మునిసిపల్ రాజకీయం రసకందాయం
ABN , Publish Date - Dec 22 , 2023 | 12:01 AM
భువనగిరి మునిసిపాలిటీ రాజకీయం రసకందాయంగా మారుతోంది. పాలక పక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు.
క్యాంపునకు తరలిన బీఆర్‌ఎస్ అసంతృప్త కౌన్సిలర్లు
నేటి కౌన్సిల్ సాధారణ సమావేశం వాయిదాయే లక్ష్యం
విహారయాత్రకు వెళ్లిన పాలక పక్షం సభ్యులు
భువనగిరి టౌన్, డిసెంబరు 21: భువనగిరి మునిసిపాలిటీ రాజకీయం రసకందాయంగా మారుతోంది. పాలక పక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరగనుంది. 20 మంది ఉన్న బీఆర్‌ఎస్ కౌన్సిలర్లలో మెజార్టీ కౌన్సిలర్లు ఆరు కార్లలో చల్ మోహన రంగా అంటూ గురువారం రెండు రోజుల క్యాంప్‌కు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అవిశ్వాస రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ మేరకు నేడు జరుగనున్న కౌన్సిల్ సమావేశానికి విపక్ష కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్ల హాజరుపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. తెలంగాణ మునిసిపల్ చట్టం ప్రకారం కౌన్సిల్ సాధారణ సమావేశం జరగడానికి 35 మంది సభ్యులు గల మునిసిపల్ కౌన్సిల్‌లో కోరంగా 18 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. కోరం లేని నేపథ్యంలో చైర్మన్ సమావేశాన్ని వాయిదా వేసి అదే రోజు అరగంట అనంతరం తిరిగి నిర్వహిస్తే చైర్మన్ వైస్‌చైర్మన్‌తో సహా ఆరుగురు సభ్యులు హాజరైతే కోరంగా పరిగణిస్తూ సమావేశాన్ని నిర్వహించే అవకాశముంది. 18 మంది సభ్యులు హాజరయ్యే అవకాశాలు అంతంతే ఉండగా వాయిదా పడిన అనంతరం తిరిగి నిర్వహించే సమావేశానికి కోరంగా కనీసం ఆరుగురు సభ్యులైనా హాజరవుతారా అని మునిసిపల్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రోజంతా చర్చలే చర్చలు
అవిశ్వాస తీర్మానానికి శుక్రవారం జరుగనున్న కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని నాందిగా వాడుకోవాలనే లక్ష్యంతో బుధ, గురు వారాల్లో పార్టీలు, వర్గాల వారీగా కౌన్సిలర్లు చర్చల్లో మునిగి తేలారు. ఈ మేరకు రూపొందిచుకున్నా ప్రణాళిక మేరకే మెజార్టీ బీఆర్‌ఎస్ సభ్యులు విహార యాత్ర పేరిట వాహనాల్లో ఆంధ్రప్రదేశ్‌కు తరలి వెళ్లారు. తిరిగి శనివారం వచ్చేలా ముందుస్తుగా ప్రణాళిక రూపొందించుకున్నట్లు ప్రచారం అవుతోంది. అయితే స్థానికంగా ఉండే విపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీసుపై కలెక్టర్‌ను కలువనున్నట్లు పలువురు అనుకుంటున్నారు. దీంతో పాలక పక్షం సభ్యులు క్యాంప్ నుంచి తిరిగి వచ్చేసరికి అవిశ్వాస తీర్మానం ప్రత్యేక సమావేశంపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. కానీ ప్రస్తుత చైర్మన్, వైస్‌చైర్మన్‌ను గద్దె దించేందుకు అవసరమైన 24మంది సభ్యుల మద్దతు, నూతన చైర్మన్, వైస్‌చైర్మన్ ఏ పార్టీ, ఎవరికి దక్కుతాయనే అంశాలపై పలువురు కౌన్సిలర్లలో అనుమానాలు ఉన్నాయి. తదుపరి లక్ష్యంతో నిమిత్తం లేకుండా మొదటగా ప్రస్తుత చైర్మన్, వైస్‌చైర్మన్లను గద్దె దించడమే సమష్టిగా ఉండాలని ఓ వర్గం కౌన్సిలర్లు అంటుండగా, మరోవర్గం మాత్రం నూతన చైర్మన్, వైస్‌చైర్మన్‌పై స్పష్టత వచ్చేకే అవిశ్వాస తీర్మానంపై ముందడుగు వేయాలని పార్టీలతో నిమిత్తం లేకుండా మరో వర్గం కౌన్సిలర్లు వాదిస్తున్నట్లు ప్రచారం అవుతోంది. ఖర్చులు భరించే వారే చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల బరిలో ఉండాలని మిగితా కౌన్సిలర్లు తేటతెల్లం చేస్తున్నట్లు సమాచారం. అవిశ్వాస రాజకీయాలపై నేడు జరిగే కౌన్సిల్ సమావేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.