్ఫూర్తి?
నవీన్‌ను హత్య చేసినా ఆధారాలు దొరక్కుండా ఏం చేయాలి? అని ఆలోచించిన తనకు ఈ విషయంలో విక్రమ్ సినిమా స్పూర్తినిచ్చిందని.. పలు యూట్యూబ్ వీడియోలూ చూశానని పోలీసుల ఎదుట హరిహర ఒప్పుకొన్నాడు. హత్య చేసినా తప్పించుకోడానికి ఏయే అవయవాలు తొలగించాలి? వేలి ముద్రలు పడకుండా.. ఆధారాలు కనిపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంలో వీడియోలను చూశాడు. విక్రమ్ సినిమా స్ఫూర్తితో నవీన్‌ను హత్యచేసిన తర్వాత కొన్ని రోజులు కామ్‌గా ఉండాలనుకున్నాడు. మృతదేహాన్ని కోసి.. గుండె, చేతివేళ్లు, మర్మాంగాలను తొలగించి వాటిని మరో చోట పారేయడాన్ని బట్టిచూస్తే రెండు వారాల తర్వాత అవశేషాలు దొరికినా మృతదేహాన్ని గుర్తించరు అని హరిహర భావించాడు. గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదై.. నవీన్ మిస్సింగ్ కేసుతో పోలిక లేకుండా ఉంటే తాను తప్పించుకున్నట్లేనని ఫిక్సయ్యాడు. అయితే నవీన్ చివరిసారి తనవెంటే వచ్చినట్లు నిర్ధారణ కావడంతో తప్పించుకునేందుకు అవకాశాలు సన్నగిల్లాయని భావించాడు. తానే నేరాన్ని ఒప్పుకొంటే శిక్ష తగ్గుతుందని తెలుసుకొనే పోలీసుల ఎదుట లొంగిపోయాడు.