ఎస్సీ గురుకులంలో ‘పేరు’మారు!
ABN , First Publish Date - 2023-07-11T02:18:54+05:30 IST
ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థుల పేర్లు, జెండర్లు, వివరాలు తారుమారవుతుండటంతో మార్చుకునేందుకు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
విద్యార్థుల పేర్లు, వివరాలు తప్పుగా నమోదు
అబ్బాయికి బదులు అమ్మాయిగా జాబితాలో..
మార్చాలంటూ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థుల పేర్లు, జెండర్లు, వివరాలు తారుమారవుతుండటంతో మార్చుకునేందుకు అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఓ విద్యార్థి పేరు వేణు (పేరు మార్చాం) జెండర్ మార్క్ దగ్గర మేల్ (పురుషుడు) అని ఉండాలి. కానీ జాబితాలో ఫీమేల్ (మహిళ) అని పడింది. ఇదే ఎస్సీ గురుకులంలో హుస్నాబాద్‌లో ఐదో తరగతి పూర్తయిన ఓ విద్యార్థి వివిధ కారణాలతో కొండాపూర్ బదిలీ చేయాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. బదిలీ కూడా జరిగింది. వాస్తవానికి ఆ విద్యార్థికి ఆరో తరగతిలో చేరాలి. కానీ ఇందుకు విరుద్ధంగా ఏడో తరగతికి ప్రవేశం వచ్చింది. దీంతో బదిలీలో తప్పుగా పడిన తరగతిని మార్చాలంటూ రోజుల తరబడి ఎస్సీ గురుకులం చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా పదుల సంఖ్యలో విద్యార్థులు మార్పుల కోసం తిరుగుతున్నారు. తమకు కావాల్సిన ప్రాంతానికే బదిలీ అయినప్పటికీ జాబితాలో వివరాలు తప్పుగా నమోదవడంతో పాఠశాల, కాలేజీల్లో సీటు దక్కడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇటు బదిలీల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ఉన్నతాధికారులు అందుబాటులో ఉండకపోవడంతో విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావట్లేదు. కాగా, ఎస్సీ గురుకులానికి సెక్రెటరీగా వ్యవహరిస్తున్న అధికారికే మరికొన్ని శాఖలు కూడా ఉండడం, ఇటీవలే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గానూ బాధ్యతలు స్వీకరించడంతో సదరు అధికారి గురుకులానికి సమయం కేటాయించడం లేదు. దీంతో విద్యార్థుల సమస్యలకు తక్షణ పరిష్కారం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే తమ సమస్యలను సెక్రెటరీకి చెప్పుకునేందుకు వచ్చిన వారి వినతులను సెక్రటరీ పేషీలోని వారు స్వీకరిస్తున్నారు.