నిజాల్ని వక్రీకరించిన ‘నమస్తే’
ABN , First Publish Date - 2023-07-27T02:49:28+05:30 IST
రైతులకు పంట నష్టం పరిహారం విషయంలో ప్రభుత్వ ‘ఆస్థాన’ పత్రిక ‘నమస్తే తెలంగాణ’ మసిపూసి మారేడుకాయ సామెత చందంగా వ్యవహరిస్తోంది!
‘ఆంధ్రజ్యోతి’ కథనాలు అక్షర సత్యాలు
రైతులకు అందింది తొలివిడత పరిహారమే
ఇంకా అందని రెండో విడత పరిహారాలు
వ్యవసాయ శాఖాధికారి చత్రునాయక్
మహబూబాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): రైతులకు పంట నష్టం పరిహారం విషయంలో ప్రభుత్వ ‘ఆస్థాన’ పత్రిక ‘నమస్తే తెలంగాణ’ మసిపూసి మారేడుకాయ సామెత చందంగా వ్యవహరిస్తోంది! పంట నష్టపోయినవారిలో కొందరు రైతులకే మొదటి విడతలో పరిహారం అంది.. మిగతావారికి నేటికీ పరిహారం అందని విషయాన్ని ఎక్కడా చెప్పకుండా వా స్తవాలను వక్రీకరిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో గత మార్చి, ఏప్రిల్ నెలలో కురిసిన వడగండ్ల వానలు, గాలిదుమారానికి తీవ్రంగా పంట నష్టం జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 37,503 మంది రైతులు 22,756.23 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్ ప్రకటించారు. నష్టపోయిన రైతుల వివరాలను 2 విడతలుగా ప్రభుత్వానికి పంపగా.. తొలివిడతలో 12,684 మంది రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.11.68 కోట్లు పరిహారంగా వారి ఖాతాల్లో జమయ్యాయి. నిధులు మంజూరయ్యాక.. మిగతా 14,819 మంది రైతుల ఖాతాల్లోకి పరిహారం జమచేస్తామని సాక్షాత్తూ జిల్లా వ్యవసాయాధికారే చెప్పారు. అంటే రెండో విడత పరిహారం ఇంకా అందనట్టే. ఈ విషయాన్నే.. ‘పరిహారమేది సారూ’ అనే కథనం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నాన్ని ‘ఆంధ్రజ్యోతి’ చేసింది. ఆ కథనానికి.. సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చి 23న జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు రెడ్డికుంటతండాలో రైతు సోమనాయక్ భుజాలపై చేయి వేసి భరోసా ఇస్తున్న ఫైల్ ఫొటోను ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. అంతేతప్ప.. సోమనాయక్‌కు నష్టపరిహారం అందలేదని వార్తలో ఎక్కడా ప్రస్తావించలేదు. కేవలం నష్టపోయిన మిగతా రైతులకు పరిహారం అందలేదనే స్పష్టం చేశాం. కానీ.. ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఆ ఫొటో ఆధారంగా వాస్తవాన్ని వక్రీకరించేందుకు ప్రయత్నించింది. తొలివిడత పరిహారాన్ని ప్రభుత్వం అందించిందని చెబుతూనే మిగతా రైతుల గురించి ప్రస్తావించకుండా నిజాలను మరుగుపరిచేందుకు ప్రయత్నించింది. సీఎం పర్యటన జరిగి 4 నెలలు గడిచిపోతు న్నా.. అధికారుల ప్రతిపాదన ప్రకారం మిగిలిన 14,819 మంది రైతుల 11,083,10 ఎకరాలకు పరిహారం అందని విషయాన్ని మాత్రం దాచిపెట్టింది.
ఇప్పటికీ రూపాయి రాలే
ఐదెకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేశాను. ఏప్రిల్ నెలలో పంట చేతికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో వడగండ్ల వాన, గాలిదుమారంతో పంట దెబ్బతింది. పంటపై రూ.3 లక్షల వరకూ పెట్టుబడి పెట్టా.. నష్టం వాటిల్లింది. జిల్లాకు వచ్చిన సీఎం పరిహారం ఇస్తామని ప్రకటించారు. నాకు ఒక్క రూపాయి కూడ రాలే.
- కోట రత్నాకర్‌రెడ్డి, బూర్హన్‌పురం, మరిపెడ
వడగండ్లు ముంచాయి
మూడెకరాల్లో పచ్చజొన్నలు, మరో మూడెకరాల్లో వరి సాగు చేశాను. చేతికి వచ్చిన వడ్లు, పచ్చజొన్నలు.. వడగండ్ల వాన, భారీ వర్షాల వల్ల రాలిపోయాయి. రూ.2 లక్షల దాకా నష్టం వాటిల్లింది. వ్యవసాయాధికారులు వచ్చి సర్వే జరిపి నష్టం జరిగిందని రాసుకున్నారే తప్ప నేటికి పరిహారం రాలే.
- ధరంసోత్ జయేందర్, వీరారం, మరిపెడ
మామిడికాయలు రాలి 6 లక్షల నష్టం
ఎనిమిది ఎకరాల్లో మామిడి తోట పెట్టాను. గాలి, దుమారం బీభత్సానికి తోటలోని చెట్లపై ఉన్న కాయలు రాలిపోయి రూ.6 లక్షల దాకా నష్టం వాటిల్లింది. అధికారులు సర్వే చేసినా ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదు. పరిహారం అందించి ఆదుకోవాలి.
- వర్షబోయిన లింగయ్యయాదవ్, మరిపెడ
రూ.8 లక్షలు నష్టపోయా..
అకాల వర్షం, గాలిదుమార బీభత్సంతో మామిడితోటలో కాయలు మొత్తం నేలరాలాయి. సుమారు రూ.8 లక్షల వరకు నష్టం జరిగింది. అధికారులు సర్వే జరిపారు. పేర్లు రాసుకున్నారు. ఇంత వరకు నష్టపరిహారం రూపాయి కూడ అందలే.
- సాదు లింగారెడ్డి, దంతాలపల్లి
వరి, పత్తి పోయింది..
మూడెకరాల్లో వరి పొలం, మరో మూడెకరాల్లో పత్తి, మిర్చి పంటలను సాగు చేశాను. మార్చి, ఏప్రిల్ పడిన భారీ వడగండ్ల వానల దెబ్బకు రెండు పంటలూ పోయాయి. అధికారులు సర్వే జరిపి నాలుగు నెలలు దాటినా.. నేటికి నష్టపరిహారం అందలే. వెంటనే పరిహారం అందించాలి.
- కొత్త శేఖర్, రైతు, చిన్నగూడూరు