పేదలకు మరిన్ని పథకాలు..!
ABN , First Publish Date - 2023-09-22T02:59:47+05:30 IST
రాష్ట్రంలోని పేదల కోసం మరిన్ని పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
త్వరలోనే కేసీఆర్ ప్రకటిస్తారు..
ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చేటోళ్ల మాటలు విని మోసపోవద్దు: కేటీఆర్
హైదరాబాద్ సిటీ/దుండిగల్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పేదల కోసం మరిన్ని పథకాలు అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. పేదలు, రైతులపై కేసీఆర్ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకుడు దేశంలోనే ఎవరూ లేరని చెప్పారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లు చెప్పిన దాని కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కేసీఆర్ అనుకుంటున్నారని తెలిపారు. త్వరలోనే ఆ విషయాలను ఆయనే స్వయంగా ప్రకటిస్తారని కేటీఆర్ చెప్పారు. ‘పనితో గెలవలేక.. ఇంతకుముందు ఏం చేశారో చెప్పుకోలేక.. కొందరు కొత్తకొత్త రూపాల్లో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చిన వారు ఇష్టానికిచ్చే హామీలు నమ్మి మోసపోదామా? పనిచేసే ప్రభుత్వాన్ని మళ్లీ ఆదరిద్దామా? ఆలోచించుకోవాలి’ అని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీ నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రెండో విడత డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీలో భాగంగా గురువారం దుండిగల్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేయడంతోపాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్‌తో కలిసి గృహసముదాయాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ప్రజాప్రతినిధుల జోక్యం లేదని, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామని తెలిపారు. అందుకే జగద్గిరిగుట్ట డివిజన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కౌసల్య, అదే డివిజన్‌లోని బీజేపీ నాయకురాలు సునీతకు మొదటి విడతలో ఇళ్ల కేటాయింపులు జరిగాయని, ఆ పార్టీ కార్యకర్తల మనసులూ మారుతున్నాయని చెప్పారు. రెండో విడతలోనూ అంతే పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.
ఇప్పటి వరకు 30 వేల ఇళ్లు..
ఇప్పటి వరకు దాదాపు 30 వేల మందికి డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. మరో 70 వేల ఇళ్లు కూడా అర్హులకు పారదర్శకంగా అందజేస్తామని ఉద్ఘాటించారు. ఎవరికీ ఒక్కపైసా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో తెలంగాణ మినహా మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి సౌకర్యవంతమైన ఇళ్లు ఏ ప్రభుత్వం నిర్మించి ఇస్తుందో చూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రెండేళ్ల క్రితమే ఇళ్లు పంపిణీ చేయాల్సి ఉన్నా.. కరోనా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆలస్యమైందని చెప్పారు. పటాన్‌చెరులో మంత్రి హరీశ్‌రావు, మన్సాన్‌పల్లిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హట్టిగూడలో మంత్రి మహేందర్‌రెడ్డి, తట్టి అన్నారంలో మహమూద్ అలీ, జవహర్‌నగర్‌లో మల్లారెడ్డి, చర్లపల్లిలో తలసాని, తిమ్మాయిగూడలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇళ్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తం 24నియోజకవర్గాలకు సంబంధించి ఎంపికైన 13300మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
ప్రభుత్వ కార్యక్రమాలకు మైనంపల్లి దూరం..!
మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును అధికార బీఆర్‌ఎస్ దూరం పెడుతోంది. ఆయన తనంతట తానుగా పార్టీని వీడే పరిస్థితి కల్పిస్తోంది. ఎన్నికలే లక్ష్యంగా సర్కారు చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడమే దీనికి నిదర్శనం. ప్రోటోకాల్ ప్రకారం పిలుస్తున్నామని అధికారులు చెబుతుండగా.. అందుబాటులో లేక రావడం లేదని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. మల్కాజిగిరికి చెందిన 500 మంది లబ్ధిదారులకు గురువారం చర్లపల్లిలో డబుల్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొనలేదు. అలాగే ఈ నెల 2న జరిగిన మొదటి దశ పంపిణీకి కూడా దూరంగా ఉన్నారు.