25 స్థానాల్లో ఎంఐఎం పోటీ..?
ABN , First Publish Date - 2023-10-30T04:10:33+05:30 IST
శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడంపై ఎంఐఎంలో తర్జనభర్జన నెలకొంది.
25 స్థానాల్లో ఎంఐఎం పోటీ..?
వారసుల ఒత్తిడితో తుది కూర్పుపై తర్జనభర్జన
సిటింగ్ మినహా మిగతా స్థానాల్లో బీఆర్‌ఎస్ కోసమే పోటీ!
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడంపై ఎంఐఎంలో తర్జనభర్జన నెలకొంది. పార్టీలో అంతర్గతంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా అధినేత అసదుద్దీన్ ఒవైసీపై టికెట్ల కోసం ఒత్తిడి పెరుగుతోంది. ఏదేమైనా రెండ్రోజుల్లో 25 మందితో జాబితా విడుదల చేయడానికి ఆ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ (యాకుత్‌పురా), ముంతాజ్ ఖాన్ (చార్మినార్) వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా పోటీ నుంచి తప్పించాలని నిర్ణయించగా వారి స్థానాల్లో తమకే టికెట్ ఇవ్వాలని ముంతాజ్ అహ్మద్ ఖాన్ కుమారుడు ఇంతియాజ్ ఖాన్, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మెరాజ్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆయనను యాకుత్‌పురాకు పంపి ఆయన స్థానంలో నగర మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ టికెట్ ఇవ్వాలని పార్టీ అధినేత నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ పరిస్థితులు అనుకూలించని పక్షంలో మాజిద్ హుస్సేన్‌కు బదులుగా కాంగ్రె్‌సకు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు సోహెల్ పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే బహదూర్‌పురా ఎమ్మెల్యే మౌజంఖాన్‌ను సైతం మార్చి ఆయన స్థానంలో మరో మాజీ మేయర్ జుల్ఫిఖర్ అలీని ఎంపిక చేయనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక యాకుత్‌పురా నుంచి జాఫర్ హుస్సేన్ మెరాజ్‌ను పోటీకి దించాలని పార్టీ యోచిస్తుండగా తన కుమారునికే టికెట్ ఇవ్వాలని ప్రస్తుత చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ పట్టుబట్టినట్లు తెలిసింది. కార్వాన్‌లో కౌసర్ మొహియుద్దీన్, మలక్‌పేట్‌లో బలాలను మళ్లీ పార్టీ తరఫున పోటీ చేయించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే మూడో తరం యువతకు అప్పుడే రాజకీయ అరంగ్రేటం వద్దని అసదుద్దీన్ ఒవైసీ సూచిస్తుండగా.. తమ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీకి చార్మినార్ టికెట్ కేటాయించి తీరాలని అక్బరుద్దీన్ ఒవైసీ ఒత్తిడి పెంచినట్టు తెలిసింది.
మిగతా స్థానాల్లో బీఆర్‌ఎ్‌సను గెలిపించేలా..
ఇక తమ ఏడు సిటింగ్ స్థానాల్లో తిరిగి విజయం ఖాయమనే ధీమాతో ఉన్న ఎంఐఎం నాయకులు.. మిగతా స్థానాల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు వ్యూహాత్మకంగా పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలని నిర్ణయించారని తెలిసింది. ఏడు సిటింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, అంబర్‌పేట్, మహేశ్వరం, వికారాబాద్, నిజామాబాద్, నిర్మల్, కరీంనగర్‌తో పాటు మరికొన్ని స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించాలని యోచిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థులకు పడకుండా ఎంఐఎం వైపు మళ్లించి పరోక్షంగా బీఆర్‌ఎ్‌సను గెలిపించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు తెలిసింది.