‘మిథునం’ కథారచయిత శ్రీరమణ కన్నుమూత
ABN , First Publish Date - 2023-07-20T04:43:06+05:30 IST
పేరడీలతో సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించి..
హైదరాబాద్ సిటీ, వేమూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పేరడీలతో సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించి.. వ్యంగ్య రచనల్లో మేటిగా ఎదిగి.. తెలుగు సాహిత్య అభిమానులను దశాబ్దాలుగా అలరించిన ప్రముఖ రచయిత శ్రీరమణ (71) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, బుధవారం తెల్లవారుజామున 2.40 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీరమణ అసలు పేరు వంకమామిడి రాధాకృష్ణ. మాతామహుడికి దత్తత వెళ్లాక కామరాజు రామారావుగా మారింది.. శ్రీరమణ స్వస్థలం ఏపీలోని తెనాలి సమీపంలో ఉన్న వరాహపురం అగ్రహారం. కళాశాల విద్యార్థి దశలోనే పేరడీ రాసి ‘ఆంధ్రజ్యోతి’కి పంపారు. ఆయన రచనా శైలికి మెచ్చిన ఆనాటి ఎడిటర్ నండూరి రామ్మోహనరావు ‘రంగుల రాట్నం’ కాలమ్ రాసే అవకాశం ఇచ్చారు.
తర్వాత ఆయన ‘ఆంధ్రజ్యోతి’ వీక్లీలో ఉద్యోగిగా చేరారు. అనంతరం ‘ఆంధ్రజ్యోతి’ నవ్య వీక్లీ ఎడిటర్‌గా సుదీర్ఘకాలం బాధ్యతలు నిర్వర్తించారు. ప్రముఖ దర్శకుడు బాపు, రమణ సాన్నిహిత్యంతో మద్రాసుకు మకాం మార్చారు. పలు సినీకథా చర్చల్లో పాల్గొనడంతో పాటు ‘గందరగోళం’, ‘వీడెవడండీ బాబు’ చిత్రాలకు మాటలు అందించారు. ‘మిథునం’, ‘బంగారు మురుగు’, ‘ధనలక్ష్మి’, ‘వరహాలబావి’, ‘సోడానాయుడు’ తదితర కథలు రాశారు. ‘మిథునం’ కథను ఎస్పీబాలు, లక్ష్మి నటీనటులతో తనికెళ్ళ భరణి సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే.! శ్రీరమణ భార్య జానకి. వీరికి ఇద్దరు కుమారులు చైత్ర, వంశీకృష్ణ. గురువారం మధ్యాహ్నం 1గంటకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి.