మా నాన్నకు అధికారం తలకెక్కింది
ABN , First Publish Date - 2023-06-26T02:31:31+05:30 IST
‘‘రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా నాన్నకు పవర్ కొంచెం తలకెక్కింది. ఎవరూ అడగకపోతే ఇలాంటి తప్పులు ఇంకా జరుగుతూనే ఉంటాయి....
సీఎం ఆశీర్వాదం ఉందని చెప్పుకుంటున్నాడు
అందుకే ఎవ్వరినీ లెక్క చేయడం లేదు
కూతురిగా ఆయన్ను సరిచేయాల్సింది నేనే
చేర్యాల ప్రజలకు క్షమాపణ చెబుతున్నా
చెరువు భూమిని నా పేరుపై రిజిస్ట్రేషన్ చేసి..
నాన్న తప్పు చేశాడు.. అది నన్ను బాధించింది
ఆ స్థలాన్ని మునిసిపాలిటీ, ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ చేస్తా
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి
స్థలంలో క్షమాపణ బోర్డు ఏర్పాటు.. గోడ కూల్చివేత
నా కూతురి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా
అల్లుడు ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడు
ఎన్ని కుట్రలు చేసినా సేవ చేస్తూనే ఉంటా: ముత్తిరెడ్డి
చేర్యాల/హైదరాబాద్, జూన్ 25: ‘‘రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మా నాన్నకు పవర్ కొంచెం తలకెక్కింది. ఎవరూ అడగకపోతే ఇలాంటి తప్పులు ఇంకా జరుగుతూనే ఉంటాయి. దీనిని సరిచేయాల్సిన బాధ్యత కూతురిగా నాపై ఉంది. ఈ రెండేళ్లుగా ఆయనకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నా. మా బంధువుల ద్వారా చెప్పించాను. ఎవరు అడిగినా ఆయన ఎవరికీ జవాబుదారీగా ఫీలవలేదు. తనకు సీఎం ఆశీర్వాదం ఉంది. తనను కలెక్టర్లే ఏమీ చేయలేదనే భావన ఉంది. అలాంటప్పుడు కూతురిగా ఆయన తీరును సరిచేయాల్సిన బాధ్యత నాకు ఉంది’’ అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురు తుల్జా భవానీరెడ్డి అన్నారు. ‘‘ఫోర్జరీలు చేయడం వల్ల ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. చేర్యాల మత్తడి భూమి కేసులో ఇరిగేషన్ డీఈ, మునిసిపల్ కమిషనర్, చైర్‌పర్సన్, డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ కార్పొరేషన్, స్థానిక ఎస్సైలపై కేసులు నమోదయ్యాయి. వాళ్లంతా లోకాయుక్తలో సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. 2020లో కొన్న భూమికి 2018లోనే ఎలా అనుమతులు తెచ్చుకున్నారు..? అన్నది ఈ కేసులో ప్రధానమైన ప్రశ్న. మా నాన్న తప్పుడు పని చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నలుగురైదుగురు ప్రభుత్వ ఉద్యోగుల చేత కూడా తప్పుడు పని చేయిస్తున్నారు. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది. నా మీద, ఉద్యోగుల మీద కేసులు ఉన్నాయి. మా నాన్న చేసిన తప్పుకు మేమంతా సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తోంది. ఇది కరెక్టు కాదు. అధికార దుర్వినియోగం’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సిద్దిపేట జిల్లా చేర్యాల వెళ్లిన తుల్జా భవాని.. పెద్ద చెరువు మత్తడి సమీపంలో తన పేరిట ఉన్న స్థలంలో క్షమాపణ చెబుతూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చి వేశారు. ‘నా తండ్రి ఊరి భూమిని కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలను క్షమించమని అడుగుతున్నాను. నా తండ్రి నా పేరున పెట్టిన యావదాస్తి చేర్యాల మునిసిపాలిటీకి, చేర్యాల ఆస్పత్రికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను’ అని నోటీసు పెట్టారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘చేర్యాల పెద్ద చెరువు మత్తడి భూమిని నా పేరిట మా నాన్న రిజిస్ట్రేషన్ చేయించారు. నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ఆ భూమిని చేర్యాల మునిసిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిస్తా. డాక్యుమెంట్ రెడీగా ఉంది. కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేసి కలెక్టర్‌కు అప్పగిస్తా. నాన్న చేయకూడ దు. కానీ తప్పు చేశారు. రెండుసార్లు ఎమ్మెల్యే అయి 70 ఏళ్ల వయసొచ్చినా ఈ విధంగా చేయడం సరికాదు. ఎమ్మెల్యే కాకముందే రూ.వేయికోట్ల ఆస్తి ఉంది. నెలకు రూ.కోటిన్నర అద్దె డబ్బులు వస్తాయి. అలాంటి వ్యక్తి ఇలాంటి భూమి తీసుకోకూడదు. తప్పు జరిగింది. క్షమించండి’’ అని భవానీ రెడ్డి పేర్కొన్నారు.
అది చెరువు భూమి అని తెలియదు..
‘‘మా నాన్న చెప్పిన చోట సంతకాలు పెట్టా. అందుకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. మా నాన్న ఈ భూమి కొనేటప్పుడు.. అది చెరువు భూమి అన్న విషయం నాకు తెలియదు. నేను అంత పట్టించుకోలేదు. ఆయన ఏ ఆలోచనతో నా పేరుపై రిజిస్ట్రేషన్ చేశాడో తెలియదు. ఎవరి పేరున రిజిస్ట్రేషన్ చేసినా.. అసలు అలాంటి భూమిని కొనడమే తప్పు. నీ పేరు ఎక్కడైనా పెట్టుకుంటా.. ఎలాగైనా వాడుకుంటా.. తండ్రిగా నాకు హక్కు ఉంది అంటాడు. నాకు పెళ్లయింది. నేను ఇంకొకరి ఇంట్లో ఉన్నాను. నాపై జిల్లా, హైకోర్టు, లోకాయుక్తలో 5 కేసులు నమోదయ్యాయి. ఇది సరికాదని చెప్పా. ఆర్థికంగా ఆయన ఉన్నత స్థితిలో ఉన్నారు. నా కుటుంబం మీద నాకు బాధ్యత ఉంది. తండ్రి తప్పులు చేస్తే.. కొడుకు కూడా అలానే తయారవుతాడు. ఆయన తప్పు చేసిన విషయం మా ఇంట్లోనూ తెలుసు. కానీ ఆ తప్పులను బహిరంగంగా ప్రశ్నించవద్దని, వ్యక్తిగతంగా అడగాలని మా వాళ్లు నాతో అంటారు. రెండేళ్లుగా వ్యక్తిగతంగా అడుగుతూనే ఉన్నా. అయితే, ప్రజల ముందు ప్రశ్నిస్తేనే సమాధానం రానపుడు.. వ్యక్తిగతంగా అడిగితే ఏం సమాధానం వస్తుంది. నా ఇష్టం.. నేనే ప్రభుత్వం అంటాడు. అలా రెండేళ్లుగా చేర్యాల స్థలంపై అడుగుతూనే ఉన్నా. దీంతో మా మధ్య దూరం పెరిగింది. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి.. ఈ విషయంలో ఇంకేదో ఉందని జనం అనుకుంటున్నారు. కానీ అలాంటిదేం లేదు. మా నాన్న వల్ల ఇన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి. కాబట్టి.. నేను ఇలా చేయాల్సి వచ్చింది. ఇందులో ప్రత్యర్థులు, ఇతర రాజకీయ పార్టీల ప్రమేయం లేదు.
సబ్ రిజిస్ట్రార్ నాకు సారీ చెప్పారు..
మా నాన్నపై నేను కేసు పెడితే.. ఆధారాలున్నా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదు. దీంతో నేను జిల్లా కోర్టు నుంచి ఆర్డర్లు తీసుకొచ్చా. అయినా పోలీసులు స్పందించలేదు. వాళ్లపై మా నాన్న ఒత్తిడి తెచ్చారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. పోలీసులపై ఒత్తిడి తెచ్చి.. వాళ్లను పనిచేయనివ్వరు. ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ చేత లీజ్ డీడ్‌కు సంబంధించిన ఫోర్జరీ పత్రాలు సృష్టించారు. దీనిపై నేను సబ్ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించాను. జీపీఏ డాక్యుమెంట్ లేకుండా, మనిషి లేకుండా లీజ్ డీడ్ ఎలా చేశారని..? ఎమ్మెల్యే, ఆయన కొడుకు వచ్చి నాపై ఒత్తిడి చేస్తే.. నేను ఏదీ పరిశీలించకుండా చేశాను.. తప్పే అని సబ్ రిజిస్ట్రార్ నాకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పారు. మా నాన్న చేసే తప్పుల వల్ల ఇంత మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఉన్న మాపై కేసులు పడ్డాయి. బయట ప్రభుత్వ ఉద్యోగులపైనా కేసులు నమోదయ్యాయి. తప్పు చేసిన ఆయన మాత్రం ఎవరికీ జవాబుదారీగా లేడు. దీంతో నేను ప్రశ్నించాల్సి వచ్చింది’’ అని తుల్జా భవాని వెల్లడించారు.
