ఎస్సీ వర్గీకరణపై మోదీ మాట్లాడాలి
ABN , First Publish Date - 2023-11-06T04:52:10+05:30 IST
ఎన్నికల సందర్భంగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రం రెండుసార్లు తీర్మానాలు పంపినా జాప్యమెందుకు?
మాదిగలకు నామినేటెడ్ పదవులిస్తాం
ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు జాతీయ స్థాయిలో కీలకపాత్ర
మాదిగల యుద్ధభేరిలో మంత్రి హరీశ్
కవాడిగూడ, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సందర్భంగా తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణపై ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఎస్సీ వర్గీకరణపై తొమ్మిదన్నరేళ్లుగా కాలయాపన ఎందుకో చెప్పాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. అప్పుడు ఎస్సీ వర్గీకరణ సాధించి తీరుతామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత మాదిగలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్ టీఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్, ధర్నా చౌక్‌లో ఆదివారం జరిగిన మాదిగల యుద్ధభేరి సభలో హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. దళితుల అభ్యున్నతి కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని 33 జిల్లాల్లో స్డడీ సర్కిళ్లు, 50 రెసిడెన్షియల్ కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. హైదరాబాద్‌లో సదాలక్ష్మి విగ్రహం ఏర్పాటుతోపాటు మాదిగ భవన నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించిందని చెప్పారు. రాబోయేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇక, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో పార్లమెంటులో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ పదేళ్లుగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల్లో మాదిగలు బీఆర్‌ఎ్‌సకే మద్దతు ఇస్తారని స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడిపాపయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు : హరీశ్
కూకట్‌పల్లి: కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో మతకలహాలు, కర్ఫ్యూలు ఉండేవని, బీఆర్‌ఎస్ అధికారం చేపట్టాక అలాంటి పరిస్థితే లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రజలు కర్ఫ్యూ అనే మాటనే మరచిపోయారని తెలిపారు. ఎరుకల అభ్యున్నతికి బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందన్నారు. ఈ మేరకు కూకట్‌పల్లిలో ఆదివారం జరిగిన ఎరుకల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడారు. ఎరుకల జాతి బిడ్డ కూతాడి రాములు బోయినపల్లి మార్కెట్ చైర్మన్ కావడం సీఎం కేసీఆర్ గొప్పదనం అన్నారు. రూ.5 కోట్లతో ఎరుకలకు నిజాంపేటలో ఆత్మగౌరవ భవనం నిర్మించామని పేర్కొన్నారు.