TS Congress : రానున్న ఎన్నికల్లో టికెట్ల విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రేవంత్ రెడ్డి..

ABN , First Publish Date - 2023-06-11T02:42:57+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఇందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు...

TS Congress : రానున్న ఎన్నికల్లో టికెట్ల విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన రేవంత్ రెడ్డి..

  • నా టికెట్టే నా చేతిలో లేదు

  • నా చుట్టూ తిరిగితే టికెట్‌ రాదు

  • అధిష్ఠానానిదే నిర్ణయం

  • దీనికి సిద్దరామయ్యే పెద్ద ఉదాహరణ

  • టీపీసీసీ ఉపాధ్యక్షుల సమావేశంలో రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలనే విషయాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సర్వేలు, క్షేత్రస్థాయిలో నేతల పనితీరు, సమీకరణలకు అనుగుణంగా హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అంతే తప్ప.. తన చుట్టూ తిరిగితేనో, తనకు దగ్గర వ్యక్తి అయితేనో టికెట్‌ రాదని స్పష్టం చేశారు. తన టికెట్టే తన చేతిలో లేదని వ్యాఖ్యానించారు. శనివారం ఇందిరా భవన్‌లో జరిగిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య కోలార్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారని, కానీ.. సర్వేలు, సమీకరణల ఆధారంగా అధిష్ఠానం ఆయనతో వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేయించిందని తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు రాయచూర్‌ నుంచి పోటీ చేయాలనుకుంటే అక్కడి సామాజిక సమీకరణాల ఆధారంగా వేరొకరికి టికెట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. అయుతే పార్టీకి ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయనను కర్ణాటక మంత్రివర్గంలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసిన వారిని పార్టీ తప్పకుండా గుర్తిస్తుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ఇందుకోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రధానంగా మండల కమిటీల నిర్మాణం ఇంకా పూర్తికాకపోవడంపై చర్చ జరిగింది.

రాజీవ్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ శంకుస్థాపనకు సోనియా..!

బోయిన్‌పల్లిలో రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌ సెంటర్‌ శంకుస్థాపనకు ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీని ఆహ్వానించాలని టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో తీర్మానించారు. దీంతో పాటుగా సీఎల్పీ నేత భట్టివిక్రమార్క శనివారంతో వెయ్యి కిలోమీటర్లమేరకు పాదయాత్రను పూర్తి చేసినందుకు ఆయన్ను అభినందిస్తూ మరో తీర్మానానికి ఆమోదం తెలిపారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. మరోవైపు భట్టివిక్రమార్క పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓయూ జేఏసీ నేతల ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సంబరాలు జరిగాయి. ఈ వేడుకలో పాల్గొన్న మాణిక్‌రావు ఠాక్రే.. కేక్‌ కట్‌ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

Updated Date - 2023-06-11T09:20:26+05:30 IST