భవానీరెడ్డి తీరు పట్ల భిన్నాభిప్రాయాలు..
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురు తీసుకున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే చేసిన తప్పును కూతురు సరిదిద్దుతూ సుమారు రూ.70 లక్షల విలువైన స్థలాన్ని మునిసిపాలిటీకి అప్పగించనున్నట్లు చేసిన ప్రకటన ఆలోచింపజేసిందని, ఆదర్శంగా ఉందని పలువురు కొనియాడుతున్నారు. అలాగే తనను బెదిరించి ఆఫీసులో కూర్చోబెట్టి సంతకం ఫోర్జరీ చేసి స్థలం కొన్నారని ఆరోపించిన ఆమె.. మూడేళ్ల క్రితం ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వివాదాస్పద భూములు తన పేరిట కొనుగోలు చేశారని చెబుతున్న ఆమె.. చేర్యాల స్థలం మాదిరిగానే ఇతర ఆస్తులను అప్పగిస్తారా..? అనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముత్తిరెడ్డిపై నియోజకవర్గంలో నెలకొన్న అసంతృప్తి, ఆరోపణలు కలిసి వస్తాయని భావించి.. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసేందుకు ఇలాంటి పనులకు శ్రీకారం చుట్టారా..? అని స్థానికంగా చర్చ జరుగుతోంది. ఎన్నికల గడువు సమీపించిన నేపథ్యంలో ఇప్పుడు బయటకు వచ్చి తండ్రిపై ఆరోపణలు చేయడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
లీజు విషయంలో నా సంతకం ఫోర్జరీ..
చేర్యాల కేసులో వకాలత్‌లో నా సంతకాన్ని ఫోర్జరీ చేశారు. హబ్సిగూడలో నా పేరుపై ఉన్న వాణిజ్య ఆస్తిని నా అనుమతి లేకుండా కినారా గ్రాండ్‌కు లీజుకు ఇచ్చారు. లీజు విషయంలో ఒక దొంగ జీపీఏ తయారు చేశారు. ప్రతి జీపీఏపై ఒక నంబరు ఉంటుంది. రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో ఆ నంబరు టైప్ చేస్తే జీపీఏ వివరాలు వస్తాయి. కానీ, ఈ జీపీఏ నంబరు ఎంటర్ చేస్తే వేరే వాళ్ల వివరాలు వస్తాయి. అంటే.. ఈ డాక్యుమెంట్ లేనే లేదు. అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఉండదు.. వీళ్ల దగ్గరే ఉంటుంది. వీళ్ల దగ్గరే సర్కారు స్టాంపులు ఉంటాయి. వీళ్ల దగ్గరే పేపర్లు ఉంటాయి. వీళ్లే డాక్యుమెంట్లు సృష్టిస్తారు. వీళ్లే వేలి ముద్రలు వేస్తారు. సంతకాలు చేస్తారు. ఇలాంటి పనులు ఇంట్లో కొడుకుకి నేర్పిస్తారు. ఇలాంటివి చేయొద్దని చెప్పా. హోటల్ లీజు వంటి చిన్న విషయంలో నా సంతకాన్ని ఫోర్జరీ చేయాల్సిన అవసరం లేదు. నన్ను అడిగేదెవరు.. నా ఇష్టం అనే భావన వల్లే ఇలా జరిగింది.
నా కూతురు చేసిన పనిని స్వాగతిస్తున్నా: ముత్తిరెడ్డి
ప్రజలకు మంచి చేయాలని నా కూతురు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. నేను స్థలాన్ని కబ్జా చేయలేదు. అది పట్టా భూమే. అందుకే వరద నీటి ముంపు బాధ తప్పించడానికి చేపట్టిన కాలువ నిర్మాణానికి కలెక్టర్‌తో పాటు నీటి పారుదల శాఖ అధికారులు అనుమతులు ఇచ్చి, నిధులు మంజూరు చేశారు. నా కూతురు అమాయకురాలు. అల్లుడు ప్రత్యర్థుల చేతిలో పావుగా మారాడు. వివాదాల విషయమై బంధువులతో చర్చలు జరిపాం. కానీ కొంత మంది రాజకీయ స్వార్థం కోసం నా బిడ్డ, అల్లుడిని బలి చేయాలని కుట్రలు చేస్తున్నారు. నేనేంటో నా బంధువులు, ప్రజలకు తెలుసు. ఎవరెన్ని కుట్రలు చేసినా..ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం సేవ చేస్తునే ఉంటా.