Share News

గల్ఫ్‌ నుంచి కదిలొచ్చి..

ABN , First Publish Date - 2023-11-20T04:33:49+05:30 IST

ఉద్యోగాలు, వ్యాపార నిమిత్తం గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న ప్రవాసభారతీయులు.. ఇతర దేశాల్లో ఉంటున్న ఎన్నారైలు.. తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి, తాము చేసే వ్యాపార బాధ్యతలను మరొకరికి అప్పగించి మరీ..

గల్ఫ్‌ నుంచి కదిలొచ్చి..

తమ అభిమాన అభ్యర్థుల తరఫున ప్రచారం

ద్యోగాలు, వ్యాపార నిమిత్తం గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి పొందుతున్న ప్రవాసభారతీయులు.. ఇతర దేశాల్లో ఉంటున్న ఎన్నారైలు.. తమ ఉద్యోగాలకు సెలవులు పెట్టి, తాము చేసే వ్యాపార బాధ్యతలను మరొకరికి అప్పగించి మరీ.. ఎన్నికల ప్రచారం కోసం తమ స్వస్థలమైన తెలంగాణకు చేరుకుంటున్నారు. తమ అభిమాన అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. గల్ఫ్‌ వలసల ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. సిరిసిల్ల రూరల్‌ మండలం బండలింగాపురం వేములవాడ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్ధి ఆది శ్రీనివాస్‌ గత ఎన్నికల్లో 5,268 ఓట్ల తేడాతో ప్రవాసీయుడైన చెన్నమనేని రమేశ్‌ బాబు చేతిలో ఓడిపోయారు. అంతకు ముందు ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆయన్ను ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి పంపాలని యూఏఈలోని అభిమానులు అభిలషిస్తున్నారు. ఈ క్రమంలోనే.. నియోజకవర్గ పరిధిలోని గోవిందారం గ్రామ వాస్తవ్యుడు, సౌదీలో ఆహార ధాన్యాల దిగుమతి వ్యాపారంలో తీరికలేకుండా ఉండే ప్యాట నారాయణ.. తన బాధ్యతలను సిబ్బందికి అప్పగించి మరీ స్వస్థలానికి వెళ్లి ఆది శ్రీనివాస్‌ తరఫున ప్రచారం చేస్తున్నారు. అలాగే అమెరికా నుంచి ఓ 15 మంది బీఆర్‌ఎస్‌ అభిమానులు తెలంగాణకు వెళ్లి ప్రచారం చేస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్‌ రూరల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్ధి బాజిరెడ్డి గోవర్దన్‌, జగిత్యాల జిల్లా కోరుట్ల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్‌, చాంద్రాయణగుట్ట మజ్లిస్‌ అభ్యర్ధి అక్బరుద్దీన్‌ ఒవైసీకి కూడా గల్ఫ్‌ దేశాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. వీరిలో చాలామంది ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ తెలంగాణకు చేరుకుని ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు.

గల్ఫ్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి

Updated Date - 2023-11-20T07:14:14+05:30 IST